హద్దుల్లేని పద్దులు
36 పంచాయతీల్లో జరగని ఆడిట్
సర్పంచులకు రద్దుకానున్న చెక్‌పవర్
మూడు మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి
నేటి వరకు అవకాశం కల్పించిన అధికారులు
ఈఓపీఆర్‌డీల పాలనలోని నగదు పుస్తకాలను చూపించని వైనం
కడప : ప్రతి గ్రామ పంచాయతీతోపాటు మండల పరిషత్, మున్సిపాలిటీల్లో నగదు పద్దులకు సంబంధించి ఆడిట్ జరగాలని చట్టం ఉన్నా... కొంతమంది అధికారులు చట్టాన్ని పక్కన పెట్టారు. దీంతో ఆపద్దులపై ఓ వైపు అనుమానాలు వ్యక్తం అవుతుండగా మరోవైపు ఆయూ పంచాయతీల్లో సర్పంచుల చెక్‌పవర్ రద్దుకు దారితీయనుంది. జిల్లాలో 2013లో ఎన్నికైన సుమారు 36 మంది సర్పంచులకు ఈ గండం పొంచి ఉంది. గ్రామ పంచాయతీ కార్యకలాపాల పర్యవేక్షణకు కొద్దిరోజులు ఈఓపీఆర్‌డీలు ప్రత్యేక అధికారంలో ఉన్న కాలానికి సంబంధించిన నగదు పుస్తకాలు కూడా పలుచోట్ల ఆడిట్ అధికారులకు చూపించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 2014 డిసెంబరు చివరిలోపు ఆడిట్ చేయించుకోని 36 పంచాయతీలకు సంబంధించి జనవరి చివరి వరకు (నేటి వరకు) గడువు ఇచ్చారు. ఈ గడువులో కూడా తక్కువ పంచాయతీలు మాత్రమే చెక్ పవర్ గండం నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది.
36 పంచాయతీల్లో కనిపించని ఆడిట్
జిల్లాలో సుమారు 746 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 36 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆడిట్ జరగలేదు. ప్రతి ఏడాది చివరిలో పంచాయతీలో జమ ఖర్చులను తేల్చాల్సిన బాధ్యత ఆడిట్ అధికారులపై ఉంది. అయితే 36 పంచాయతీలకు సంబంధించి ఇంతవరకు ఆడిట్ జరగకపోవడంతో వాటికి సంబంధించిన సర్పంచులు చెక్ పవర్‌కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ప్రతి వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహారించే సర్పంచులకు చెక్ పవర్ లేకపోతే అభివృద్ది పనులు కూడా కుంటుపడే అవకాశం లేకపోలేదు. 2014 డిసెంబరు నాటికే గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహణకు సంబంధించి గడువు ముగిసింది. అయితే, జనవరి చివరి వరకు పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించుకునేందుకు గడువు పెంచి అవకాశం ఇచ్చినా ఎంతమాత్రం ఆడిట్ చేయించుకున్నారన్నది అనుమానంగా ఉంది. జనవరి నెలకు సంబంధించి ఎన్ని పంచాయతీలు ఆడిట్ చేయించుకున్నాయన్న విషయాలు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి.
మూడు మండల కేంద్రాల్లో కూడా...
జిల్లాలో ప్రధానంగా మూడు మండల కేంద్రాలైన పంచాయతీల్లో కూడా ఆడిట్ నిర్వహించకపోవడంపై అసలు కారణాలు బయటికి రావడం లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం, పెద్దముడియం, రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం మండల కేంద్రంలోని పంచాయతీల్లో కూడా డిసెంబరు ఆఖరు వరకు ఆడిట్ నిర్వహించలేదు. ఎందుకు ఆడిట్ నిర్వహణకు స్థానిక పంచాయతీ అధికారులు ముందుకు రాలేదన్నది అర్థం కావడం లేదు. పైగా జిల్లా స్థాయి అధికారులైనా దృష్టి సారించి పంచాయతీల్లో ఆడిట్ జరిగేలా కృషి చేసి ఉంటే బాగుండేదని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు.