రహస్యంగా నన్ను వీడియో తీశాడు
బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ మొబైల్ ఫోన్తో రహస్యంగా తనను వీడియో తీశాడని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఆటోలోపల పైభాగంలో రహస్యంగా మొబైల్ అమర్చాడని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా తాను వీడియో తీయలేదని, కరెంట్ లేకపోవడంతో అంతకుముందు ప్రయాణికుడికి చిల్లర డబ్బు వెనక్కు ఇచ్చేందుకు మొబైల్ లైట్ వాడేందుకు దాన్ని పైభాగంలో పెట్టానని ఆటో డ్రైవర్ చెప్పాడు.
ఈ నెల 24 రాత్రి రిచ్మండ్ టౌన్ వద్ద సంబంధిత మహిళ ఉద్యోగిని ఆటోలో ఎక్కింది. కొంచెం దూరం వెళ్లాక ఆటోలోపలి పైభాగం నుంచి ఓ వస్తువు ఆమెపై పడింది. దాన్ని మొబైల్ ఫోన్ గా గుర్తించింది. ఆటోడ్రైవర్ తనను వీడియో తీసేందుకు మొబైల్ ఫోన్ను రహస్యంగా ఉంచాడని భావించింది. ఆమె వెంటనే ఆటో ఆపాలని డ్రైవర్కు సూచించింది. ఆటో దిగగానే మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కుబ్బన్ పార్క్ పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని మొబైల్ ఫోన్లో ఎలాంటి వీడియోలు కనిపించలేదని, ఫోరెన్సిక్ నిపుణులకు మొబైల్ పంపినట్టు పోలీసులు చెప్పారు. సంబంధిత మహిళ ఫిర్యాదు కోసం ఎదురు చూస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు చెప్పినట్టు తెలిపారు.