జిల్లా జైలులో ‘సెల్’ కలకలం
వార్డెన్ సస్పెండ్
బుక్కరాయసముద్రం : జిల్లా జైలులో మరోసారి సెల్‌ఫోన్ కలకలం రేగింది. ఓ ఖైదీ దగ్గర సెల్‌ఫోన్ దొరకడంతో ఓ వార్డెన్‌ను సస్పెండ్ చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా సూపరింటెండెంట్ తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లాకు చెందిన మంగళ శీను అలియాస్ శ్రీనివాసులు పలు దొంతనాలు, హత్యా నేరాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని మే-27న వైఎస్సార్ జిల్లా జైలు నుంచి అనంతపురం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ఓ దొంగతనం కేసులో జిల్లా కోర్టుకు వాయిదాల కోసమే అతన్ని జిల్లాై జెల్లో ఉంచారు. అయితే ఈనెల 22న సదరు ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డికి పట్టుబడ్డాడు. సెల్‌ఫోన్‌పై ఆరా తీయ గా జిల్లా జైల్లో వార్డెన్‌గా పని చేస్తున్న హరినాథ్ ద్వారా సెల్‌ఫోన్ వాడుతున్నానని ఒప్పుకున్నాడు.
అతనే డబ్బులకు కక్కుర్తిపడి సెల్‌ఫోన్ అందించి సహకరించాడని విచారణలో తేలింది. దీంతో వార్డెన్ హరినాథ్‌ను సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మంగళ శీను వైఎస్సార్ జిల్లా జైల్లో కూడా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. గతంలో కోర్టుకు తీసుకు వచ్చేటప్పుడు ఎస్కార్ట్ ను కూడా అవస్థలకు గురిచేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.