కొడుకు పుట్టాక భార్యను నీవెవరు అన్నాడు..
కొడుకుతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
అమీర్‌పేట: సెల్‌ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతికి కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. పెళ్లి కాలేదని నమ్మించి గుడిలో వివాహం చేసుకున్నాడు. కొడుకు పుట్టాక ఇంటికి రావడం మానేశాడు. ఎందుకు రావడంలేదని అడగడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భార్యను నీవెవరో నాకు తెలియదని కానిస్టేబుల్ అనడంతో ఆ యువతి కొడుకుతో పాటు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యుత్నించింది. గురువారం సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌జిల్లాకు చెందిన నిరోష 2014లో నగరానికి వచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లోని హోస్టల్‌లో ఉండేది. గదిలో సెల్‌ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు ఎస్సార్‌నగర్ స్టేషన్‌కు వెళ్లిన ఆమెకు అక్కడ కానిస్టేబుల్ రాజారాం పరిచయం అయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను వలలో వేసుకున్నాడు. ప్రేమ వివాహానికి తన కుటుంబసభ్యులు అంగీకరించరని చెప్పి సాంఘీ ఆలయానికి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలో ఆమెతో కాపురం పెట్టాడు. కొడుకు పుట్టాక ఇంటికి సరిగా రాకపోవటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా రాజారాంకు అంతకు ముందే పెళ్లైందని తెలిసింది. ఏడాది వయసు కొడుకు ఉండటంతో రాజారాంతోనే కలిసి ఉండాలని నిరోష నిర్ణయించుకుంది. వారం రోజులుగా భర్త రాజారాం పూర్తిగా ఇంటికి రావడం మానేయడంతో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదు. దీంతో గురువారం ఉదయం ఆమె నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇంటికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించగా... రాజారాం అసభ్యంగా మాట్లాడాడు.
నీవెవరో నాకు తెలియదు. నీతో నాకు సంబంధం లేదన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన నిరోష కొడుకును తీసుకుని నేరుగా ప్రకృతి చికిత్సాలయం రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యుత్నించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వచ్చి ఆమెకు నచ్చచెప్పి ఠాణాకు తరలించారు. విచారణలో ఆమె ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుందని తెలియడంతో ఆమెను ఆ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని పంపించామని ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు. కాగా.. రాజారాం తన ఇద్దరు భార్యలను కొంత కాలంగా ఒకే చోట ఉంచినట్లు తెలిసింది. కుటుంబ పోషణ కోసం ప్రతినెలా రాజారాం రెండో భార్యకు కొంత డబ్బు ఇచ్చేవాడని, అవి సరిపోక పోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, గతంతో రాజారాంపై వరంగల్‌జిల్లా మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా కౌన్సెలింగ్ చేసినట్లు తెలిసింది.