కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో 98 గ్రామ పంచాయతీ పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది ఆగస్టు 14న ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించడంతో 11,221 మంది నిరుద్యోగులు అష్టకష్టాలకోర్చి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ,ఎస్టీలు మినహాయించి మిగిలిన వర్గాలకు చెందిన నిరుద్యోగులందరూ రూ.50లకు డీడీ తీయాలనే నిబంధన విధించారు.
పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలలోనే ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. డిగ్రీ పాస్ అయినట్లయితే 25 మార్కులను వెయిటేజీగా ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన డిగ్రీ ఉత్తీర్ణులైన కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులే ఎక్కువ పోస్టులను దక్కించుకునే వీలుంది.
అయినప్పటికీ డిగ్రీలో 85 శాతానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వేలాది మంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తమనే రెగ్యులర్ చేయాలని జిల్లాలోని కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పలువురు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో గత ఏడాది అక్టోబర్‌లోనే ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రిబ్యునల్ స్టెటస్‌కో ఇచ్చింది.
కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి తాజాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) కేశవరావు ఈ నెల 3న పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఓఏ నెంబర్ 8212/2013 మేరకు ఒక లేఖను రాశారు. ఎట్టకేలకు ఆ ప్రతులు జిల్లా అధికార యం త్రాంగానికి చేరాయి. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో 96 మందిని రెగ్యులర్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులకు సంతోషం కలిగించినా.. ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. తాము చెల్లించిన మొత్తాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి అందిన దరఖాస్తులను అబియెన్స్‌లో ఉంచుతామని డీపీవో శోభాస్వరూపరాణి తెలిపారు.
ఇచ్చినట్లే ఇచ్చి!
Published Wed, Jan 22 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement