![Corona Virus: Daughters helps Mother deliver baby at home in Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/28/Mother.jpg.webp?itok=vsu6_OrK)
సాక్షి, బెంగళూరు : పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా వైద్యులు వెనక్కు పంపారు. గత్యంతరం లేక ఆ తల్లి తన ముగ్గురు కుమార్తెల సహాయంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన బెంగళూరులో గురువారం చోటు చేసుకుంది. రాయచూరుకు చెందిన లక్ష్మీ కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వలస వచ్చింది. భర్త, ముగ్గురు కుమార్తెలతో (వారి వయసు వరుసగా 12, 9, 7 ఏళ్లు) కలసి బ్యాడరహళ్లిలో నివాసం ఉండేది. లక్ష్మీ మరోసారి గర్భం ధరించిన తర్వాత భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బేల్దారి పనులకు వెళ్లి కుమార్తెలను పోషిస్తోంది. (అమ్మో.. వైరస్ సోకుతుందేమో)
ఈ క్రమంలో ఆమెకు 9 నెలలు నిండటంతో బుధవారం నొప్పులు అధికమయ్యాయి. దీంతో కుమార్తెలు ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కరోనా వైరస్ లక్షణాలతో ఉన్నవారు చికిత్స పొందుతున్నందున ప్రసవం చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కుమార్తెలతో కలసి ఇంటికి వెళ్లింది. గురువారం నొప్పులు అధికం కావడంతో తల్లి ఇచ్చిన సూచనలతో ముగ్గురు కుమార్తెలు ప్రసవం చేశారు. (అగ్రరాజ్యం అతలాకుతలం)
మగబిడ్డ జన్మించడంతో కుటుంబంలో ఆనందం మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెళ్లి వారికి సహకారం అందజేశారు. అనంతరం విషయాన్ని బ్యాడరహళ్లి పోలీసులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకొని తల్లి, ముగ్గురు కుమార్తెలు, నవజాత శిశువును ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో ఉల్లాళ ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె కుటుంబానికి పోలీసులు కొంత నగదు సాయాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment