లగచర్ల కేసులో ఏ–26పై కలెక్టర్ చర్యలు
డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డిపై బదిలీ వేటు
నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ 25వ తేదీకి వాయిదా
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్‌కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్‌రెడ్డి అందజేసిన అఫిడవిట్‌ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.
కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ
నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment