ఇది మనుషులు చేసే పనియేనా?
గయ: బీహార్ గయకు సమీపంలోని గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే ఆటవికమైన శిక్షను అమలు చేశారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 16 ఏళ్ల అమ్మాయిని, 32 ఏళ్ల వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి సజీవ దహనం చేశారు.
పెళ్లయి ముగ్గురు పిల్లలున్న వ్యక్తి తన అత్తగారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఈ పదహారేళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇద్దరినీ వెతికి పట్టుకున్న అమ్మాయి బంధువులు పంచాయితీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పంచాయతీ పెద్దలు సమావేశాన్ని ఏర్పాటుచేసి శిక్షను ఖరారు చేశారు. వారి ఆదేశాల ప్రకారమే బుధవారం ఈ శిక్షను అమలు చేశారు. బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువుల సమక్షంలోనే ఈ ఘోరం జరిగింది. గ్రామంలో ఒక్కరు కూడా ఈ ఘటనను వ్యతిరేకించలేదు, కనీసం పోలీసులకు తెలియజేయలేదు.
పొరుగున ఉన్న గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో మోహరించారు.ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో సహా, 20 మందిని అనుమానితులుగా గుర్తించామని, తదుపరి విచారణ అనంతరం మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి షాలిన్ తెలిపారు.
మనిషిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనేనా...తప్పు చేసిన మనుషులను శిక్షించడానికే కోర్టులు, చట్టాలు ఉన్నాయంటున్నారు రాష్ట్రంలోని హక్కుల సంఘాల నాయకులు. ఇంకా మధ్య యుగాల నాటి శిక్షలు అమలు కావడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.