డేటా సెంటర్ల ఏర్పాటు కోసం తెలంగాణతో కీలక ఒప్పందం
విస్తరణ ప్రణాళికల కోసం భూమి కేటాయించేందుకు సర్కారు ఓకే
భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన విప్రో, ఇన్ఫోసిస్
టిల్మా హోల్డింగ్స్, బ్లాక్‌స్టోన్, ఉర్సా క్లస్టర్స్ డేటా సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. తెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రఖ్యాత అమెజాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ‘అమెజాన్ వెబ్ సర్విసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ’ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం వెలువడింది. అమెజాన్‌తోపాటు మరికొన్ని సంస్థలతోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
భూమి కేటాయించాలని కోరిన అమెజాన్
అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాజాగా విస్తరణ కోసం అవసరమైన భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అమెజాన్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్’తో తమ ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అమెజాన్ ఒప్పందంతో దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
డేటా సెంటర్ల రంగంలో మరిన్ని పెట్టుబడులు
⇒ హైదరాబాద్‌లో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్‌కు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది.
⇒ అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ రూ.5వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
⇒ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో రూ.4,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బ్లాక్‌స్టోన్ అనుబంధ విభాగం జేసీకే ఇన్‌ఫ్రా 150 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తుంది.
ఇన్ఫోసిస్, విప్రో విస్తరణ ప్రణాళికలు కూడా..
⇒ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపన్‌పల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులతో జరిగిన భేటీలో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ విప్రో క్యాంపస్ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దీనితో 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
⇒ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ హైదరాబాద్‌లోని పోచారంలో ఉన్న తమ క్యాంపస్‌లో 17 వేల ఉద్యోగాలు కల్పించేలా విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. రూ.75 కోట్ల పెట్టుబడితో నూతన ఐటీ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
దావోస్‌లో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment