
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిబంధన
సర్వే సమయంలో చూపిన స్థలంలోనే నిర్మిస్తేనే బిల్లు
జియో ఫెన్సింగ్ విధానం ద్వారా అనుమతులు
ఉమ్మడి జిల్లాలో 42 వేల ఇళ్లు మంజూరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సర్వే సమయంలో చూపించిన స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడు చూపించిన ప్లాటు కాకుండా వేరే చోట్ల ఇల్లు నిర్మిచేందుకు సిద్ధమైతే.. రద్దు చేయనున్నారు. ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని.. జియో పెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని.. అప్పుడే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ప్రత్యేక యాప్‌ను తయారు చేసింది. ఆ యాప్ ద్వారా గతంలో సర్వే చేసిన ఇంటి స్థలంలోనే ఇల్లు కట్టేందుకు అనుమతినిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు తావుండదు.
జియో పెన్సింగ్ విధానం అమలు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 చొప్పున ఉమ్మడి జిల్లాకు 42 వేల ఇళ్లను మంజూరు చేసింది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించి.. ఇంటింటి సర్వే పూర్తి చేసింది. సర్వే సందర్భంగా ప్రస్తుతం నివాసం ఉండే ఇల్లు, ఇంటి స్థలం, డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. సొంత జాగా ఉన్న పేదల జాబితాను సిద్ధం చేశారు. ఇల్లు మంజూరైన వారు సర్వే సమయంలో చూపించిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.
జియో పెన్సింగ్ విధానం ద్వారా అనుమతి ఇస్తుండడంతో.. అక్కడే ముగ్గు పోయాల్సి ఉంటుంది. ముగ్గు పోసే సమయంలో గ్రామ కార్యదర్శి, వార్డు అధికారికి సమాచారం ఇస్తారు. సర్వే సమయంలో చూపిన స్థలం అదేనా కాదా అని వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక యాప్‌లో స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాల వివరాలతో జియో పెన్సింగ్ చేస్తారు. అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద ఉండి యాప్ ద్వారా పరిశీలిస్తారు. సర్వే సమయంలో ఇచ్చిన వివరాలు పరిపోలితేనే.. లబ్ధిదారుల ఫొటోలు, వివరాలు అన్‌లైడ్‌లో అప్‌లోడ్ అవుతాయి.. తప్పుడు సమాచారం ఇస్తే యాప్ తీసుకోదు.
అక్రమాలకు అడ్డుకట్ట..
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే జియో పెన్సింగ్ విధానం ద్వారా పాత ఇళ్లను చూపి గతంలో మాదిరిగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. గతంలో ఒకరికి మంజూరైతే.. మరొకరు నిర్మించుకోవడం, చూపించిన చోట గాకుండా మరోచోట నిర్మాణాలు చేసుకోవడం వంటివి జరిగేవి. కొత్త విధానంతో వాటికి చెక్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment