సాక్షి, బెంగళూరు: సీఐడీ డీఎస్పీ వి.లక్ష్మి బుధవారం రాత్రి నాగరబావిలోని స్నేహితుని ఇంట్లో సందేహాస్పద రీతిలో ఉరివేసుకుని మృతిచెందారు. కొంతకాలం కిందట రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు వరుసగా ఆత్మహత్యలు, అనుమానాస్పద రీతిలో మరణించడం, ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. డీఎస్పీ గణపతి మృతి కేసులో మాజీ హోంమంత్రి జార్జ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారిస్తోంది. ఇంతలోనే మరో డీఎస్పీ ఉరికి వేలాడడం పోలీసు శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరుకునపెట్టేదిగా మారింది. లక్ష్మి తండ్రి మాట్లాడుతూ తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు.
అదుపులో స్నేహితులు
లక్ష్మి తండ్రి వెంకటేశ్ డీసీసీ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణవార్త తెలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమె మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. లక్ష్మి భర్త నవీన్‌తో ఏ వివాదాలు లేవని, లక్ష్మి స్నేహితుల మీదే సందేహం ఉందని చెప్పారు. విందు ఇచ్చిన బీబీఎంపీ కాంట్రాక్టర్ మనోహర్, మరో ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి బసవరాజ బొమ్మై స్పందిస్తూ డీఎస్పీ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ఏం జరిగింది?
2014 బ్యాచ్‌కు చెందిన రాష్ట్ర పోలీసు సర్వీసు అధికారి అయిన లక్ష్మి మూడేళ్ల కిందట సీఐడీలో నియమితులయ్యారు. బుధవారం రాత్రి నాగరబావిలోని వినాయక లేఔట్ ఉంటున్న స్నేహితుని ఇంట్లో విందుకు వెళ్లారు. ఒకవైపు విందు జరుగుతుండగా, ఆమె కొంతసేపటికి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలకొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించినట్లు స్నేహితులు తెలిపారు. అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!)
భర్తతో గొడవలు?
2012లో నవీన్ అనే వ్యక్తిని లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సర్వీసులో చేరిన తర్వాత కోణనకుంటెలోని నివాసంలో దంపతులిద్దరూ కాపురమున్నారు. నవీన్ హైదరాబాద్‌లోని అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండేళ్లుగా వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగడం లేదని సమాచారం. ఈ విషయమై లక్ష్మి బాధపడుతున్నారు. మూడురోజుల కిందట నాగరబావిలోని స్నేహితుని ఇంటికి దంపతులిద్దరూ వెళ్లారు. రెండు రోజుల క్రితం నవీన్ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. మరోవైపు లక్ష్మి మద్యపానానికి అలవాటు పడినట్లు, గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యయత్నానికి కూడా పాల్పడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment