నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
Published Tue, Jan 28 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో చిరు ఉద్యోగి మొదలు ఉన్నతాధికారి వరకు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సిద్ధార్థజైన్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువు బహిరంగ వేలాన్ని నిర్వహించిన కామవరపుకోట మండలం కళ్లచెరువు పంచాయతీ కార్యదర్శి వై.రఘునాథరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మతో ఈ విషయంపై చర్చించారు. కళ్లచెరువు గ్రామంలో రజకులకు కేటాయించాల్సిన 2 ఎకరాల చెరువును గ్రామ కార్యదర్శి బహిరంగ వేలం ఎందుకు వేశాడని ప్రశ్నించారు.
గ్రామ కార్యదర్శి తప్పు చేస్తే జంగారెడ్డిగూడెం డివిజినల్ పంచాయతీ అధికారి సాయిబాబాకు నిబంధనలు తెలియవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని సాయిబాబాకు మెమో జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఉద్యోగులు ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. డీపీవో నాగరాజువర్మ మాట్లాడుతూ కళ్లచెరువు గ్రామంలో రజకులకు కేటాయించాల్సిన 2 ఎకరాల చెరువును 2013 ఆగస్టు 12న గ్రామ కార్యదర్శి మూడేళ్లకు బహిరంగ వేలం నిర్వహించారని, దీనివల్ల 1.55 లక్షలు లీజుకు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తక్షణమే ఈ విషయంపై తగు చర్యలు తీసుకుని నివేదిక సమర్పిస్తానని చెప్పారు.
బోద వ్యాధి నివారణ మాత్రల పంపిణీపై సమీక్ష
జిల్లాలో మంగళవారం నిర్వహించే జాతీయ ఫైలేరియా దినోత్సవం సందర్భంగా బోదవ్యాధి నివారణ మందు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బోద వ్యాధి నివారణపై ప్రచార కార్యక్రమం అమలుపై ఆయన సమీక్షించారు. ఈ నెల 28న జిల్లాలోని ప్రతి ఒక్కరికీ ముందు జాగ్రత్త చర్యగా బోదవ్యాధి నివారణ మాత్రలను పంపిణీ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.శకుంతలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 7,580 మంది బోదవ్యాధితో బాధ పడుతున్నారన్నారు. గతేడాది 16 మంది వ్యాధిబారిన పడ్డారన్నారు. వైద్య విద్యానపరిషత్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శంకరరావు, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి వచ్చే నెల రెండో తేదీన నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉద్యోగాల కోసం 55 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వారందరికీ రాత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మెరిట్ ప్రాతిపదికపై పోస్టుల భర్తీ జరుగుతాయన్నారు.
అజ్జమూరు సర్పంచ్‌కు అభినందనలు
వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా సొంత ఖర్చులతో గ్రామంలో పూడుకుపోయిన చెరువు తవ్వటానికి ముందు కు వచ్చిన ఆకివీడు మండలం అజ్జమూరు సర్పంచ్ బచ్చు సరళ కుమారిని కలెక్టర్ సిద్థార్ధజైన్ అభినందించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలిసి చెరువు పునరుద్ధరణకు సహకరించాలని ఆమె కోరారు. వెంట నే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సీసీఎల్ సమీక్షకు కలెక్టర్ పయనం
రాష్ట్ర భూ పరిపాలనా కమిషనర్ (సీసీఎల్) మహంతి మంగళవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ సోమవారం హైదరాబాద్‌కు పయనమయ్యారు. కలెక్టర్ తిరిగి బుధవారం జిల్లాకు చేరుకోనున్నారు.
Advertisement
Advertisement