గురుగ్రామ్, హర్యానా : స్వలింగ సంపర్కం గురించి ఈ మధ్యకాలంలో మనదేశంలో బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతీయ న్యాయస్మృతిలోని ‘సెక్షన్ 377’తో పాటు మరికొన్ని సెక్షన్‌లు స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్నాయి. దీంతో సంబంధిత సెక్షన్లలో మార్పులు చేయాలని ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు జరగుతున్నాయి. ‘హోమోసెక్సువల్’/‘గే’/‘లెస్బియన్’గా మారడానికి కారణం హర్మోన్ల ప్రభావమని డాక్టర్లు చెప్తున్న తరుణంలో ఒక ప్రముఖ వార్త పత్రికలో వచ్చిన ప్రకటన ఇప్పుడు అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ ప్రకటనలో ‘పెళ్లికి ముందే మీ కుమారుడు లేదా కూతురు ‘గే’ లేదా ‘లెస్బియనా’ అనే విషయం తెలుసుకొండి’ అంటూ ఫోన్ నంబరు కూడా ఇచ్చాడు గుర్గావ్‌కు చెందిన ఓ నకిలీ వైద్యుడు. ఈ ప్రకటనను కాస్తా ఎవరో ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దాంతో ఈ డాక్టరు గారి కథేంటో తెలుసుకుందామని ఓ యువతి ప్రకటనలో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో సదరు యువతి తనకు 40 ఏళ్లని, తన కుమారుడికి 17 ఏళ్లని పరిచయం చేసుకుంది. అవతలి వ్యక్తి తనను తాను ‘వైద్యుడి’గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు ‘డాక్టరు’ ఆ మహిళను ఎక్కువ ప్రశ్నలేమి వేయకుండానే ఆమె కొడుకును ‘గే’ అని తెల్చేశాడు. ‘గే అంటే అర్ధం తెలుసు కదా...!’అని సదరు మహిళను ప్రశ్నించాడు.
అంతేకాక ‘నీ కుమారుడికి బాగా కోపం వస్తుందా’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు’ అని సమాధానమిచ్చింది. అందుకు ఆ వైద్యుడు ‘అతడు లోపల బాధపడుతున్నాడు. మీ అబ్బాయి గే అనే విషయం అతనికే తెలియదు. అందుకే ఆ విషయం గురించి మీతో చెప్పడం లేదు అన్నాడు.’ అంతేగాక ‘అమెరికాలో దాదాపు 40 శాతం పురుషులు ‘గే’లే’ అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. ఒక వ్యక్తి ‘గే’గా మారాడానికి ఈ వైద్యుడు చెప్పిన కారణం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
ఫోన్ సంభాషణలో భాగంగా సదరు వైద్యుడు ‘మీ అబ్బాయికి సెల్‌ఫోన్ ఇచ్చారా..?’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘అవున’ అన్నారు. ఇంకేముంది ఆ వైద్యుడు ‘నీ కొడుకు ‘గే’గా మారడానికి కారణం సెల్‌ఫోనే’ అని తెల్చేశాడు. అందుకు ఆ మహిళ ముందు ఆశ్చర్యపోయినా తరువాత అమాయకంగా ‘ఫోన్ వాడకుండా ఉంటే నా కొడుకు మాములుగా మారతాడా...?’ అని ప్రశ్నించింది. అందుకు ఆ డాక్టర్ మీరు హౌస్‌వైఫ్ అయ్యుంటారన్నాడు. తర్వాత ఫోన్ నుంచి విడుదలయ్యే ‘అతినీలలోహిత’ కిరణాల వల్ల పురుషులు ‘గే’ గా మారతారని చెప్పాడు.
అందుకు ఆ మహిళ ‘నేనూ ఫోన్‌లో మాట్లాడుతున్నాను కదా...నేను ‘గే’గా మారతానా అని ప్రశ్నించగా అందుకు ఆ డాక్టర్ అలా ఏం ఉండదు ఎందుకంటే స్త్రీలలో ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా ఒక వేళ పురుషుల్లో కూడా ఈ ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉన్నట్లయితే వారు ‘గే’గా మారే అవకాశం చాలా తక్కువని వారికి పుట్టే పిల్లలు కూడా ‘గే’గా మారే అవకాశం తక్కువని తెల్చేశాడు. అంతేకాక తాను వైద్యం చేసి సదరు మహిళ కొడుకుకు నయం చేస్తానని అందుకు అతని ఫోటో కావాలని అడిగాడు. ‘గే’ నుంచి మాములు మనిషిగా మార్చడానికి కొన్ని ‘శక్తుల కషాయాల’ను ఆ మహిళ కొడుకు శరీరంలోకి పంపించాలని అందుకు ఖర్చవుతుందని తెలిపాడు.ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment