ఇదీ సీసీ కెమెరా ‘క్రెడిట్’
చిక్కడపల్లి: సీసీ కెమెరా ఓ ఎన్నారై జీవితంలో వెలుగులు నింపింది... దీనికి సంబంధించిన వివరాలివీ... ఎల్బీనగర్ నాగోల్ శ్రీ సాయి రాఘవేంద్ర కాలనీకి చెందిన వీరారెడ్డి కుమార్తె శిరిష రెడ్డి(37) అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్‌సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విక్టోరియా కేఫ్ వద్ద ఉన్న వ స్త్ర దుకాణంలో జూన్ 22న షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ కారు దిగుతున్నపుడు ఆమె సెల్‌ఫోన్‌తో పాటు అమెరికాకు చెందిన సోషల్ సర్వీస్ కార్డు , డెబిట్, క్రెడిట్ కార్డులతో ఉన్న పర్సు కింద పడిపోయింది. షాపింగ్ అనంతరం ఇంటికిచేరుకున్న ఆమె.. పర్సు లేకపోవ డాన్ని గుర్తించి చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతలో బాధితురాలి పర్సు దొరికిన వ్యక్తి క్రెడిట్ కార్డుతో ఓ దుకాణంలో సెల్‌ఫోన్ కొనుగోలుకు యత్నించాడు. వెంటనే శిరిషకు మెయిల్ రావడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిమాయత్ నగర్‌లో ఆ వ్యక్తి సెల్‌ఫోన్ కొనుగోలుకు యత్నించిన దుకాణానికి వెళ్లిన పోలీసులు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన బావ ఎల్లేష్‌కు పర్సు దొరకడంతో తనకు ఇచ్చాడని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు నిందితుని నుంచి పర్సు, వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితురాలికి అందజేశారు. సోషల్ సర్వీస్ కార్డు లభించకపోతే తాను మళ్లీ విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం ఉండేది కాదని ఆమె చెప్పారు. తనకు సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాబీ, ఎస్‌ఐ నరేందర్‌తో పాటు క్రైమ్ సిబ్బందిని ఇన్‌స్పెక్టర్ మంత్రి సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఎస్.ఐ.పురేందర్‌రెడ్డి అభినందించారు.