
హోల్‌సెల్
సెల్‌ఫోన్... హోల్ మొత్తంగా మనుషుల్ని కలిపింది.
మానవ సంబంధాల్లో ఒక హోల్‌నీ సృష్టించింది!
పుట్టెడు మాటలను పొట్టలో నింపుకొని వాటిని ఎవరో ఒకరి చెవిన వేసేదాకా మోగుతూనే ఉంటుంది. ఏడు సముద్రాల ఆవలున్న అనుబంధాలనూ రేడియో తరంగాల కనెక్టివిటీతో కలిపి ఉంచుతోంది. కానీ ఒకే ఇంట్లో బంధాలను కనిపించని వైరుతో వేరుచేస్తోంది! ఎన్నో లవ్ స్టోరీలకు పెళ్లిముడి వేస్తూ... విడాకులతో కొన్ని దాంపత్య ముడులను విప్పుతోంది. శత్రువులను మిత్రులను చేస్తోంది. చెలిమిని వైరంగా మలుస్తోంది. పాలిటిక్స్‌కే పొలిటికల్‌ట్రిక్స్ నేర్పుతోంది. ఇన్నీ చేస్తూ గుప్పిట్లో గుంభనంగా ఒదిగే ఆ సంచలనమే... సెల్‌ఫోన్!
ప్రతి ఆధునిక పోకడకు పురాణాల్లో ఆధారం దొరికినట్టు సెల్‌ఫోన్ సెల్స్ ఏవీ మైథాలజీ ల్యాబ్‌లో దొరికిన జాడలేదు. పౌరాణికాల్లో వినిపించిన ఆకాశవాణిని దూరవాణికి లింక్ చేసినా సెల్‌ఫోన్ మాత్రం అచ్చంగా మోడర్న్ క్రియేషనే అని చెప్పొచ్చు. కేవలం మాట్లాడ్డానికి మాత్రమే పరిమితమైన సెల్‌ఫోన్... తర్వాత తర్వాత మల్టిపుల్ టాస్క్ చేయగల సత్తాను సంపాదించింది. కొత్తలో కార్డ్‌లెస్‌కి ఎక్కువ వైర్‌లెస్‌కి తక్కువ అన్నట్టుండేది. కొన్ని పదుల కిలోమీటర్ల పరిధిలోనే మోగేది.. పలికేది. ఆనక తన వినికిడి శక్తికి ఆకాశమే హద్దుగా పెట్టుకుంది. మాట్లాడలేని లేని చోట మెసేజ్‌ను పంపే ఆప్షన్‌ను పెట్టుకుంది.
నైబర్స్ ఎన్వీ.. ఓనర్స్ ప్రైడ్
ఇప్పుడంటే సిమ్ములు ఫ్రీగా టాక్‌టైమ్ ప్లస్ ఇంటర్నెట్ ఆఫర్స్‌తో మరీ మార్కెట్లో వాటివైపు చూసేవాళ్లకోసం మొహంవాచి ఉన్నాయి కానీ.. ఇదివరకు మాట్లాడితేనే కాదు... విన్నా బిల్‌బెల్ మాడును ఠపీమనిపించేది. మధ్యతరగతి ఇళ్లల్లో తొలిసారి మొబైల్ ఫోన్‌ను ఓ సెలబ్రెటీగా మార్చింది నోకియా కంపెనీయే! కార్డ్‌లెస్ అంత పరిమాణంలో ఇంకాస్త బరువుగా తూగేది అది. పొరపాటున ఇన్‌కమింగ్ కాల్‌తో (కాల్ కాస్ట్ అంత ఖరీదు మరి) రోజుకి ఒక్కసారి మోగినా ఇంట్లోవాళ్లకు సంబరమే. తాము ఓ లగ్జరీని ఆస్వాదిస్తున్నామని ఇరుగుపొరుగువాళ్లకు తెలియడం కోసం ఇంట్లో మోగిన ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకొని ఆరుబయటకు వెళ్లే పోజులరాయుళ్లేం తక్కువ కాదు. అయినా వీళ్ల పటాటోపం పొరుగింటి కంట పడకపోతే... చెవినైనా వేయాలనే ఆత్రంతో ‘హలో.... హలో... సిగ్నల్ సరిగ్గా లేదు..’ అంటూ కిలోమీటరు ఆవలివరకు వినిపించే గొంతుతో ఆ నైబర్స్‌కి ఎన్వీని పుట్టించి ఈ ఓనర్ ప్రైడ్‌గా ఫోన్ కట్ చేసేవాడు.
