ఇంటిపన్నురూ.5000= రసీదు రూ.4500
రైల్వేకోడూరు: పంచాయితీ కార్యదర్శి ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తోందని విద్యానగర్ వాసులు ఈఓపీఆర్డీ సంజీవరావుకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఈఓపీఆర్డీను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కె.బుడుగుంటపల్లె పంచాయితీ కార్యదర్శి లక్ష్మీదేవితో మరో వ్యక్తితో వచ్చి తమను బెదిరించి ఇంటి పన్నులు వేలలో కట్టమని డిమాండు చేస్తోందని ఆరోపించారు. రేకుల ఇంటికి కూడా వేలల్లో ఇంటి పన్ను కట్టమంటే ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిల్లర అంగడి ఉంటే దానికి ఇంటి పన్ను 5 వేలు అడుగుతోందని, ఇదేంటని అడిగితే అది అంతేనని కట్టక తప్పదని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బయపెడుతోందన్నారు. తీసుకున్న మొత్తంలో 5 వందలు తగ్గించుకుని బిల్లు ఇస్తోందని ఇదేంటని అడిగితే కంప్యూటర్ పనిచేయడం లేదని కుంటి సాకులు చెబుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. ప్రతి బిల్లుకు 4 నుంచి 5 వందలు ఎక్కువగా వసూలు చేసుకుని తక్కువ మొత్తానికి బిల్లు ఇస్తోందన్నారు. కార్యదర్శి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, న్యాయం చేయాలని కోరారు.
ఈ విషయంపై ఈఓపీఆర్డీను వివరణ కోరగా కె.బుడుగుంటపల్లె పంచాయితీలో మొత్తం 925 ఇండ్లు ఉన్నాయని, ఇంటి పన్ను వసూలు డిమాండు 1.70 లక్షలు ఉందన్నారు. సరాసరి ఒక ఇంటికి 185 రూపాయులు కడితే చాలన్నారు. షాపులు, ఇతర వాటికి 500 లైసెన్సు రుసుం చెల్లిస్తే సరిపోతుందన్నారు. అలా ఎందుకు వసూలు చేసిందో తమకు తెలియదన్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. గతంలో ఆమె పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదని, రాజంపేట డీఎల్‌పీఓ రమణ విచారణ చేపట్టిన విషయం తెలిసినదే. ఫిర్యాదు చేసిన వారిలో దామోదర్, ప్రకాష్, రత్న, కుమారి, నరసమ్మ, సుశీలమ్మ తదితరులు ఉన్నారు.