దాళ్వాకు ఓకే
Published Sat, Nov 30 2013 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రానున్న దాళ్వాలో పూర్తి విస్తీర్ణానికి సాగునీరు ఇవ్వాలని జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్ణయించింది. దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరివ్వాలా.. పూర్తిగా పంట విరామం ప్రకటించాలా.. లేక ఆధునికీకరణ పనులకు అవకాశం కల్పిస్తూ కొంత ఆయకట్టుకు మాత్రమే నీరివ్వాలా? అనే సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా నీటిపారుదల సలహా మం డలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాళ్వాకు నీరివ్వాల్సిందేనని రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరడంతో, అందుకు అంగీకరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటన చేశారు. దాళ్వాకు నీరివ్వాలనే నిర్ణయంతోపాటు వచ్చే సార్వా సాగుకు ఆలస్యంగా నీరిచ్చి, డెల్టా ఆధునికీకరణ పనులకు వెసులుబాటు కల్పించాలని తీర్మానించారు. దీర్ఘకాలికంగా సమస్యగా ఉన్న నందమూరు పాత అక్విడెక్ట్‌ను యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులు పూర్తయ్యాక తొలగించాలని నిర్ణయించారు.
మూడు ప్రతిపాదనల నడుమ...
నీటిపారుదల సలహా మండలి చైర్మన్, కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత ఇరిగేషన్ ఎస్‌ఈ వైఎస్ సుధాకర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటి విడుదల, డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం ముందుంచారు. జిల్లా యంత్రాంగం తరఫున ఆయన మూడు ప్రతిపాదనలు చేశారు. డెల్టా ప్రాంతంలో నికరంగా వరి సాగుచేసే 4.60 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరివ్వాలనేది మొదటి ప్రతి పాదన కాగా, ఉప్పుటేరు బేసిన్‌లోని వెంకయ్యవయ్యేరు, ఉండి కాలువ, పాత వయ్యేరు కాలువ, గోస్తనీ పరిధిలోని ఆయకట్టుకు పంట విరామాన్ని ప్రకటించి.. మిగిలిన ఏడు కాలువలకు సాగు నీరందించాలనేది రెండో ప్రతిపాదన. తద్వారా పంట విరామం ప్రకటించిన నాలుగు కాలువల పరిధిలో రూ.167 కోట్ల ఆధునికీకరణ పనులు చేపడతామని ఎస్‌ఈ ప్రతిపాదించారు. దాళ్వా తర్వాత వచ్చే సంవత్సరం మార్చి 31న కాలువలు మూసివేసి, జూలై 31 తిరిగి నీరు విడుదల చేయూలనేది మూడో ప్రతిపాదన. తద్వారా 120 రోజుల్లో రూ.171 కోట్ల డెల్టా ఆధునికీకరణ పనులు చేపడతామని తెలిపారు. సమావేశంలో మొదటి, మూడు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
మూడు కాలువల పరిధిలో పంట విరామం
లోసరి మెయిన్ కెనాల్, తోకతిప్ప బ్రాంచి కెనాల్, వీ అండ్ డబ్ల్యు కాలువ చివరి రీచ్‌తోపాటు మెరక ప్రాంతాలను సాగునీటి సరఫరా నుంచి మినహాయిస్తూ సమావేశం తీర్మానిం చింది. నీటి లభ్యత దృష్ట్యా తమ్మిలేరు, ఎర్రకాలువ, కొవ్వా డ కాలువ ఆయకట్టులో రబీ సాగుకు అనుమతించింది. రైతులతో సమావేశాలు నిర్వహించి వచ్చే దాళ్వాలో ఆరుతడి పంటలు వేసుకోవడానికి సిద్ధం చేయాలని తీర్మానించారు.
రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే : పితాని
పూర్తి స్థాయి పంట విరామం బదులు కొంత ఆయకట్టుకు పంట విరామాన్ని ప్రకటించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని తొలుత భావించామని, కానీ.. వరుస తుపానుల నేపథ్యంలో రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నిర్ణయాన్ని మార్చుకుని దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయిం చామని మంత్రి పితాని తెలిపారు. రైతులు త్వరగా నారుమడులు వేసుకుని, నాట్లను త్వరితగతిన పూర్తి చేయూలని కోరారు. తుపాన్లకు దెబ్బతిన్న పంటలకు పరిహారాన్ని త్వరలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, బీమా కూడా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలి కంగా అపరిష్కృతంగా ఉన్న నందమూరు పాత ఆక్విడెక్టును జూన్ 30లోగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమయంలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డెల్టా ఆధునికీరణ పనులు చేయడంలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు విఫలమయ్యారని పితాని పేర్కొన్నారు. ఇప్పటివరకూ కేవలం 30 శాతం పనులు మాత్రమే అయ్యాయమని తెలిపారు.
‘ఖరీఫ్‌కు ఆలస్యంగా నీరిస్తే కోర్టుకెళతాం’
ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరిస్తామని ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించిందని, అందుకు విరుద్ధంగా ఆలస్యంగా సాగు నీరిస్తే హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటీషన్ వేస్తామని రైతాంగ సమాఖ్య అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు అధికారులను హెచ్చరించారు. ఆధునికీకరణ పనులపై ప్రజలకు నమ్మకం పోయిందని, దాళ్వా కావాలో, ఆధునికీకరణ కావాలో తేల్చుకోమనడం సరికాదని అన్నారు. నీటిపారుదల ఎస్‌ఈకి వ్యవసాయంపై అవగాహన లేదనిపిస్తోం దని, జూలై నెలలో ఖరీఫ్‌కు నీరిస్తే ఎలాగని ప్రశ్నించారు. జూన్ ఒకటో తేదీకల్లా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు ఆలస్యమైతే తుపానుల వల్ల కోట్లాది రూపాయల పంటల్ని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేదు : దాళ్వా కావాలో, ఆధునికీకరణ కావాలో తేల్చుకోమనడం సరికాదని కౌలు రైతు సం ఘం నాయకుడు శ్రీనివాస్ విమర్శించారు. ఆధునికీకరణ పనుల విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆధునికీరణ చేయాలన్నారు.
తెలంగాణ వస్తే ఎలాగూ రబీ ఉండదు
తెలంగాణ 15 రోజుల్లో ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నారని, అదే జరిగితే వచ్చే దాళ్వా ఎలాగూ ఉండదని.. కాబట్టి ఈ సంవత్సరం దాళ్వా ఇవ్వాలని కాగుపాడు నీటి సంఘం నాయకులు అధికారులను కోరారు. కాలువ పైభాగం వారికి దాళ్వా ఇచ్చి కింది భాగంలో పనులు చేయాలని సూచించారు.
పాత అక్విడెక్టును తొలగిస్తే నష్టం ఉండదు : ఈలి నాని
నందమూరు పాత అక్విడెక్టును తొలగిస్తే ఎవరికీ నష్టం ఉండదని, రైతులు ఇబ్బంది పడకుండా ఈ సమస్యను పరిష్కరిం చాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కోరారు. అమెరికాలో తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ తుపానులు వస్తున్నట్లు ఒక శాస్త్రవేత్త చెప్పారని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. దాళ్వా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీని కొన్ని బ్యాంకులు రైతుల అప్పులకు జమ చేస్తున్నాయని, అలా చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఆధునికీకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి : కలెక్టర్
దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే ఆధునికీకరణ పనులు సాగవని కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పష్టం చేశారు. ఏటా సార్వాలో రైతులు నష్టపోతున్నారని, పేరుకు రెండు పంటలున్నా రైతులకు ఒక పంట మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని నివారిం చాలంటే ఆధునికీకరణే మార్గమన్నారు. ఇక్కడితో ఆగిపోకుండా వచ్చే సంవత్సరం ఏంచేయాలో కూడా నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈసారి కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు వారి బ్యాంక్ గ్యారంటీలను ఎన్‌క్యాష్ చేస్తామని హెచ్చరించారు.
పంట విరామం లేకుంటే
రూ.17 కోట్ల పనులే : ఇరిగేషన్ ఎస్‌ఈ
పంటలకు ఎటువంటి విరామం ఇవ్వకపోతే రూ.17 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు మాత్రమే చేయగలుగుతా మని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సుధాకర్ చెప్పారు. జిల్లాలో దాళ్వా సాగుకు 48 టీఎంసీల నీరు సరిపోతుందని, నీటి లభ్యత బాగానే ఉందని తెలిపారు. సమావేశంలో ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళి, జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ రుద్రరాజు పండురాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు డుమ్మా
కీలకమైన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్, డెల్టా ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి, కారుమూరి నాగేశ్వరరావు, కలవపూడి శివ తదితరులు హాజరుకాలేదు.
Advertisement
Advertisement