చిత్తూరు అర్బన్: హీరా గ్రూపుల సంస్థ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఏపీ సీబీసీఐడీ పోలీసులు గురువారం చిత్తూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. మదన పల్లెకు చెందిన నౌహీరా.. హీరా గ్రూపుల్లో అక్రమ మార్గాల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి, వినియోగదారులను మోసం చేశారంటూ గతే డాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా కలకడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హీరా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీ పోలీసులకు అప్పగించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలోనూ ఇదే తరహా ఫిర్యాదు అందడంతో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
దాని తర్వాత మనీ లాండరింగ్ కింద ముంబైకు చెందిన పలువురు హీరాపై పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారెంటుపై నాంపల్లి నుంచి హీరాను ముంబై మహి ళా సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా కలకడలో ఉన్న కేసులో సీబీసీఐడీ పోలీసులు హీరాను ముంబై నుంచి చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో నౌహీరాకు ఈ నెల 10 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి కబర్ది ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు రూ. వేల కోట్లలో జరిగిన హీరా గ్రూపు లావాదేవీల్లో ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నౌహీరాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీసీఐడీ పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment