ఏసీబీకి చిక్కిన కూర్మారావు
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన రీపోస్టింగ్ కోసం కె.జమ్మయ్య అనే ఉపాధ్యాయుడు నుంచి డీఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఎ.విక్టర్‌ప్రసాద్ 20 వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ పట్టుబడిన విషయాన్ని మరువకముందే మరో అవినీతి చేప పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఈసారి పాపులేషన్ సర్టిఫికెట్ జారీకి రూ. 10 వేలు డిమాండ్ చేసి..రూ. 6 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ కార్యదర్శి తెంబూరు కూర్మారావు గురువారం చిక్కారు.
ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం పంచాయతీ (ఫరీదుపేట ఇన్‌చార్జి) గ్రామ కార్యదర్శి తెంబూరి కూర్మారావు ఆరు వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ పంచాయతీ కార్యాలయంలోనే పట్టుబడ్డారని అవినీతి నిరో« దకశాఖ (ఏసీబీ) డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. ఫరీదుపేట గ్రామానికి చెందిన యువకుడు సీపా న దిలీప్ కుమార్‌కు కుశాలపురం పంచాయతీ పరిధి నవభారత్ సమీపంలో స్థలం ఉంది. ఇక్కడ పేపర్ ప్లేట్లు, గ్లాస్ తయారీ పరిశ్రమ స్థాపించాలనుకున్నారు. ఇందుకోసం ఖాదీబోర్డు శాఖకు రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసేందుకు పాపులేషన్ సర్టిఫికెట్ అవసరమైంది. సర్టిఫికెట్ కోసం కార్యదర్శి కూర్మారావును ఫోన్‌లో దిలీఫ్ సంప్రదించగా రూ. 10 వేలు డిమాండ్ చేశారు.
యువకుడు కార్యదర్శి ఫోన్ సంభాషణను కూడా వాయిస్ రికార్డు చేసి ఏసీబీ అధికారులను సంప్రదించారు. కార్యదర్శికి రూ. 6 వేలు ఇచ్చేందుకు యువకుడు దిలీప్ అంగీకరించాడు. స్వీయ ధ్రువీకరణతో పాపులేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. గురువారం కుశాలపురంలోని పంచాయతీ కార్యాలయంలో దిలీప్ కుమార్ కార్యదర్శి కూర్మారావుకు లంచంగా ఆరు వేల రూపాయలను అందజేస్తుండగా.. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ కరణం రాజేంద్ర, సీఐలు రమేష్, శ్రీనివాసరావు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన కార్యదర్శి పంచాయతీ సహాయకుడుగా పని చేస్తున్న మెరక ప్రసాదరావు చేతిలో డబ్బులు పెట్టేప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఏసీబీ అధికారులు దాడి చేయడంతో ఆయన ప్రయత్నం విఫలమైంది. లంచంగా తీసుకున్న ఆరు వేల రూపాయలను ఏసీబీ అధికారులు కార్యదర్శి నుంచి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. కూర్మారావును అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించామని డీఎస్పీ కరణం రాజేంద్ర చెప్పారు.
చర్చనీయాంశం
గ్రామ కార్యదర్శి ఏసీబీకి చిక్కడం ఎచ్చెర్ల మండలంలో చర్చనీయాంశమైంది. ఎచ్చెర్ల మండలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల ఏసీబీకి చిక్కారు. నాలుగు నెలల క్రితం తహసీల్దార్ కార్యాలయం వద్దే పాస్ పుస్తకం కోసం రూ. 30 వేలు లంచంగా తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ బలివాడ శ్రీహరి బాబు ఏసీబీకి చిక్కారు. అలాగే ధర్మవరం, కొయ్యాం వీఆర్వోలు అప్పారావునాయుడు, నర్సునాయుడు కూడా ఇటీవల పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment