
విద్యార్థి ప్రాణం తీసిన సెల్‌ఫోన్
- దొంగతనం అపవాదు భరించలేక హాస్టల్‌పై నుంచి దూకిన విద్యార్థి
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్: సెల్‌ఫోన్ దొంగిలించాడనే నింద భరించలేక హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదఘటన నగరంలోని ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య విద్యార్థి వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో సిమెంట్ దుకాణం నిర్వహించే దేవేందర్ కుమారుడు ఎల్.హరీష్ (20) ఇంటర్ చది వాడు. సీఏ కోర్సు శిక్షణ నిమిత్తం వారం క్రితం నగరానికి వచ్చాడు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య విద్యార్థి వసతి గృహంలో 305 నంబర్ గదిలో ఉంటూ ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ గదిలో హరీష్‌తో పాటు సాయి అన్వేష్, శైలేష్ ఉంటున్నారు.
బుధవారం తెల్లవారుజామున అన్వేష్ 4.30 గంటలకు లేచి చూడగా తన సెల్ కనిపించలేదు. దీంతో మిగతా ఇద్దర్నీ లేపి అడగ్గా వారి సెల్‌ఫోన్లూ కనిపించలేదు. ఉదయం 8.30 గంటలకు విధులకు వచ్చిన వార్డెన్ అరుణాచల్ శర్మ విద్యార్థులందరి బ్యాగులు వెతగ్గా ఓ బ్యాగ్‌లో 2 సెల్‌ఫోన్లు దొరికాయి. హరీషే ఫోన్లు దొంగిలించాడని వార్డెన్ ఆరోపించడంతో అతను మనస్తాపానికి గురయ్యా డు. హుటాహుటిన లిఫ్ట్‌లో 3వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకేశాడు. తలకు బలమైన గాయమైంది. తోటి విద్యార్థులు సమీపంలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. కాసేపటికే హరీష్ మృతి చెందాడు. ముషీరాబాద్ ఎస్సై భాస్కర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.