bangalore woman
-
ఏకంగా ఆమె చెవిలో మకాం వేసింది...
-
ఏకంగా ఆమె చెవిలో మకాం వేసింది...
సాధారణంగా సాలీడు ఏ చెట్టుకో, ఇళ్లల్లోనో బూజు గూళ్లు అల్లుకునే విషయాన్ని మనం చూసి ఉంటాం. అయితే ఈ సాలీడు మాత్రం తన రూట్ మార్చి ఏకంగా ఓ మహిళ చెవిలోనే మకాం వేసింది. అంతే కాకుండా ఆమె తన ప్రాణం పోతుందేమో అనుకునేలా చేసింది. తీవ్రమైన తలనొప్పితో బాధిత మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బతికున్న సాలీడును ఆమె చెవిలో గుర్తించారు. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్యాహ్నం లేవగానే భరించలేని తలనొప్పితో పాటు తన కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించింది. చెవిలో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడంతో... ఆమె చెవిని పలుసార్లు రుద్దుకుని, చెవిలో ఉన్నదాన్ని తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా తలనొప్పి అంతకంతకు తీవ్రతరం కావడంతో కొలంబియా ఏషియా ఆస్పత్రికి వెళ్లిన ఆమెను డాక్టర్ పరీక్షించిన చెవిలో సాలీడు ఉన్నట్లు గుర్తించారు. అయితే లక్ష్మి చెవిపై టార్చ్ లైట్ వేయగానే ఆ వెలుగుకు సాలె పురుగు పాక్కుంటూ దానికదే చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో షాక్ తినడం డాక్టర్ వంతైంది. ఈ సందర్భంగా లక్ష్మిని పరీక్షించిన ఈఎన్టీ డాక్టర్ సంతోష్ శివస్వామి మాట్లాడుతూ .... చెవిలో దూరిన సాలీడు బతికి ఉండటం తాము తొలిసారి చూశామని, ఇది అరుదైన ఘటన అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. -
అమెజాన్‌కు భారీ టోపీ.. మహిళ అరెస్టు
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు దాదాపు రూ. 70 లక్షల మేర టోపీ పెట్టిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భారీ మొత్తంలో ఆన్లైన్లో సరుకులు కొనడం, ఆ పార్సిల్ లోపల ఉన్న అసలు వస్తువులను తీసేసి వాటి స్థానంలో చవగ్గా దొరికే స్థానిక సరుకులు పెట్టి నాణ్యత లేదంటూ వాటిని రిటర్న్ చేయడం.. తన వద్ద ఉన్న అసలు వస్తువులను అమ్మేయడం.. ఇదీ ఆమె మోడస్ ఒపెరాండీ. అమెజాన్ నుంచి ఆమెకు లక్షల్లో రిఫండ్లు వచ్చాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపాన్వితా ఘోష్ (32) బెంగళూరు సమీపంలోని హొరమావు రాజన్న లే అవుట్ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఆమె ఒక ప్రొఫెషనల్ సర్వీసుల కంపెనీలో పనిచేస్తుంది. ఆన్లైన్లో తరచు ఏవో ఒకటి కొంటూ ఉండే దీపాన్విత, చివరకు ఆ మార్గంలోనే డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది. నకిలీ పేర్లతో ఏకంగా 104 వస్తువులు ఆమె అమెజాన్‌లో కొంది. వాటిలో హై ఎండ్ సెల్ఫోన్లు, డీఎస్ఎల్ఆర్ కెమెరాలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. సి-రిటర్న్ అనే అమెజాన్ కస్టమర్ రిటర్న్ సర్వీస్‌ను ఉపయోగించుకుని దాదాపు అన్నింటినీ 24 గంటల్లోగా రిటర్న్ చేసేది. ప్రతిసారీ అడ్రస్ మాత్రం మార్చేది. చివరకు ఎలాగోలా తన అకౌంట్లోకి డబ్బులు వేయించుకునేదని బెంగళూరు ఈస్ట్ డీసీపీ అజయ్ హిలోరి తెలిపారు. దాదాపు ఏడాది నుంచి ఆమె అమెజాన్‌ను మోసం చేస్తోందని చెప్పారు. అయితే ఇలా రిటర్న్ అవుతున్న చాలావరకు ఉత్పత్తులలో తాము పంపిన అసలు సరుకులు ఉండట్లేదని బెంగళూరులోని అమెజాన్ సెల్లర్ సర్వీస్ వాళ్లు గుర్తించి అంతర్గత విచారణ నిర్వహించగా చివరకు వీటన్నింటినీ ఆర్డర్ చేస్తున్నది దీపాన్వితా ఘోష్ అని తేలింది. మరో ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌లో రాజర్షి96 అనే పేరుతో తాను సెల్లర్‌గా ఉంటూ కస్టమర్ల నుంచి హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఆర్డర్లు తీసుకునేది. తనకు ఆర్డర్ వచ్చిన తర్వాత వాటిని అమెజాన్‌లో ఆర్డర్ చేసి, వాటిని తన కస్టమర్లకు అమ్మేసి, అమెజాన్‌కు మాత్రం నకిలీ వస్తువులు రిటర్న్ చేసి రెండు వైపుల నుంచి డబ్బు సంపాదించేది. ఇలాంటివి 104 లావాదేవీల ద్వారా మొత్తం రూ. 69,91,940 సంపాదించింది. ఏప్రిల్ నెలాఖారులో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. -
రహస్యంగా నన్ను వీడియో తీశాడు
బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో రహస్యంగా తనను వీడియో తీశాడని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఆటోలోపల పైభాగంలో రహస్యంగా మొబైల్ అమర్చాడని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా తాను వీడియో తీయలేదని, కరెంట్ లేకపోవడంతో అంతకుముందు ప్రయాణికుడికి చిల్లర డబ్బు వెనక్కు ఇచ్చేందుకు మొబైల్ లైట్ వాడేందుకు దాన్ని పైభాగంలో పెట్టానని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఈ నెల 24 రాత్రి రిచ్మండ్ టౌన్ వద్ద సంబంధిత మహిళ ఉద్యోగిని ఆటోలో ఎక్కింది. కొంచెం దూరం వెళ్లాక ఆటోలోపలి పైభాగం నుంచి ఓ వస్తువు ఆమెపై పడింది. దాన్ని మొబైల్ ఫోన్ గా గుర్తించింది. ఆటోడ్రైవర్ తనను వీడియో తీసేందుకు మొబైల్ ఫోన్‌ను రహస్యంగా ఉంచాడని భావించింది. ఆమె వెంటనే ఆటో ఆపాలని డ్రైవర్‌కు సూచించింది. ఆటో దిగగానే మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కుబ్బన్ పార్క్ పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని మొబైల్ ఫోన్లో ఎలాంటి వీడియోలు కనిపించలేదని, ఫోరెన్సిక్ నిపుణులకు మొబైల్ పంపినట్టు పోలీసులు చెప్పారు. సంబంధిత మహిళ ఫిర్యాదు కోసం ఎదురు చూస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు చెప్పినట్టు తెలిపారు.