పెళ్లయ్యాక ప్రేమ ఇలా ఉండొచ్చా? | Special story on after marriage love | Sakshi
Sakshi News home page

పెళ్లయ్యాక ప్రేమ ఇలా ఉండొచ్చా?

Published Thu, Dec 6 2018 12:00 AM | Last Updated on Thu, Dec 6 2018 12:00 AM

Special story on after marriage love - Sakshi

ప్రేమ నుంచి పెళ్లి దాకా వెళ్లగలగడం అదృష్టమే. పెళ్లయ్యాక అదే ప్రేమను  కోరుకుంటే మాత్రం ఆ అదృష్టం..  తిరగబడినట్లనిపిస్తుంది! ఈ స్టోరీలో భార్య..  భర్తనుంచి పెళ్లికి పూర్వపు ప్రేమను కోరుకుంది.  అనుక్షణం ఆ ప్రేమ కోసం  ఆరాటపడింది..  అలమటించింది..  చేజారిపోతాడేమోనని భయపడింది.  చివరికి ఆ దాంపత్యం  ఎలా సెట్‌రైట్‌ అయింది?

బీప్‌ బీప్‌... సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ బ్లింక్‌ అయ్యింది. ఆఫీసులో ఉన్నాడు అతను. తీసి చూశాడు. భార్య నుంచి.‘ఏం చేస్తున్నావు?’ మళ్లీ బీప్‌ బీప్‌ శబ్దం వచ్చింది. ‘తిన్నావా?’ మళ్లీ బీప్‌. ‘ఇవాళ ఆఫీసుకు వెళ్లేప్పుడు నా వైపు తిరిగి చూడలేదు నువ్వు’ మళ్లీ బీప్‌. ‘అసలు నేనంటే నీకు ప్రేముందా?’ మళ్లీ బీప్‌. ‘అలా అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు’ మళ్లీ బీప్‌. ‘ఇదంతా నా ఖర్మ’. అతడు నిస్పృహగా ఫోన్‌ పక్కన పెట్టేశాడు. ఆ రోజు ఆఫీసులో చేయాల్సిన పని అంతా గంగపాలు.

సాయంత్రం భయం భయంగా ఇంటికి వెళ్లాడతను. తల్లిదండ్రులు అప్పటికే వృద్ధులు. ఇద్దరికీ 70 దాటాయి. ఆఫీసు నుంచి రాగానే వాళ్లను చూడాలి. లేదా వాళ్లు తనను చూడాలి. వాళ్ల దగ్గర పది నిమిషాలు కూచుంటే ఇరుపక్షాలకూ తృప్తి. కాని అదే జరిగితే? ‘హు.. అంతేలేండి ఇంటికొచ్చిన ఏ మగాడైనా భార్య ముఖం చూద్దామనుకుంటాడు. మీరు ఉన్నారు దండగముఖం వేసుకుని. ఏకంగా అమ్మా అయ్యల దగ్గరకు వెళ్లి వాళ్ల వీపు వెనుక దాక్కోవడమే’ ఆ తిట్లు ఎందుకు అని నేరుగా గదిలోకి వెళ్లాడు. వెళ్లి భార్యను చూసి దడుచుకున్నాడు. పొద్దున ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. తిన్నట్టు లేదు. స్నానం చేసినట్టు లేదు. అసలు గది నుంచి కదిలినట్టే లేదు. గుండెలు దడదడలాడాయి. అంటే బయటకు వచ్చి తల్లిదండ్రులకు భోజనం పెట్టిందా? అసలు వంట చేసిందా? కోపం నషాళానికి అంటింది. కాని వీలైనంత అనునయంగా ‘ఏమైంది?’ అని అడిగాడు. ‘నువ్వు నాతో ప్రేమగా లేవు’ ‘ఎందుకు అలా అంటావు. నీకు కావలసినవన్నీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు నీతోనే ఉంటాను’... ‘మరి ఆఫీసుకు వెళ్లాక ఒక్క మెసేజన్నా పెడుతున్నావా? ఒక్క కాల్‌ అన్నా చేస్తున్నావా?’ ‘అంటే పని చేయవద్దా?’ ‘చేయాలో వద్దో నీ ఇష్టం. కాని నాకు నీ ప్రేమ కావాలి. ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను ప్రేమిస్తూనే ఉండాలి’‘లేకుంటే?’ ‘నేను చచ్చిపోతాను. లేదా నిన్ను చంపేస్తాను’.

‘డాక్టర్‌... ఇదీ నా పరిస్థితి. ఇంటికి వెళ్లలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు పూర్తిగా భయపడిపోయారు. ఈ స్థాయి ప్రేమ నరకంగా ఉంది. దీనిని తట్టుకోలేక, ఇంటికి వెళ్లలేక, బయట ఉండలేక తాగుడుకు బానిస అయ్యాను. నా భార్యను మీరే ట్రీట్‌ చేయాలి’ అన్నాడు అతను.సైకియాట్రిస్ట్‌ తల పంకించి అతని వైపు చూశాడు. 37 ఏళ్లు ఉంటాయి.‘మీ పెళ్లయి ఎన్నేళ్లు?’‘ఒకటిన్నర సంవత్సరం’‘సరే... మీరు వెళ్లి ఆమెను పంపండి’ఆమె వచ్చింది. చూశాడు. చామనఛాయలో సన్నగా పలుచగా కళ్ల కింద నలుపుతో ఉంది. అప్రసన్నంగా ఉంది. 33 లేదా 34 ఏళ్లు ఉంటాయి.‘మనం కాసేపు మాట్లాడుకుందామా?’ అడిగాడు. తల ఊపింది.ఆమె పేరు రాధ. బాల్యం అనగానే ఆమెకు గుర్తుకు వచ్చేది కృష్ణుడి కోవెల. అక్కడకు తీసుకెళ్లే తండ్రి జ్ఞాపకం. ఐదేళ్ల వయసులో తండ్రి భుజం దిగేది కాదు. తండ్రి చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు. సైకిల్‌ మీద కూచోబెట్టి తిప్పేవాడు. ఎనిమిదేళ్లు వచ్చాయి. తండ్రి రావడం మానేశాడు. రోజూ గేటు దగ్గర నిలబడి చూసేది. వచ్చేవాడు కాదు. రాత్రి పూట ఉలిక్కిపడి లేచి చూసేది. ఉండేవాడు కాదు. వీపు మీద కూచోబెట్టి తిప్పిన తండ్రి... బంగారూ అని పిలిచే తండ్రి... ఎగరేసి పట్టుకునే తండ్రి... ఎలా వదిలేశాడు?తర్వాత తెలిసింది.అమ్మ ఆయనకు రెండో భార్య అట.మొదటి భార్య గోల చేసి గగ్గోలు పెట్టేసరికి రావడం మానేశాడట. వేరే ఊరు వెళ్లిపోయాడట.‘ఇలా చేస్తారా ఏ నాన్నైనా?’ చిన్న వయసులో నిస్సహాయత నుంచి కోపం వచ్చింది. నాన్న మీద కోపం మగాళ్ల మీద కోపంగా మారింది. అసలు ప్రతి విషయం మీద కోపంగా మారింది. వయసు వచ్చింది. కాని ఆ వయసు ఎవరి కోసం? ఏ మగాణ్ణి నమ్మాలని. వద్దు.. ఏ మగాణ్ణీ నమ్మొద్దు. వయసు పెరుగుతూ పోయింది. తల్లికి ఇది బెంగ. బాగా చదివించుకుని జాగ్రత్తగా పెంచుకుందని అనుకుంది కాని కూతురి మనసులో ఇలాంటి విపరీతం ఉందని తెలుసుకోలేదు.అలాంటి టైములో వేణు కనిపించాడు. ఇద్దరివీ వేరు వేరు ఆఫీసులే అయినా ఒకే బస్‌లో ప్రయాణించేవారు. రెండు మూడు నెలల పరిచయం తర్వాత ఒకసారి మాటల్లో ‘బంగారూ’ అని పిలిచాడు. అంతే. ఎక్కడో శిథిలాలలో ఉన్న తండ్రి జ్ఞాపకం సజీవంగా మేల్కొంది. ఇతను తన తండ్రి లాంటివాడే. అప్పటి తండ్రిలా అంతే ప్రేమ పంచేవాడా? అవును అనుకుంది. వేణులోని మంచితనాన్ని ప్రేమించింది. స్నేహితుణ్ణి ప్రేమించింది. తండ్రి స్పర్శను ప్రేమించింది. ఇంట్లో ముగ్గురు అక్కయ్యల పెళ్లి అయ్యేంత వరకు ఆగి వయసు మీదకు తెచ్చుకుని ఉన్న అతణ్ణి మరో ఆలోచన లేకుండా పెళ్లాడింది. అతడి కోసం పూర్తి ఇల్లాలిగా ఉండాలని ముందే ఉద్యోగం మానేసింది.పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు.

కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్‌ మొదలయ్యింది.అది ఎలాంటి ప్రాబ్లమ్‌ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. లేదా తన మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో? దొరక్క దొరక్క దొరికాడు ఇష్టపడే మగవాడు. వాణ్ణి వదలకూడదు. అందుకే బంధించడం పెంచింది.ఎంత పెంచిందంటే అతడికి ఊపిరి సలపక చచ్చిపోయేంత.ఇద్దరినీ పిలిచి కూచోబెట్టాడు సైకియాట్రిస్ట్‌.ఆమె వైపు చూస్తూ అన్నాడు.‘ఏమ్మా... చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇన్‌లాండ్‌ కవర్‌ అంటించావా?’తల ఊపింది.‘ఇన్‌లాండ్‌ కవర్‌కు ఆల్రెడీ కొద్దిగా జిగురు పూత ఉంటుంది. మనం నాలుకతో కొంచెం తడి చేసి అంటిస్తే అంటుకుంటుంది. ఉత్తరం అందుకున్నవారు కొంచెం నైపుణ్యంతో విప్పితేచిరగకుండా విప్పుకుంటుంది. అవునా?’మళ్లీ తల ఊపింది.‘అలా కాదని కవర్‌ బాగా అంటుకోవాలని బంక రాసి చాలనట్టు జిగురు రాసి అదీ చాలనట్టు ఫెవికాల్‌ కూడా రాసి అంటిస్తే ఏమవుతుంది?’మౌనంగా చూసింది.‘కవర్‌ పాడవుతుంది. చిరుగుతుంది. పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. ప్రాక్టికల్‌ రిలేషన్‌ అంటారు. పెళ్లి ఒక ప్రాక్టికల్‌ రిలేషన్‌. మీ ఇద్దరి స్వేచ్ఛను మీరు గౌరవిస్తూ మీ అనుబంధాన్ని పెంచుకుంటూ సంసారం నడవడానికి అవసరమైన నియమాల్ని పాటిస్తూ ముందుకు సాగాలి. కాని నువ్వు అతని నుంచి అతి ప్రేమను ఆశించి జీవితం నాశనం చేసుకుంటున్నావు. నువ్వే కాదు.. ఈ పని కొందరు మగాళ్లు కూడా చేస్తారు. భార్య మీద ఓవర్‌ పొజెసివ్‌నెస్‌తో ఆమె జీవితం నరకం చేస్తారు. పరస్పరం నమ్మకం, గాఢమైన ప్రేమ ఉంటే సంవత్సరం దూరంగా ఉన్నా ఏమీ కాదు. ఆ నమ్మకం ఏర్పడకపోతే వీధి చివరకు వెళ్లి వచ్చేలోపల అనుమానం వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. కోరుకుంటున్నాడు. ఇక మారాల్సింది నువ్వే’ఆమె పలుచటి కన్నీటి తెర వచ్చింది.‘చూడమ్మా... దొరక్క దొరక్క దొరికింది చేజారిపోవాలన్న నియమం లేదు. ఆలస్యంగా పూచిన పువ్వుకు కూడా అంతే పరిమళం ఉంటుంది. సందేహాలు పెట్టుకోకు.భర్త కోసం జీవించడం మంచిదేకానీ అదే నీ జీవితం కాదు. నువ్వు కూడా ఉద్యోగం చేయి. నీ స్పేస్‌ నువ్వు తీసుకో. అలాగే భర్తను అతను కోరుకునే విధంగా అతని తల్లిదండ్రులను నీవారిగా భావిస్తే నీ అభద్రతపోతుంది. జీవితం సంతోషంగా ఉంటుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.అతని టేబుల్‌ మీద ఉన్న ఫ్లవర్‌వాజ్‌లో తాజా గులాబీలు ఉన్నాయి.వాటి తేలికపాటి సువాసన వారి జీవితంలో కూడా వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం ఆమెలో కనిపించింది.

పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్‌ మొదలయ్యింది. అది ఎలాంటి ప్రాబ్లమ్‌ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో.  
– ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, 
సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement