జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్‌లో జలకాలాడుతున్న బావామరదళ్లు. (ఇన్‌సెట్‌లో సంగీత, అవినాష్, సుమలత)
సాక్షి, జనగామ: సెల్‌ఫోన్‌లో ఫొటోలు దిగాలనే సరదా ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌లోకి దిగిన బావతోపాటు ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ మూడ్ లక్ష్మణ్‌నాయక్, కాంతాబాయి దంపతుల కుమారుడు మూడ్ అవినాష్ (29)కు రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా (జీబీతండా)కు చెందిన లకావత్ లక్ష్మణ్, లీల దంపతుల కుమార్తె దివ్య వివాహం ఏడాదిన్నర క్రితం జరిగింది. హైదరాబాద్‌లో ఉంటున్న అవినాష్ శుక్రవారం రాత్రి జనగామకు వచ్చాడు. శనివారం గిద్దెబండతండాలోని అత్తగారింటికి వెళ్లాడు.
మధ్యాహ్నం తల్లిగారింటి వద్ద ఉన్న భార్య దివ్యతోపాటు చిన్న మామ లకావత్ అంజయ్య కుమార్తెలు సంగీత (17), సుమలత(15)తో కలసి నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఒడ్డున ఉన్న దివ్య ఫొటోలు తీస్తుండగా అవినాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగి సరదాగా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. అకస్మాత్తుగా రిజర్వాయర్‌లోని ఊబిలోకి అవినాష్ మునిగిపోయాడు. సంగీత, సుమలత సైతం నీటిలో గల్లంతయ్యారు. దివ్య గమనించి కేకలు వేయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి నీటిలోకి దిగి గాలించి ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరిలించారు. సంగీత ఇటీవలే ఇంటర్ ఉత్తీర్ణత కాగా సుమలత పదో తరగతి పాసైంది.
Comments
Please login to add a commentAdd a comment