ప్రభు చౌహాన్ ఒకరోజు సస్పెన్షన్
సెల్’ కథ ఇలా సుఖాంతం
భవిష్యత్తులో తప్పు పునరావృతం చేయకూడదని అంబి, మల్లికార్జునకు హెచ్చరిక
సభా కార్యక్రమాల్లో మొబైల్ ఉపయోగం ఇక నిషేధం
ఆదేశాలు జారీ చేసిన స్పీకర్
బెంగళూరు: అసెంబ్లీ సమావేశాల్లో సెల్‌ఫోన్‌ను వినియోగించిన ముగ్గురు ప్రజాప్రతినిధుల్లో ఒకరిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరికి స్పీకర్ కఠిన హెచ్చరికలు శుక్రవారం జారీ చేశారు. అంతేకాకుండా ఇకపై సభా కార్యక్రమాలు జరుగుతుండగా సెల్‌ఫోన్‌ను వాడటాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు... శాసనసభలో చెరుకు మద్దతు ధర పై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ (ఔరాద్ నియోజకవర్గం) తన సెల్‌ఫోన్‌లోని ప్రియాంక గాంధీ ఫొటోను అసభ్యంగా తాకుతూ (టచ్ చేస్తూ) మీడియాకు గత బుధవారం దొరికి పోయిన విషయం తెలిసిందే. అదే రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అంబరీష్, ఎమ్మెల్యే మల్లికార్జున శాసనసభలో సెల్ ఫోన్‌తో కాలక్షేపం చేయడం ఒక రోజు ఆలస్యంగా (గురువారం) వెలుగులోకి వచ్చింది. దీంతో అధికర విపక్షపార్టీలు ‘మీ వాళ్లను సస్పెండ్ చేయాలంటే.. కాదు మీ వాళ్లను సస్పెండ్ చేయాలి’ అంటూ ఉభయ సభల్లో రాద్ధాంతం ృష్టించి కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో రెండు రోజుల సమయం వృథా అయింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే విపక్షనాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఇంకా సభా సమయాన్ని వృథా చేయడం తమకు ఇష్టం లేదన్నారు. అందువల్ల శాసనసభలో సెల్‌ఫోన్ వాడిన సభ్యులపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని ‘శాసనసభలో అసభ్య రీతిలో ఓ మహిళ ఫొటోను జూమ్ చేసి చూసినందుకు ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌ను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. అదేవిధంగా శాసనసభలో మొబైల్ చూసిన మంత్రి అంబరీష్, శాసనసభ్యుడు మల్లికార్జునలు భవిష్యత్‌లో ఇలాంటి తప్పు మరోసారి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా సభాకార్యక్రమాలు జరుగుతున్న సమయంలో మొబైల్‌ను వినియోగించడం నిషేదిస్తున్నా...’ అని పేర్కొన్నారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప సూచన మేరకు ప్రభు చౌహన్ సభ నుంచి వెళ్లిపోయారు.