అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
అమరావతి: అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. స్థిరాస్తి వ్యాపారంతో ప్రజలకు ఎ అధిక వడ్డీ ఆశ చూపి 32లక్షల 2వేల 607మంది నుంచి రూ.6380 కోట్ల డిపాజిట్లు సేకరించారన్నారు.
మొత్తం 9 రాష్ట్రాల్లో 32లక్షల మంది బాధితులు ఉన్నారన్నారు. అగ్రిగోల్డ్‌పై 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో తొలికేసు నమోదు అయినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే వివిధ జిల్లాల్లో పాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో అగ్రిగోల్డ్‌పై బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. 2015 జనవరిలో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించినట్లు చెప్పారు. 2016 నుంచి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రారంభమైందన్నారు.
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వారి నుంచి సుమారు 4వేల కోట్ల రూపాయిలు డిపాజిట్లు సేకరించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. విచారణ జరగుతుండగా తెలంగాణలో కొంతమంది కోర్టును ఆశ్రయించారని, కోర్టు నియమించిన కమిటీ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రారంభించారన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతోందని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ చేతిలో మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామని నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మోసపోయిన బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిదిమందిని అరెస్ట్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల ప్రోత్సాహం ఇస్తామన్నారు. అవసరం అయితే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లను వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.