EOPRD
-
మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసి బూ తులు తిట్టే ఈ నాయకుడి వైఖరి మరోసారి బట్టబయలైంది. ఓడిపోయానన్న బాధ ఇంకా పోలేదో.. అధికారంలో లేనన్న సంగతి గుర్తు లేదో గానీ ప్రభుత్వ అధికారిపై మరోసారి నోరుజారారు. రాయ లేని భాషలో బెదిరింపులకు దిగారు. ఆ మధ్య ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ జే ఈని బెదిరించగా, తాజాగా సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్డీకి ఫోన్ చేసి బూతులు తిట్టిన వైనం ఆదివారం బయటపడింది. ఇన్చార్జి ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడుతో కూన రవికుమార్ జరిపిన ఫోన్ సంభాషణ ఇది.. కూన రవి: హలో ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడు : సార్ నమస్తే సార్ కూన రవి: ఆ.. నమస్తే.. ఏమయ్యా నీవు బాగా పెద్దోడివయ్యినట్లు ఉన్నావ్ ఈఓపీఆర్డీ: లేదు.. లేదు సార్ కూన రవి: నీకు ఎంత ఒల్లు బలిసిందంటే నా కొడకా... నా నంబర్‌తో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవా ఈఓపీఆర్డీ: వీసీలో ఉన్నాను సార్.. ఫోన్లు తీయలేదు కూన రవి: ఆ తర్వాత ఏం చేశావ్...... ఈఓపీఆర్డీ: ఆ తర్వాత చూడలేదు సార్ కూన రవి: చూడకపోతే ఫోన్ చేయవా ఈఓపీఆర్డీ : ఫోన్ పక్కన పెట్టేసి మర్చిపోయా సార్.. కూన రవి: ఒరే నా కొడకా హస్కీలో ఉన్నా నిన్ను భూమిలోంచి తీసి నిన్ను పాతీకిపోతాను నా కొడకా... నీవు హస్కీలో ఉండు నా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమార్‌నే కాదు నా కొడకా.. నీ బతుకెంతరా నా కొడకా ఈఓపీఆర్డీ: విషయం.. విషయం ఏమిటి చెప్పండి సార్.. కూన రవి : దొంగనా కొడకా.. నీకు విషయం చెప్పాల్రా నేను ఈఓపీఆర్డీ : ఏమిటి చెప్పండి సార్ కూన రవి : దొంగనా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే.. నీవు ఈఓఆర్డీగా వచ్చావురా.. నీ ఉద్యోగం ఏమిటి అక్కడ? ఈఓపీఆర్డీ: ఈఓపీఆర్డీ చెప్పండి కూన రవి : ఆ... ఈఓఆర్డీ నీకెంత ధైర్యంరా మరల అక్కడకే వచ్చినావు ఈఓపీఆర్డీ : రాలేదు సార్ నేను ఎఫ్ఏసీ కూన రవి : ఏటి ఎఫ్ఏసీ నీకెవడురా ఇచ్చారు అక్కడ. జూనియర్ అసిస్టెంట్‌కు ఎఫ్ఏసీరా నీకు ఈఓపీఆర్డీ : సీనియర్ అసిస్టెంట్‌ని సార్ కూన రవి : రావివలస పంచాయతీ డబ్బులు ఆ రాయుడుకు ఎందుకురా ఇవ్వలేదు. ఈఓపీఆర్డీ : రావివలసది 30వేలు ఉంది సార్ అక్కడ. కూన రవి : రూ.30వేలు ఉంటే తీసి ఇవ్వలేవా ఈఓపీఆర్డీ : రూ.30వేలు అంటే రూ.70వేలు ఆయనది. కూన రవి : ఆ.. ఈఓపీఆర్డీ : రూ.20వేలు కొడుతుంటే ఆన్లైన్లో రిజెక్టెడ్ అని వస్తుంది సార్ అక్కడ కూన రవి : ఏంటి రిజెక్ట్ అని వస్తుంది ఈఓపీఆర్డీ : ఆ అమౌంట్ సరైన అమౌంట్ లేదని రిజెక్ట్ వస్తుంది, అది పెట్టమంటే మీకు రేపు పెడతా. కూన రవి : రేపు ఇమ్మీడియట్‌గా పెట్టు లేదా రూ.10లేదా రూ.15వేలు కొట్టు ఈఓపీఆర్డీ : పెడతా సార్ వాట్సాప్‌లో పెడతా సార్ కూన రవి : వాట్సాప్‌లో పెట్టు. ఈసారి లగాయత్తు.. న నంబర్ గానీ ఎత్తకపోయావో వైజాగ్‌లో ఉన్నా నీ ఇంటికి వచ్చి ఎత్తుకుపోతా నా కొడకా.. అంటూ ఫోన్ పెట్టేశారు. ఇలా సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా ఉన్న గూనపు వెంకట అప్పలనాయుడుపై బండ బూతులు తిట్టి విరుచుకుపడ్డారు. కూన రవికుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగారు. ‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. అలాగే, బూర్జలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ ని కూడా నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఇక పంచాయతీ కార్యదర్శులకైతే లెక్క లేదు. చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చొన్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే సరుబుజ్జిలి ఎంపీడీఓ, గత ఈఓపీఆర్డీని బెదిరించిన కేసులో బెయిల్‌పై ఉన్నారు. బయటికొచ్చినవి కొన్నే. కానీ నియోజకవర్గంలో ఆయన ఆగడాలు ఇంతా అంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని పురుగుల్లా చూస్తున్నారని నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఎన్నో ఉన్నాయి. కూనతో ప్రాణహాని ఉంది.. మాజీ విప్ కూన రవికుమార్ బెదిరింపులు తట్టుకోలేకపోతున్నాం. ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ప్రజాస్వామ్యంగా పనులు చేసుకోవాలే తప్ప. ఇలా బెదిరిస్తూ, తిడుతూ పనులు చేయించాలనుకోవడం సరికాదు. గతంలో కూడా నాతో దురుసుగా మాట్లాడారు. ఆయనకిది అలవాటైపోయింది. ఇలాగైతే పనిచేయలేం. తరుచూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. గతంలో కూడా వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. ప్రస్తుతం నేను వైజాగ్‌లో ఉన్నా తంతాను అని బెదిరించారు. నాకు ప్రాణహాని ఉంది. దీనిపై ఆమదాలవలస సీఐ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశాను. – గూనపు వెంకట పెద అప్పలనాయుడు -
శతశాతం ఎలక్ట్రికల్ సర్వే నిర్వహించాలి
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శతశాతం ఎలక్ట్రికల్ సర్వే చేయాలని డీపీఓ బలిబాడ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోనూ ఎన్ని విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు ఉన్నాయో సర్వే చేపట్టాలన్నారు. ఎన్నింటికి డబ్బులు చెల్లించారు..? అధనంగా ఎన్నింటికి చెల్లించి ఉన్నారన్న విషయాలను సర్వే చేసి అప్లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీ సమాచారాన్ని ఎంత మేరకు సేకరించారన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడి ఉన్న మెంటాడ, ఇతర మండలాధికారులను మందలించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై వారికి అవగాహన కల్పించారు. తాగునీటి పథకాలు విద్యుత్ లేని కారణంగా ఆగిపోరాదన్నారు. అలా జరిగితే సంబంధిత సర్పంచ్‌లు, కార్యదర్శులే బాధ్యులన్నారు. ఇంటి పన్నుల వసూళ్లను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో విజయనగరం డీఎల్పీఓ మోహనరావు, ఈఓపీఆర్ఆర్డీల సంఘం అధ్యక్షుడు ఐ.సురేష్, పర్యవేక్షకుడు కేఆర్ఎం పంతులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిపన్నురూ.5000= రసీదు రూ.4500
రైల్వేకోడూరు: పంచాయితీ కార్యదర్శి ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తోందని విద్యానగర్ వాసులు ఈఓపీఆర్డీ సంజీవరావుకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఈఓపీఆర్డీను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కె.బుడుగుంటపల్లె పంచాయితీ కార్యదర్శి లక్ష్మీదేవితో మరో వ్యక్తితో వచ్చి తమను బెదిరించి ఇంటి పన్నులు వేలలో కట్టమని డిమాండు చేస్తోందని ఆరోపించారు. రేకుల ఇంటికి కూడా వేలల్లో ఇంటి పన్ను కట్టమంటే ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిల్లర అంగడి ఉంటే దానికి ఇంటి పన్ను 5 వేలు అడుగుతోందని, ఇదేంటని అడిగితే అది అంతేనని కట్టక తప్పదని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బయపెడుతోందన్నారు. తీసుకున్న మొత్తంలో 5 వందలు తగ్గించుకుని బిల్లు ఇస్తోందని ఇదేంటని అడిగితే కంప్యూటర్ పనిచేయడం లేదని కుంటి సాకులు చెబుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. ప్రతి బిల్లుకు 4 నుంచి 5 వందలు ఎక్కువగా వసూలు చేసుకుని తక్కువ మొత్తానికి బిల్లు ఇస్తోందన్నారు. కార్యదర్శి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ఈఓపీఆర్డీను వివరణ కోరగా కె.