
సాక్షి, బెంగళూరు: విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగరంతో గ్రామీణ జిల్లాల్లో వచ్చే మంగళవారం నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించించడం తెలిసిందే. లాక్‌డౌన్ తీరుతెన్నులపై ఆదివారం ఉదయం కావేరి అతిథి గృహంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి యడియూరప్ప సమావేశమై చర్చించారు. మంత్రి ఆర్.అశోక్, బీబీఎంపీ కమిషనర్ అనిల్‌కుమార్, ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ కటారియా తదితరులు హాజరయ్యారు. కరోనా నియంత్రణకు ఏం చేయాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం స్పష్టంచేశారు. అయితే ఇతర జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధిస్తే బాగుంటుందనే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు.
పీజీలకు స్టైఫండ్ ఇప్పించండి..
దావణగెరెలో జేజేఎం పీజీ వైద్యుల స్టైఫండ్ సమస్యపై వైద్య విద్యా కె.సుధాకర్‌తో సీఎం యడియూరప్ప మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల వైపు ఉండాలని సూచించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పి విరమింపజేయాలన్నారు. కాలేజీ యాజమాన్యం మాట వినకుంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయాలని సూచించారు. కాగా, సీఎం విరామ సమయంలో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. తన సిబ్బందికి కరోనా రావడంతో ఆయన స్వచ్ఛంద క్వారంటైన్‌ను పాటిస్తున్నారు.