పీజీ వైద్య పరీక్ష స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్ : పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120 (B), 420 సహా పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణకు సీఐడీ ఆరు ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దించింది. వివిధ ప్రాంతాల్లో, కోణాల్లో ఆరా తీసేందుకు విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయల్దేరి వెళ్లాయి.
కాగా గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం ఐపీసీలోని ఓ సెక్షన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్‌లోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న ఏప్రిల్ 15లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇస్తారా? కౌన్సెలింగ్‌ను వాయిదా పడుతుందా? అన్నది తేలాల్సి ఉంది.