బుడుగుంటపల్లె పంచాయితీలో మొత్తం 925 ఇండ్లు ఉన్నాయని, ఇంటి పన్ను వసూలు డిమాండు 1.70 లక్షలు ఉందన్నారు. సరాసరి ఒక ఇంటికి 185 రూపాయులు కడితే చాలన్నారు. షాపులు, ఇతర వాటికి 500 లైసెన్సు రుసుం చెల్లిస్తే సరిపోతుందన్నారు. అలా ఎందుకు వసూలు చేసిందో తమకు తెలియదన్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. గతంలో ఆమె పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదని, రాజంపేట డీఎల్పీఓ రమణ విచారణ చేపట్టిన విషయం తెలిసినదే. ఫిర్యాదు చేసిన వారిలో దామోదర్, ప్రకాష్, రత్న, కుమారి, నరసమ్మ, సుశీలమ్మ తదితరులు ఉన్నారు. -
ప్రధాని సందేశం వినేందుకు ఏర్పాట్లు చేయండి
డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీ, కార్యదర్శులకు డీపీఓ అరుణ ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జాతీ య పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ జాతికిచ్చే సందేశాన్ని వినేందుకు గ్రామ పంచాయతీల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను డీపీఓ అరుణ ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర, పంచాయతీ రాజ్ వ్యవస్థ తీరుతెన్నులు తదితర అంశాలపై ప్రధాని ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని వినేందుకు, చూసేందుకు ఆయా గ్రామ పంచాయతీల్లో టీవీలు, రేడియోలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ మేరకు తగు ప్రచారం కల్పించాలని ఆమె ఆయా డివిజన్ల డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీలకు ఆదేశాలు జారీ చేశారు. -
పింఛిన్ ఇయ్యిండ్రి.. బాంచెన్
* 30 ఏళ్ల కిందటి సర్టిఫికెట్లు ఎట్లా దేవాలి * వితంతు, ఒంటరి మహిళల ఆవేదన * అభాగ్యులను ఆదుకోవాలని ఆందోళన వెల్దుర్తి: ‘ఏండ్ల కిందట సచ్చిపోయినోళ్ల కాయిదాలు దెమ్మంటె యాడదెచ్చేది..? అవి లేకుంటె పింఛన్ కట్ జేస్తమని రాస్కపోనొచ్చిన సారు గట్టిగ బెదిరియ్యవట్టె. ఇగ మాకు పింఛిని రాకుంటె మా గతేమైతదో.. దండం బెడతాం బాంచెన్ పింఛిన్ ఇయ్యుండ్రి’’ అంటూ మండల పరిధిలోని మాసాయిపేటని పలువురు వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విధి వక్రీకరించి భర్తలను కోల్పోయిన తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, భర్తలను కోల్పోయిన తాము వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తమకు పెన్షన్ రావాలంటే తప్పకుండా మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకురాల్సిందేనని ఈఓపీఆర్డీ జైపాల్‌రెడ్డి హెచ్చరించారన్నారు. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వారి సర్టిఫికెట్లు ఎలా తెచ్చేదని ప్రశ్నించారు. మరికొంత మంది మహిళలు మాట్లాడుతూ.. తమ భర్తలు 20 ఏళ్ల క్రితమే తమను వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారి వివరాలు ఎలా తేవాలంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రమాదేవి గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. పలువురు మహిళలు కంటతడి పెడుతూ తమ గోడును తహశీల్దార్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ ఈఓపీఆర్డీకి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ ఈఓపీఆర్డీపై మెదక్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ.. వితంతు మహిళలకు స్థానిక పంచాయతీ కార్యదర్శి నుంచి సర్టిఫికెట్ అవసరమని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఈఓపీఆర్డీ విధులకు గైర్హాజరు కావడంతో తహశీల్దార్ రమాదేవి ఇంటింటి సర్వే చేపట్టారు. స్థానిక ఎంపీటీసీ సిద్దిరాములుగౌడ్, ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఈఓపీఆర్డీపై అసహనం వ్యక్తం చేశారు. -
