పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి గ్రామస్థాయి సిబ్బందిపై జులుం ప్రదర్శించారు.
► గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని తోసివేత
సాక్షి, ఏలూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి గ్రామస్థాయి సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. ఏలూరు మండలం కోటేశ్వరదుర్గాపురం గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని డ్రైనేజీపైకి తోశారు. ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా.. అంటూ చిందులు తొక్కారు. శని వారం జరిగిన ఈ సంఘటన ఉద్యోగులతో పాటు స్థానిక నాయకులను ఉలికిపాటుకు గురి చేసింది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన కోటేశ్వరదుర్గాపురం, గుడివాకలంక, మొండికోడు గ్రామాల్లో పర్యటించారు.
కోటేశ్వరదుర్గాపురంలో పంచాయతీ కార్యదర్శి గ్రామానికి సరిగా రావడం లేదని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేని ఆగ్రహంతో ఏయ్.. సెక్రటరీ, ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నేను వస్తుంటే గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం కూడా తెలియదా? అంటూ కార్యదర్శి అనిల్‌కుమార్ మెడపట్టుకుని పక్కనే ఉన్న డ్రైనేజీ వద్దకు తోసుకెళ్లారు. చూడు డ్రైనేజీ అధ్వానంగా ఉంది... నీకు కళ్లు కనబడడం లేదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కార్యదర్శిని పక్కకు లాగి వెనక్కి పంపారు. భీతిల్లిన కార్యదర్శి ‘సార్.. నాకు నాలుగు గ్రామాల ఇన్‌చార్జి ఇచ్చారు...’ అని చెప్పారు.
వాస్తవానికి కార్యదర్శి అనిల్‌కుమార్ మేజర్ పంచాయతీలైన శనివారపుపేట, చాటపర్రు, మాదేపల్లితో పాటు కోటేశ్వరదుర్గాపురం ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. నలుగురి పని ఒక్కడు చేస్తున్నా ఎమ్మెల్యే ఇలా దూషించడం అన్యాయమని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర శాఖల అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.