తలుపులు మూసి చిత్రహింసలు! | Police Constable Revathi Statement on Father And Son Lockup Death | Sakshi
Sakshi News home page

తలుపులు మూసి చితక్కొట్టారు!

Published Fri, Jul 10 2020 8:29 AM | Last Updated on Fri, Jul 10 2020 8:59 AM

Police Constable Revathi Statement on Father And Son Lockup Death - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం రేపిన తండ్రీకొడుకుల కస్టడీ మరణాలపై విచారణ కొనసాగుతోంది. తండ్రి, కుమారుడ్ని తలుపుమూసి మరీ పోలీసులు చితక్కొట్టి ఉండడం వెలుగు చూసింది. కానిస్టేబుల్‌ రేవతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఐదుగురు పోలీసులపై సీబీసీఐడీ రహస్యంగా గురి పెట్టి అరెస్టు చేసింది. పట్టుబడ్డ ఈ పోలీసుల్ని బుధవారం అర్ధరాత్రి రిమాండ్‌కు తరలించారు. ఇక, గురువారం కోవిల్‌ పట్టి సబ్‌జైల్లో మెజిస్ట్రేట్‌ భారతీ దాసన్‌ విచారణ సాగించారు. తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌ కులం పోలీసుల దాష్టీకానికి తండ్రి జయరాజ్, తనయుడు ఫిలిప్స్‌ పోలీసు కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్, ఎస్‌ఐలు బాలకృష్ణన్, రఘుగణేష్, కానిస్టేబుల్స్‌ మురుగన్, ముత్తురాజ్‌లను సీబీసీఐడీ అరెస్టు చేసింది. వీరందర్నీ ప్రస్తుతం మదురై కేంద్ర కారాగారంలోని ఓ నివాసంలో బంధించారు. ఈ కేసులో మరి కొందరు అరెస్టు కావొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. సీబీసీఐడీ అధికారులు ఎక్కడ లీకులకు ఆస్కారం ఇవ్వని రీతిలో విచారణను వేగవంతం చేశారు.(ఎస్సై చెంప పగలగొట్టిన మహిళ)

రేవతి వాంగ్మూలం కీలకం....
మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలతో ఆది నుంచి ఈ కేసులో సీబీసీఐడీ దూకుడుగానే ముందుకు సాగుతోంది. ఆ విభాగం ఐజీ శంకర్‌ నేతృత్వంలోని బృందం రేయింబవళ్లు విచారణను ముమ్మరం చేసింది. తొలుత ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసినానంతరం ఈ కేసులో అత్యంత కీలక సాక్షిగా ఉన్న ఆ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ రేవతి వద్ద సీబీసీఐడీ వర్గాలు రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఈ ఐదుగురే నిందితులు అన్నది తొలుత భావించినా, ఆ స్టేషన్‌లో పనిచేసిన మరి కొందరి హస్తం ఉండవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. రేవతి ఇచ్చిన వాంగ్మూలంలో ఆ స్టేషన్‌ ఏఎస్‌ఐ పాల్‌దురై, హెడ్‌ కానిస్టేబుల్‌ చెల్లదురై, కానిస్టేబుల్‌ థామస్, స్వామిదురై, వేలు ముత్తుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ గేట్లు, తలుపులు మూసి వేసి మరీ అర్ధరాత్రి వేళ తండ్రి, కొడుకుల్ని వీరు కూడా చిత్ర హింసలకు గురి చేసినట్టు తేలింది. దీంతో బుధవారం వద్ద వీరి వద్ద విచారణ వీడియో చిత్రీకరణ ద్వారా సాగింది.

అర్ధరాత్రి వేళ వీరిని రిమాండ్‌కు తరలించారు. తొలుత ఈ ఐదుగురు కేసుతో తమకు సంబంధం లేదని, అంతా పెద్దలు చేసిన పనే అంటూ గ్రామస్తుల్ని నమ్మించి తప్పించుకు వెళ్లారు. అలాగే, సస్పెండ్‌ వేటు నుంచి బయట పడ్డాడు. ప్రస్తుతం వీరి బండారం బయట పడడంతో సాత్తాన్‌ కులం వాసులు ఈ ఐదుగురి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎవరి కంట పడకుండా వీరిని భద్రత బలగాల నడుమ తూత్తుకుడి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. జైలుకు తరలించేందుకు ముందుగా ఆస్పత్రికి తరలించారు. అయితే, పాల్‌ దురై, థామస్‌ తాము జైలుకు వెళ్లమని మారం చేశారు. తమకు షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నాయని, ఆస్పత్రిలోనే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో  ఈ ఇద్దర్ని భద్రత నడుమ ఆస్పత్రికి పరిమితం చేశారు. మిగిలిన వారిని జైలుకు తరలించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తనకు బెయిల్‌మంజూరు చేయాలని కోరుతూ గురువారం తూత్తుకుడి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్‌ భారతీ దాసన్‌ తన విచారణను కొనసాగిస్తూనే ఉన్నారు. తన విచారణ నివేదికను మదురై ధర్మాసనానికి సమర్పించేందుకు పరుగులు తీశారు. ఆయన కోవిల్‌ పట్టి సబ్‌ జైల్లో కొన్ని గంటల పాటు విచారణ నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement