
స్పీకర్‌కు లేఖను అందజేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
తన సస్పెన్షన్‌పై బులెటిన్ ఇవ్వాలని స్పీకర్‌కు వినతిపత్రం
కోర్టుకు పోతాననే భయంతోనే బులెటిన్ ఇవ్వడం లేదన్న ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా తనపై విధించిన సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక బులెటిన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం స్పీకర్ చాంబర్‌లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను జగదీశ్‌రెడ్డి కలిశారు. తనను అన్యాయంగా, ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని, ఇప్పటికైనా తన సస్పెన్షన్‌పై బులెటిన్ విడుదల చేయడంతోపాటు అసెంబ్లీ వెబ్‌సైట్‌లో పెట్టాలని స్పీకర్‌కు అందజేసిన లేఖలో జగదీశ్‌రెడ్డి కోరారు.
కాగా అసెంబ్లీ లాబీలోని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష చాంబర్‌కు వచ్చిన జగదీశ్‌రెడ్డిని సభ ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కరుణాకర్ కోరారు. తనను సస్పెన్షన్ చేసినట్టు బులెటిన్ చూపిస్తే బయటకు వెళతానని జగదీశ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను అసెంబ్లీకి రావడంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. సాయంత్రం మూడు గంటలకు బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలోనే జగదీశ్‌రెడ్డి గడిపారు.
అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోంది: రాజ్యాంగ విలువ లు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని జగదీశ్‌రెడ్డి అ న్నారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను అసెంబ్లీ సమావేశాల నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణాలు, ఆ ధారాలు చూపడం లేదు. మందబలంతో సభ నడుపుతామంటే కుదరదు.
కోర్టు కు వెళతాననే భయంతోనే నా సస్పెన్షన్‌కు సంబంధించిన బులెటిన్ విడుదల చేయడం లేదు. సభ్యులు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఏకంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మంత్రులు గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు. జాన్‌పాడ్‌లో జరిగిన దావత్‌కు కూడా మాజీమంత్రి జానారెడ్డి హెలికాప్టర్‌లో వచ్చారు’అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం..అయోమయం: బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని..అసలు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికే స్పష్టత లేక అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. అసలు రాష్ట్రం మొత్తం అప్పులెన్ని.. వాటిపై చెల్లిస్తున్న వడ్డీ ఎంత.. కొత్తగా తెస్తున్న అప్పు ఎంత ? లాంటి వివరాలేవీ తెలపటం లేదని విమర్శించారు.