పితాని పితలాటకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ భూ సంతర్పణ రావణకాష్టంలా రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పితాని తన అనుచరులకు కట్టబెట్టిన భూముల వ్యవహా రంపై ఇప్పుడు దళితులు, మహిళలు ఎడతెగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకీ తీవ్రతరమవుతున్న ఈ భూవివాదం పూర్వాపరాలను పరి శీలిస్తే.. ఆచంటలోని నటరాజ్ థియేటర్ వెనుక భాగంలో గల రెండెకరాల 70సెంట్ల పోరంబోకు స్థలం (ఆర్‌ఎస్ నెం.1246/3) కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతోంది.
విలువైన ఈ భూమి మొత్తంగా కబ్జా అవుతున్న నేపథ్యంలో ఎప్పటినుంచో అక్కడ నివాసముంటున్న పేదలు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల పట్టాలు ఇప్పించాల్సిందిగా కోరుతూ వచ్చారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్‌కు, రచ్చబండ కార్యక్రమాల్లో అధికారులకు పలుమార్లు దరఖాస్తులు అందజేశారు. స్పందించిన అధికారులు అర్హులైన 40మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే విలువైన ఈ భూమిపై కన్నేసిన అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ అనుచరులు అర్హులైన 38మంది లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను రాసుకుని సరిగ్గా ఎన్నికలకు ముందు మంత్రి చేతుల మీదుగా ఆయన ఇంట్లోనే పట్టాలు పొందారు.
ఎన్నో ఏళ్లనుంచి అక్కడే ఉంటున్న తమకు కాకుండా అనర్హులకు పట్టాలివ్వడంపై స్థానికులు వెంటనే పితాని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, అక్కడికి సమీపంలో శివారు గ్రామమైన పోర ప్రాంతంలో 15 మందికి పట్టాలిప్పిస్తామని ఆయన నచ్చజెప్పారు. అక్కడ ఎప్పటినుంచో నివాసముంటున్న తాము మరోచోటకు ఎందుకు వెళ్తామంటూ స్థానికులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో సదరు భూముల వ్యవహారం కొంతకాలం సద్దుమణిగింది.
టీడీపీ వాళ్లే మిమ్మల్ని పంపించి ఉంటారు : పితాని ఆగ్రహం
తాజాగా ఈ ప్రాంతవాసులు మళ్లీ తాము ఉంటున్న స్థలాలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ఈ విషయమై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలిసి అభ్యర్థించేందుకు సుమారు యాభైమంది మహిళలు కొద్దిరోజుల కిందట పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలోని పితాని స్వగృహానికి వెళ్లారు. అంతే.. వారిని చూడగానే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘పట్టాల్లేవ్.. స్థలాల్లేవ్.. మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు. ఆచంట టీడీపీ వాళ్లే ఇదంతా చేస్తున్నారు. ఈ రాజకీయాలు నా దగ్గరొద్దు. ముందు ఇక్కడి నుంచి పోండి..’ అంటూ ఒకింత కటువుగా మాట్లాడినట్టు చెబుతున్నారు.
పితాని వ్యవహార శైలిపై స్థానికులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసనలు చేపడు తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అయిన పితాని వద్దకు ఎప్పటినుంచో ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న తాము వెళ్తే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆందోళనకారులను అవమానిస్తున్నారు
మహిళలని కూడా చూడకుండా ఇంటికొచ్చిన వారి పై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పుడు భూముల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న ఆందోళనకారులను కూడా అవమానిస్తున్నారు. వారం రోజులకుపైగా ఆచంట నియోజకవర్గ కేంద్రంలో పేదలు, మహిళలు నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయం. అర్హులైన వారికే పట్టాలు వచ్చాయని మంత్రి వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులతో పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయి.
- వసంతాడ నాగేశ్వరరావు, దళిత ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు