రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి రాజేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి రాజేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ కథనం ప్రకారం.. కందుకూరు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ ఆకులమైలారం పంచాయతీకి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాడు. గ్రామంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి.
దీంతో ఎంపీటీసీ కరుణశ్రీ భర్త సురేష్ నిర్మాణ పనుల కోసం తీర్మానం చేయించి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి రాజేష్‌ను కోరాడు. ఇందుకు 5 శాతం కమీషన్ ఇవ్వాలని రాజేష్ డిమాండ్ చేశాడు. దీంతో సురేష్ రూ.4 వేలు ఇస్తానని అంగీకరించి.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సురేష్ నుంచి పంచాయతీ కార్యదర్శి రాజేష్ రూ.4 వేలు తీసుకుని సూపరింటెండెంట్ కార్యాలయంలోకి వెళుతుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.