
సిన్మా చూపిస్తా
కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కానీ కాళ్లు తొక్కకుండా థియేటర్‌లోకి వెళ్లి సీట్లో కూచోలేం. ఒకవేళ మనం ఎవరి కాళ్లూ తొక్కకుండా జాగ్రత్త పడినా సరే, మన కాళ్లని ఎవరో ఒకరు తొక్కుడు బిళ్ల ఆడేస్తారు. ఒకసారి ఒకాయన సెల్‌ఫోన్ వెలుతురులో తారాడుతూ వచ్చి నేనే తన సీటనుకుని మీద కూర్చున్నాడు. గుండె గొంతుకలోకి వచ్చి కుయ్ మని సౌండొచ్చింది. దాంతో ఆయన నన్ను మనిషిగా గుర్తించి క్షమాపణలు చెప్పి పక్క సీట్లో కూచున్నాడు. తరువాత మళ్లీ మళ్లీ క్షమాపణలు చెబుతూ సినిమా చూడకుండా చేశాడు.
మొదట్నుంచి సినిమా చూడ్డం కొందరికి ఇష్టం ఉండదు. సడన్‌గా లోపలికి వస్తే కళ్లు కనపబడవు. ఎబిసిడీలు, అంకెలు లెక్కపెట్టుకుంటూ, స్టెప్స్ వేస్తూ వచ్చి కూచుంటారు. కథ ఏమైనా జరిగిందా అని పక్క సీటర్‌ని అడుగుతారు. తెలుగు సినిమాల్లో కథ ఉంటుందని నమ్మే అమాయకులు ఇంకా ఉండడమే ఆశ్చర్యం! తిరుపతి థియేటర్‌లలో గేటు కీపర్లు ఉండరు. టికెట్ తీసుకుని లోనికెళితే సినిమా బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు ఒక నీడ ప్రత్యక్షమౌతుంది. ఆ నీడ మనకు ఫుట్ మసాజ్ చేసుకుంటూ టికెట్లు అడుగుతుంది. ఒకసారి చీకట్లో కన్‌ఫ్యూజ్ అయి పార్కింగ్ టిక్కెట్ ఇచ్చాను. దాన్ని చించి సగం ముక్క చేతికిచ్చాడు. హైదారాబాద మాల్స్ లోని థియేటర్‌కెళితే మన పక్కన కూచున్నవాడు బకెట్‌లో పాప్‌కార్న్ తింటూ ఉంటాడు. మధ్యలో కోక్ తాగి, పేగుల్ని యాక్టివేట్ చేసి బ్రేవ్‌మంటాడు. సినిమాలో వినిపించే డిటిఎస్‌కి ఇది అదనం. పాత రోజుల్లో తాంబూలం పళ్లాలుండేవి. అలాంటి ట్రేలో కొందరు ఫ్రాంకీలు, బర్గర్‌లు.. ఇలా రకరకాల సామగ్రి తెచ్చుకుంటారు. సినిమాకి రంగు రుచి వాసన కల్పిస్తారు వీళ్లు.
చిన్నప్పుడు సగం సినిమా చూసేవాణ్ణి. శుక్ర, శని, ఆదివారాల్లో హిందీ సినిమాలు మ్యాట్నీ షోగా వేసేవాళ్లు. నాలాంటి వాళ్ల సౌలభ్యం కోసం శుక్ర, శని వారాల్లో మధ్యాహ్నం డ్రిల్ క్లాస్ ఉండేది. అందరూ గ్రౌండ్‌లో డ్రిల్ చేస్తుంటే, పుస్తకాల సంచీ ఎవడో ఒకడి మెడకు తగిలించి, కౌబాయ్ సినిమాలో గుర్రంలాగా నాన్‌స్టాప్‌గా కిలోమీటర్ పరిగెత్తి థియేటర్ చేరుకునేవాణ్ణి. గేట్ కీపర్‌కి ఇరవై పైసలిస్తే నల్లటి పరదాలోంచి ప్రవేశం కల్పించేవాడు. లోపల అడుగుపెడితే ‘ఈ నగరానికి ఏమైంది?’ లెవెల్‌లో దట్టమైన బీడీల పొగ. దగ్గుకుంటూ వెళ్లి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేల మీద కూర్చున్న వాళ్ల అన్ని స్పేర్ పార్ట్‌లనీ తొక్కుతూ వెళ్లేవాణ్ణి. అక్షరమ్ముక్క హిందీ రాకపోయినా, చూస్తున్న సన్నివేశాల తలాతోక తెలియక పోయినా కళ్లింతలు చేసుకుని చూసేవాణ్ణి. చదవకపోయినా టెన్త్ హిందీ ఎగ్జామ్ పాస్ కావడానికి ఈ నాలెడ్జే కారణం.
ఒకసారి రాజకోట సినిమాకెళితే రచ్చరచ్చయింది. రాయదుర్గంలో అజీజియా అనే టాకీస్ ఉంది. (ఈ అవశేషం ఇప్పటికీ ఉంది. అదే విశేషం). నేను, శేఖర్ అనే మిత్రుడు నలభై పైసల చెక్క బెంచీ క్లాస్‌కెళ్లాం. ఆ బెంచీల పైన నల్లుల ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఇద్దరం కిటీకీ పెకైక్కి కూచున్నాం. అక్కడో తేలు పిల్ల పొంచి ఉందని మాకు తెలియదు. అది దారి తప్పి మావాడి నిక్కర్‌లో ప్రవేశించి పిర్రని గిల్లింది. ఎన్టీఆర్ కొయ్యగుర్రంపై కళ్లెం లాగుతూ విలన్‌ని చేజ్ చేస్తూ ఉండగా, మావాడు కెవ్వున కేకేసి కిటికీలోంచి కింద ఉన్న బెంచర్స్ పైకి దూకాడు. తమ పైకి దూకిన ఆకారమేంటో తెలియక వాళ్లు హాహాకారాలు చేసి పరుగులు తీశారు. ఇంత జరిగినా ఆపరేటర్ సినిమా ఆపలేదు. సినిమా నచ్చి జనం అరుస్తున్నారని వాడు అనుకున్నాడు.
ఇదే ఊళ్లో జయలక్ష్మి టాకీస్ అని ఒక టెంట్ ఉండేది. దీని యజమానికి ఒక రంపపు మిల్లు ఓనర్ అప్పుపడితే ఆ కొయ్యతో బెంచీలు కుర్చీలు చేయించాడు. వాటిని ఏం చేసుకోవాలో తెలియక టెంట్ సినిమాలో పెట్టాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని వీటి వల్ల మా నిక్కర్లు చిరిగేవి. ఏకుల్ని కూడా మేకులుగా మార్చగల కార్పెంటర్ వాటిని తయారు చేసుంటాడు. కూర్చోవడం వరకే మన వంతు. లేవడం మన వల్ల కాదు. బలవంతంగా లేస్తే పర్రుమని సౌండ్. ఈ టెంట్ ప్రత్యేకత ఏమంటే కొత్త సినిమాలు వచ్చినప్పుడు దీన్ని వెడ ల్పు చేసేవాళ్లు.
ఇప్పుడు సకల సౌకర్యాలతో సినిమా చూస్తున్నా సంతోషం లేదు. అమాయకత్వాన్ని మించిన ఆనందం లేదు. వయసు పెరిగే కొద్దీ మనలోకి మాయ ప్రవేశిస్తుంది. మాయలో చిక్కుకుని నవ్వడం మరిచిపోతాం.
- జి.ఆర్. మహర్షి