బషీరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన ఇళ్లకు కొత్త ఇళ్లంటూ బిల్లులు చెల్లించారని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా లేదా అనే విషయమై తనిఖీ చేశారు. బషీరాబాద్‌లో ఏ ఇంటికి వెళ్లిన 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకే హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ బిల్లులు చెల్లించారని విచారణలో వెల్లడైంది.
ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పుకుంటున్న ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన అధికారులు బిల్లుల స్వాహాలో లబ్ధిదారులు, అధికారులు, స్థానిక నాయకుల చేతివాటం ఉన్నట్లు నిర్ధారించారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ రజాక్ ఇంటికి అధికారులు వెళ్లగా ఉప సర్పంచ్ తల్లి పేరిట పాత ఇంటిని చూపించి ఇల్లు కట్టుకున్నట్లుగా బిల్లు స్వాహ చేశారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దుకాణ సముదాయం నిర్మించుకున్నారని గుర్తించారు. జయంతి కాలనీలో మధ్యవర్తులతో కలిసి అధికారులు బిల్లులు స్వాహా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఎవ్వర్నీ వదలం..
బషీరాబాద్ మండల కేంద్రంలో 479 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 98 లక్షల అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో ఎంపికైన బషీరాబాద్ గ్రామ పంచాయతిలో మొత్తం 1195 ఇళ్లు మంజూరు కాగా అందులో 951 నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించారన్నారు. వాస్తవానికి బషీరాబాద్ గ్రామ పంచాయతిలో 80 శాతం వరకు ఇళ్ల బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. పథకం అమలు నాటి నుంచి కొనసాగిన అధికారులను విచారణ చేస్తామన్నారు.
ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన పలువురి అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసిందని, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై అధికారుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈనెల 14 లోపు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ సైతం తల్లి పేరిట ఇల్లు కట్టకుండానే బిల్లు తీసుకోవడం విడ్డూరమన్నారు.
ఈ విచారణలో సీబీసీఐడీ అధికారుల బృందం జితేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, బషీరాబాద్ ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి, హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ, గతంలో పని చేసిన డీఈఈలు, ఏఈలు ఉన్నారు.
బషీరాబాద్ పంచాయతీ పరిధిలో విచారణ జరగనుందని తెలిసినా హౌసింగ్ అధికారులు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సీఐడీ అధికారుల బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు కొన్ని ఇళ్ల తనిఖీ చేశారు. అయితే ఇళ్లకు నంబర్‌లు వేసి పిలుస్తామని చెప్పిన హౌసింగ్ అధికారులు సాయత్రం 4గంటల వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో సీఐడీ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అక్రమాల పుట్ట పగులుతోంది!
Published Fri, Sep 5 2014 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement