
‘అనంత’లో అమానుషం
♦ పంచాయతీ కార్యదర్శి భవానీపట్ల కులవివక్ష
♦ నల్లలమ్మ ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ వర్గీయుల తాళం
బ్రహ్మసముద్రం : రాష్ట్రంలో దళితుల పట్ల కొనసాగుతున్న కుల వివక్షకు మరో నిదర్శనమిది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ దళితురాలు కావడంతో తమ గ్రామంలోని ఆలయంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ టీడీపీ సానుభూతిపరుడొకరు అవమానించడమేగాక.. తనవారితో కలసి ఆమె లోపలకి వెళ్లకుండా ఆలయానికి తాళం వేసిన అమానుష ఘటన ఇది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి... భైరసముద్రం గ్రామపంచాయతీ రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తున్న భవానీకి ముప్పులకుంట కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో భాగంగా ఆమె జూలై ఆరు నుంచి ముప్పులకుంటలో స్మార్ట్ పల్స్‌సర్వే నిర్వహిస్తున్నారు.
మూడురోజులుగా అదే గ్రామంలోని నల్లలమ్మ ఆలయంలో కూర్చుని సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. నెట్‌వర్క్ సిగ్నల్ అక్కడ బాగా ఉండడంతో ఆలయంలో కూర్చుంటున్నారు. రెండురోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు చంద్ర.. పంచాయతీ కార్యదర్శి భవానీని ‘మీదే కులం? ఎస్సీలైతే గుడిలోకి వెళ్లకూడదంటూ’ అవమానించడం మొదలుపెట్టాడు. మనోవేదనకు గురైన ఆమె ‘ఎందుకిలా మాట్లాడుతున్నారు. ప్రతిరోజూ కులం గురించి అడుగుతున్నారు.
ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారు?’ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో అతను గ్రామంలోని తన వర్గీయులకు సమాచారమివ్వగా.. వారంతా కలసి పంచాయతీ కార్యదర్శిని ఆలయంలోకి అడుగుపెట్టకుండా తాళం వేయాలని, ఆలయాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సర్వేకోసం శుక్రవారం గ్రామానికెళ్లిన పంచాయతీ కార్యదర్శి భవానీ ఆలయానికి తాళం వేసుండడాన్ని గమనించి ఆరాతీశారు. విషయం తెలియడంతో కంటితడి పెడుతూ పైఅధికారులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. అలాగే కళ్యాణదుర్గం సీఐ మన్సూరుద్దీన్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన హెడ్ కానిస్టేబుల్ రఘురాములును గ్రామానికి పంపి బాధితురాలినుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ తెలిపారు.