అమెజాన్‌కు భారీ టోపీ.. మహిళ అరెస్టు
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు దాదాపు రూ. 70 లక్షల మేర టోపీ పెట్టిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భారీ మొత్తంలో ఆన్‌లైన్‌లో సరుకులు కొనడం, ఆ పార్సిల్ లోపల ఉన్న అసలు వస్తువులను తీసేసి వాటి స్థానంలో చవగ్గా దొరికే స్థానిక సరుకులు పెట్టి నాణ్యత లేదంటూ వాటిని రిటర్న్ చేయడం.. తన వద్ద ఉన్న అసలు వస్తువులను అమ్మేయడం.. ఇదీ ఆమె మోడస్ ఒపెరాండీ. అమెజాన్ నుంచి ఆమెకు లక్షల్లో రిఫండ్లు వచ్చాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపాన్వితా ఘోష్ (32) బెంగళూరు సమీపంలోని హొరమావు రాజన్న లే అవుట్ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఆమె ఒక ప్రొఫెషనల్ సర్వీసుల కంపెనీలో పనిచేస్తుంది.
ఆన్‌లైన్‌లో తరచు ఏవో ఒకటి కొంటూ ఉండే దీపాన్విత, చివరకు ఆ మార్గంలోనే డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది. నకిలీ పేర్లతో ఏకంగా 104 వస్తువులు ఆమె అమెజాన్‌లో కొంది. వాటిలో హై ఎండ్ సెల్‌ఫోన్లు, డీఎస్‌ఎల్ఆర్ కెమెరాలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. సి-రిటర్న్ అనే అమెజాన్ కస్టమర్ రిటర్న్ సర్వీస్‌ను ఉపయోగించుకుని దాదాపు అన్నింటినీ 24 గంటల్లోగా రిటర్న్ చేసేది. ప్రతిసారీ అడ్రస్ మాత్రం మార్చేది. చివరకు ఎలాగోలా తన అకౌంట్‌లోకి డబ్బులు వేయించుకునేదని బెంగళూరు ఈస్ట్ డీసీపీ అజయ్ హిలోరి తెలిపారు. దాదాపు ఏడాది నుంచి ఆమె అమెజాన్‌ను మోసం చేస్తోందని చెప్పారు. అయితే ఇలా రిటర్న్ అవుతున్న చాలావరకు ఉత్పత్తులలో తాము పంపిన అసలు సరుకులు ఉండట్లేదని బెంగళూరులోని అమెజాన్ సెల్లర్ సర్వీస్ వాళ్లు గుర్తించి అంతర్గత విచారణ నిర్వహించగా చివరకు వీటన్నింటినీ ఆర్డర్ చేస్తున్నది దీపాన్వితా ఘోష్ అని తేలింది.
మరో ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌లో రాజర్షి96 అనే పేరుతో తాను సెల్లర్‌గా ఉంటూ కస్టమర్ల నుంచి హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఆర్డర్లు తీసుకునేది. తనకు ఆర్డర్ వచ్చిన తర్వాత వాటిని అమెజాన్లో ఆర్డర్ చేసి, వాటిని తన కస్టమర్లకు అమ్మేసి, అమెజాన్‌కు మాత్రం నకిలీ వస్తువులు రిటర్న్ చేసి రెండు వైపుల నుంచి డబ్బు సంపాదించేది. ఇలాంటివి 104 లావాదేవీల ద్వారా మొత్తం రూ. 69,91,940 సంపాదించింది. ఏప్రిల్ నెలాఖారులో ఆమెను పోలీసులు పట్టుకున్నారు.