ఒక్కో పేపర్ రూ. కోటిపైనే.. పీజీ మెడికల్ స్కాం చేధించిన సీఐడీ
హైదరాబాద్: పీజీ మెడికల్ స్కాంను సీబీసీఐడీ పోలీసులు ఛేదించారు. ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు బ్రోకర్లతో పాటు ఐదుగురి విద్యార్థులను అరెస్ట్ చేశారు. సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు.
శ్రీనగర్ కాలనీలోని వర్జిన్స్ కన్సెల్టెన్సీ పేరిట కుంభకోణం జరిగినట్టు సీఐడీ పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ కుంభకోణంలో మొత్తం 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయి. ఒక్కో పేపర్కు కోటి నుంచి కోటి 20 లక్షల రూపాయల దారా వసూలు చేశారు. అంజూ సింగ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడు. సాయినాథ్, మునీశ్వర్ రెడ్డి బ్రోకర్లుగా వ్యవహరించారు. అరెస్ట్ అయిన వారిలో ఓ విద్యార్థిని తండ్రి కూడా ఉన్నారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సివుందని కృష్ణ ప్రసాద్ చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు దర్యాప్తు బృందాలను పంపామని తెలిపారు. పీజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రం జిరాక్స్ కాపీని కీతో సహా విద్యార్థులకు అందజేశారని వివరించారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు.
డీజీపీ ప్రసాదరావు, సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అంతకుముందు గవర్నర్ నరసింహన్ను కలిశారు. పీజీ మెడికల్ స్కాంపై విచారణ నివేదికను గవర్నర్కు సమర్పించారు. పీజీ మెట్ను రద్దు చేయాలని సీఐడీ చీఫ్ గవర్నర్కు సూచించినట్టు సమాచారం. పీజీ మెట్ పరీక్ష రద్దుచేయాలా? వద్దా? అన్న విషయంపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.