టాక్‌టైమ్ దాటి ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లోకి...
ఈ పదేళ్లలో సెల్‌ఫోన్... ఆకారంలోనూ హొయలొలికించింది, ఫీచర్స్‌లోనూ హంగులు నింపుకొంది. బండలాంటి ఆకారం నుంచి పిడికిట్లో ఒదిగిపోయేంత నాజుగ్గా మారింది. మెసేజ్‌లు తప్ప అదనపు ఫీచరే లేనితనం నుంచి ఎమ్‌ఎమ్‌ఎస్‌లు, ఎఫ్‌ఎమ్‌లు, వాయిస్ రికార్డింగ్, బ్లూ టూత్ ఆప్షన్.. ఇలా టెక్నాలజీలో వచ్చిన కొత్త మార్పులన్నిటికీ ఈ చిన్న ఇన్‌స్ట్రుమెంట్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌తో అది చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. డెస్క్‌టాప్, లాప్‌టాప్ అన్నిటి ప్లేస్‌నూ ఈ బుల్లి ఫోన్ ఆక్రమించేస్తోంది. ఒక కాల్‌లో ఒకరితో కాదు ఒకేసారి ఓ గుంపుతో మాట్లాడే ఛాన్స్‌నిస్తోంది. సినిమాలను చూపిస్తోంది.. యూట్యూబ్‌తో ఎంటర్‌టైన్ చేస్తోంది. న్యూస్ అడ్‌డేట్‌ను ఇస్తోంది.. ఆడవాళ్ల భద్రతకోసం చేసిన యాప్స్‌నూ అకామిడేట్ చేస్తోంది. కరెంట్ బిల్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఇలా క్యూలో నిలబడి చేసే పనులన్నిటినీ ఏ చికాకు లేకుండా పూర్తిచేసే వెసులుబాటు కల్పిస్తోంది. మనీ ట్రాన్సాక్షన్స్‌నీ గుట్టుగా కంప్లీట్ చేస్తోంది. బోర్‌కొడితే బోలెడన్ని గేమ్స్‌తో అలరిస్తోంది. ఇలా అడుగు తీసి అడుగు వేసే శ్రమలేకుండా కీపాడ్ కదలికలతోనే ప్రపంచాన్ని అరచేతిలో ఉంచుతోంది. సెల్ఫీలతో స్నేహాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది.
కార్పోరేట్ కలకలం.. రాజకీయ ముసలం
సెల్‌ఫోన్ చెవులకు టాపింగ్ పెట్టి లాగితే టూ జీ స్ప్రెక్ట్రమ్ కుంభకోణం బయటపడింది. పాపం.. కరుణానిధిని కష్టాల్లో పడేసింది. కూతురు కనిమొళి విలన్ అయింది. స్నేహం చేసిన పాపానికి ఎ. రాజా కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. అంతేనా.. కార్గిల్ వార్ కవర్‌చేసి డేరింగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్‌గా పేరుగాంచిన బర్ఖాదత్ ఈ టాపింగ్ ఉచ్చులో పడిపోయింది. నీరా రాడియాతో బర్ఖా చేసిన సంభాషణను మోసిన సెల్‌ఫోన్ నికార్సయిన జర్నలిస్ట్ నిజాయితీకే మచ్చను తెచ్చింది. అంతేనా.. అమర్‌సింగ్, బిపాషా బసుల విరహాన్ని వినిపించింది. నిన్నటి సంఘటన.. ఓటుకు కోట్లు వ్యవహారంతో రాజకీయాల్లో ముసలమే పుట్టించింది.
అలా... వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత ఈ సెల్‌ఫోన్!
- శరాది
మొబైల్ పురాణం
1973, ఏప్రిల్ 3న మొదటిసారి మొబైల్‌లో ఫోన్‌కాల్ సంభాషణ జరిగింది. మాట్లాడింది మొటొరోలా తొలినాళ్ల సృష్టికర్త మార్టిన్ కూఫర్. అతణ్నే ‘‘ఫాదర్ ఆఫ్ సెల్‌ఫోన్’’ అంటారు. ఆయన మొదటిసారి ఫోన్ చేసింది తన ప్రత్యర్థి కంపెనీ బాస్‌కు!21ఏళ్ల కిందట మొదటిసారి ఓ మొబైల్ ఫోన్ నుంచి టెక్ట్స్ మెసేజ్ వెళ్లింది. అది పాప్ వర్త్ అనే 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ తన స్నేహితుడు రిచార్డ్ జావిస్‌కు ‘‘మెర్రీ క్రిస్ట్‌మస్’’ అని పంపాడు. అప్పటి ఫోన్లలో కీబోర్డ్ లేకపోవడంతో పాప్ ఆ మెసేజ్‌ను తన పర్సనల్ కంప్యూటర్ ద్వారా పంపాడు.1997లో మొదటిసారి మొబైల్ ఫోన్ నుంచి ఫిలిప్ క్యాన్ అనే వ్యక్తి తన కూతురి ఫొటోను షేర్ చేశాడు. మెటర్నిటీ వార్డులో అప్పుడే పుట్టిన తన బుజ్జిపాప సోఫీని ఫొటో తీసి అందరికీ చూపించాలనే ఆశతో షేర్ చేసి మురిసిపోయాడు ఆ తండ్రి.
{పస్తుతం ఉన్న ఐఫోన్లు రాకముందు 1993లో ఐబీన్ సైమన్ అనే ఫోన్ ఉండేది. ఆ బరువైన ఫోనే మొదటి ఐఫోన్. దాంట్లో క్యాలెండర్, ఫ్యాక్స్, టచ్ స్క్రీన్‌లాంటి ఎన్నో ఫీచర్స్ ఉండేవి. దాని ఖరీదు 500 పౌండ్లు. {పపంచంలోనే అత్యధిక ఫోన్ బిల్లు చేసింది ఫ్లోరిడాకు చెందిన సెలీనా ఆరన్స్ అనే మహిళ. తన కాలింగ్ ప్లాన్‌ను మార్చుకోకుండా కెనడాలో ఉన్న స్నేహితులతో రెండు వారాలు విచ్చల విడిగా ఫోన్లో మాట్లాడింది. దాంతో ఆమె మొబైల్ బిల్లు 1,42,000 పౌండ్లు వచ్చింది. ఆ బిల్లు చూసి ఆమెతో పాటు కంపెనీ కూడా అవాక్కయి, దయ తలచి దాన్ని 1,800 పౌండ్లకు తగ్గించింది. {పపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దాని ఖరీదు 6.7 మిలియన్ల పౌండ్లు. ఆ మొబైల్‌ను 500 వజ్రాలు, సాలిడ్ గోల్డ్‌తో తయారు చేశారు. అది ఐఫోన్ వర్షన్‌తో వస్తోంది. ఆ ఫోన్ కొన్నవారికి ప్లాటినమ్ బాక్స్‌లో పెట్టి మరీ కస్టమర్ చేతిలో పెడతారట.
‘సోనిమ్ ఎక్స్‌పీ 3300 ఫోర్స్’ వరల్డ్ టఫ్ఫెస్ట్ ఫోన్ (బండ ఫోన్)గా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. అది ఓసారి 84 అడుగుల మీద నుంచి కింద కాంక్రీట్ నేలపై పడిందట. అయినా ఆ మొబైల్‌కు ఏమీ కాలేదు. ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ ఎలాంటి మార్పు రాకపోవడంతో దాన్ని గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించారు.