ఏకంగా ఆమె చెవిలో మకాం వేసింది...
సాధారణంగా సాలీడు ఏ చెట్టుకో, ఇళ్లల్లోనో బూజు గూళ్లు అల్లుకునే విషయాన్ని మనం చూసి ఉంటాం. అయితే ఈ సాలీడు మాత్రం తన రూట్ మార్చి ఏకంగా ఓ మహిళ చెవిలోనే మకాం వేసింది. అంతే కాకుండా ఆమె తన ప్రాణం పోతుందేమో అనుకునేలా చేసింది. తీవ్రమైన తలనొప్పితో బాధిత మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బతికున్న సాలీడును ఆమె చెవిలో గుర్తించారు.
బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్యాహ్నం లేవగానే భరించలేని తలనొప్పితో పాటు తన కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించింది. చెవిలో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడంతో... ఆమె చెవిని పలుసార్లు రుద్దుకుని, చెవిలో ఉన్నదాన్ని తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా తలనొప్పి అంతకంతకు తీవ్రతరం కావడంతో కొలంబియా ఏషియా ఆస్పత్రికి వెళ్లిన ఆమెను డాక్టర్ పరీక్షించిన చెవిలో సాలీడు ఉన్నట్లు గుర్తించారు.
అయితే లక్ష్మి చెవిపై టార్చ్ లైట్ వేయగానే ఆ వెలుగుకు సాలె పురుగు పాక్కుంటూ దానికదే చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో షాక్ తినడం డాక్టర్ వంతైంది. ఈ సందర్భంగా లక్ష్మిని పరీక్షించిన ఈఎన్టీ డాక్టర్ సంతోష్ శివస్వామి మాట్లాడుతూ .... చెవిలో దూరిన సాలీడు బతికి ఉండటం తాము తొలిసారి చూశామని, ఇది అరుదైన ఘటన అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.