
మీరే మంచి స్నేహితురాలు!
పదేళ్ల పిల్లలకీ, పదిహేనేళ్లు దాటిన అమ్మాయిలకీ ప్రవర్తనలో గానీ, ఆలోచనా విధానంలో గానీ చాలా తేడా ఉంటుంది. ఆ వయసులో అమ్మగా వారిపట్ల మీ ప్రవర్తనలో, ఆలోచనలో కూడా మార్పు రావాలి.
సెల్ఫ్ చెక్
పదేళ్ల పిల్లలకీ, పదిహేనేళ్లు దాటిన అమ్మాయిలకీ ప్రవర్తనలో గానీ, ఆలోచనా విధానంలో గానీ చాలా తేడా ఉంటుంది. ఆ వయసులో అమ్మగా వారిపట్ల మీ ప్రవర్తనలో, ఆలోచనలో కూడా మార్పు రావాలి. లేదంటే అనవసరమైన అపోహలతో మీరు, తల్లిదండ్రులు అనుమానపు భూతాలనే భ్రమలో వాళ్లు..రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరి, మీరెలా ఉన్నారో చెక్ చేసుకోండి.
1. అమ్మాయిలు కాలేజీలో అడుగుపెడుతున్నారంటేనే... కొత్త ప్రపంచానికి దగ్గరగా వెళుతున్నారని అర్థం చేసుకుంటారు. కొత్త స్నేహితుల గురించి, వారికెదురయ్యే అనుభవాల గురించి వారు చెప్పే విషయాల్ని విని వారికి తగిన సలహాలిస్తుంటారు.
ఎ.అవును బి.కాదు
2. ట్రెండ్‌కి తగ్గ ఫ్యాషన్లను మీ పిల్లలు ఇష్టపడుతుంటే...మీ నియమాలను సున్నితంగా పిల్లలకు వివరిస్తారు. సందర్భోచితంగా అమ్మాయిలతో మీ కుటుంబ సంప్రదాయల గురించి, వాటి వల్ల ఉండే ప్రయోజనాల గురించి చెబుతుంటారు.
ఎ.అవును బి.కాదు
3. అవసరం కోసం మాత్రమే సెల్‌ఫోన్ వాడకాన్ని ప్రోత్సహిస్తారు. అలాగని వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారనే విషయాలపై ప్రత్యేక నిఘా పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టరు. ఒకవేళ వారి ప్రవర్తనపై ఏమైనా అనుమానం వస్తే... సమయం చూసి నేరుగా చర్చిస్తారు.
ఎ.అవును బి.కాదు
4. స్నేహాలు, సినిమాలు, పార్టీలు...ఇలాంటివన్నీ ఈరోజుల్లో కామన్ కాబట్టి పిల్లల విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. వారేదైనా ఇబ్బందిలో పడినప్పుడు ఆలోచించవచ్చనుకుంటారు.
ఎ.కాదు బి.అవును
5. పిల్లల స్నేహితుల తెలుసుకుంటారు. అలాగే పిల్లల అలవాట్లను, ఆలోచన విధానాన్ని గమనిస్తుంటారు. పిల్లలు చెడుదారిలో వెళుతున్నట్లు తెలిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా, సమస్యను సున్నితంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఎ.అవును బి.కాదు
‘ఎ’లు ఎక్కువ వచ్చినట్లయితే మీకు మీ అమ్మాయిలతో మంచి అనుబంధం ఉన్నట్లు. లేదంటే మీ దారి మీది, మీ పిల్లల దారి పిల్లలది అని అర్థం. వీలైనంతవరకూ టీనేజ్ అమ్మాయిలతో అమ్మ స్నేహితురాలిగా ఉండడం వల్ల చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు.