పట్టుబడిన కార్యదర్శి చెంచు
చీరాల(ప్రకాశం): అతని సర్వీసు అంతా అవినీతి...అక్రమాలతో చీరాల ప్రాంత ప్రజలను పీల్చుకుతిన్న ఓ తిమింగలం ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కుకుంది. దేవాంగపురి తాజా మాజీ సర్పంచ్ పృధ్వీ చాందినీ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల చేసేందుకు రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. బుధవారం ఒంగోలు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ దేవాంగపురి పంచాయతీ కార్యదర్శి వై.చెంచును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డీఎస్పీ వివరాల మేరకు.. దేవాంగపురి గ్రామంలో 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ పృధ్వీ చాందినీ 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రూ.18.60 లక్షలకు అభివృద్ధి పనులు చేశారు. వీటిలో రూ.15 లక్షలను గతనెల 274 తేదీన సర్పంచ్ ఖాతాకు నిధులు జమ అయ్యాయి. మిగిలిన రూ.3.60 లక్షల బిల్లులు చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ వై.చెంచును చాందినీ, అతని భర్త సుబ్బారావులు పలుమార్లు పం కోరారు. అయితే తనకు లంచం ఇస్తేనే మీ బిల్లులు చెల్లింపులు చేస్తామని తేల్చి చెప్పడంతో సర్పంచ్ దంపతులు ఈనెల 6వ తేదీ ఒంగోలు ఏసీబీ ప్రభాకర్‌ను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీంతో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ అధికారులు రసాయనాలు కలిపిన నగదు రూ.70 వేలను సర్పంచ్ దంపతులకు అందించి సెక్రటరీ చెంచుకు ఇప్పించారు. ఈ నేపథ్యంలో నగదును లెక్కించుకుని చెంచు జేబులో పెట్టుకుంటుండగా డీఎస్పీ ప్రభాకర్, సీఐలు ప్రతాప్, ఎస్సై రాఘవలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు చెంచుపై పలు అవినీతి ఫిర్యాదులు తమకు అందాయని, ప్రజలతో పాటు సర్పంచ్‌లను కూడా లంచాల కోసం వే«ధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.
కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని తెలిపారు. పంచాయతీ పన్నులు, ప్లాన్‌లు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కోటేశ్వరరావు రికార్డులను బీరువాలో పెట్టుకుని పరారీలో ఉన్నాడని .. ఇతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన చెంచు గతంలో చినగంజాంలో పనిచేస్తూ అవినీతి, అక్రమాల్లో నేరం రుజువు కావడంతో సస్పెండ్ అయ్యాడని, రామకృష్ణాపురంలో అక్రమాలపై విచారణ జరిగినట్లు తమ విచారణలో తేలిందన్నారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో బీరువాను తెరచి పంచాయతీ సెక్రటరీ రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీకి సమాచారం ఇవ్వండి
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, లంచాల కోసం వేధిస్తున్న వారి వివరాలు, అక్రమార్జనల గురించి తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి అండగా ఏసీబీ ఉంటుందన్నారు. అక్రమాలపై డీఎస్పీ 9440446189, సీఐ 9440446187, ఎస్సై 833925624 నంబర్లను సంప్రదించాలన్నారు.
చెంచు అక్రమాలపై ‘సాక్షి’ కథనాలు
ఏసీబీ వలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి చెంచు ఎక్కడ పనిచేసినా అక్రమాలకు పాల్పడటం అలవాటు. గతంలో చినగంజాంలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యాడు. అలానే రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న చెంచు పింఛన్లు కాజేస్తున్న వైనం పోయినోళ్ల పింఛన్లు స్వాహా’ కథనం సాక్షి ప్రచురించింది. గ్రామంలో చనిపోయిన వారి పేర్లతో మూడు నెలల పాటు రూ. 55 వేలు అక్రమంగా తీసుకోవడం, బిల్డింగ్ ప్లాన్లు మంజూరులో భారీ స్థాయిలో నగదు వసూళ్లు చేశాడు. దీనిపై రెండు సార్లు సాక్షి కథనాలు ప్రచురించగా డీపీఓ, ఈవోఆర్డీలు విచారించి చెంచుపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేశారు. అయినా కార్యదర్శి చెంచు లంచాలను తీసుకోవడం మానలేదు. మరోసారి ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్‌తో పాటు జైలుకు వెళ్లనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment