కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నాల్గవ కేటగిరీ కింద జిల్లాలో మొత్తం 296 మంది పంచాయతీ కార్యదర్శులుండాల్సి వుండగా ప్రస్తుతం 91 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని సర్‌ప్లస్ ఉద్యోగులు 60 మంది, మెడికల్ ఇన్‌వాల్యిడేషన్ కింద 31 మంది కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 205 పోస్టులకుగాను ప్రభుత్వం 98 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. వీటిలో 67 పురుషులు, 31పోస్టులు స్త్రీలకు రిజర్వు చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆదివారమే విడుదల చేశారు. ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరి స్తారు. ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా,డీపీఓ కన్వీనర్‌గా, జెడ్పీ సీఈ ఓ మెంబర్ గా ఉన్న కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
ఎంపిక పద్ధతి ఇలా.. : డిగ్రీ మార్కులకు 75శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక చేస్తారు. కాంట్రాక్టు కార్యదర్శులకు 25 మార్కులు అదనంగా కేటాయిస్తారు. సర్వీసులో చేరినప్పటి నుంచి ఏడాదికి 3 మార్కుల ప్రకారం గరిష్టంగా 15, డిగ్రీ ఉత్తీర్ణులైనప్పటి నుంచి ఏడాదికి మార్కు ప్రకారం గరిష్టంగా 10 మార్కులు వెయిటేజీగా కలుపుతారు.