నకిలీ.. సాల్వెన్సీ మకిలి
భీమవరం క్రైం, న్యూస్‌లైన్:‘నేరం చేసినవాడు ఏ రాష్ట్రం వాడైనా పరవాలేదు. వేరే దేశం వాడైనా సమస్య రాదు. వాళ్లకు ఆస్తిపాస్తులేమీ లేకపోయినా ఇబ్బంది లేదు. చిటికెలో సాల్వెన్సీలు సృష్టించేస్తాం. ఇట్టే బెయిల్ పుట్టించేస్తాం’ అంటూ కొందరు వ్య క్తులు నకిలీ సాల్వెన్సీల రాకెట్ నడుపుతున్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శుల అండదండలతో జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. డెల్టా ప్రాం తంలో వేళ్లూనుకుపోయిన ఇలాంటి వ్యవహారాలు ఇటీవల కొన్ని వెలుగులోకి వచ్చాయి. నకిలీ కరెన్సీ చలామణి వ్యవహారాల్లో అరెస్ట్ అయిన ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన ముఠాలను బెయిల్‌పై విడుదల చేయించేందుకు కొందరు వ్యక్తులు నకిలీ సాల్వెన్సీలను సమర్పించి కోర్టులను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ నిమిత్తం కొన్ని పంచాయతీలకు చెందిన అధికారుల పోర్జరీ సంతకాలతో కూడిన సాల్వెన్సీలను సమర్పించిన విషయం ఇటీవల కోర్టు జోక్యంతో వెలుగులోకి వచ్చింది. ఈవోపీఆర్డీ, ఆర్డీ సంతకాలను ఫోర్జ రీ చేసి వీరవాసరం మండలం బాలేపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి నకిలీ సాల్వెన్సీలను పుట్టించి భీమవరంలోని ఒక కోర్టుకు ఓ నిందితుడి బెయిల్ నిమిత్తం దరఖాస్తు చేసిన వైనం వెలుగుచూసింది. సమర్పించిన సాల్వెన్సీలు నకిలీవని భావించిన మేజిస్ట్రేట్ దీనిపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. నకిలీ వ్యవహారం నిగ్గు తేలడంతో వాటిని సృష్టించిన బాలేపల్లి పార్ట్‌టైం ఉద్యోగి చాబత్తుల రవికుమార్, మరొకరిని ఈనెల మొదటి వారంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదే తరహాలో మత్స్యపురిపాలెం పంచాయతీ నుంచి ఇచ్చిన మరొక సాల్వెన్సీ కూడా నకిలీదని తేలడంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న పంచాయతీ కాంట్రాక్ట్ కార్యదర్శిని భీమవరం టూటౌన్ పోలీసులు విచారిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయం నుంచి ఏదైనా అధికారిక వర్తమానం లేదా ప్రొసీడింగ్స్ విడుదలయ్యేప్పుడు సంబంధిత కార్యాలయ ప్రధానాధికారి సంతకంతోపాటు.. కౌంటర్ సిగ్నేచర్లు ఉంటాయి. ఇదంతా విధానపరంగా ఉంటుంది. అనంతరం ఆ ప్రతి దరఖాస్తుదారుకు ముట్టినట్టుగా సంబంధిత వ్యక్తితో సంతకం చేయించుకుని కాపీని విడుదల చేస్తారు. కానీ.. నకిలీ సాల్వెన్సీల విషయంలో అలాంటి తంతు ఏమీ జరగడంలేదు. ఈవోపీఆర్డీ, ఆర్డీల సంతకాలను ఫోర్జరీ చేసి సాల్వెన్సీలను విడుదల చేస్తున్నారు. కొందరు దళారులు ఎక్కడికక్కడ ఈ తరహా రాకెట్లు నడుపుతున్నారు. సాల్వెన్సీలు ఇచ్చే సందర్భంలో డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క దానికి రూ.50 వేల వరకు దళారులు ముట్టచెబుతున్నట్టు సమాచారం. వారి ఉచ్చులో పడుతున్న కొందరు కాం ట్రాక్ట్ కార్యదర్శులు వెనుకాముందు ఆలోచించకుండా పై అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ సాల్వెన్సీలను ఎడాపెడా ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికమయ్యూయని పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన పాలా రాఘవేంద్రరావు అనే వ్యక్తి జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశాడు. మత్స్యపురి గ్రామ పంచాయతీ నుంచి నకిలీ సాల్వెన్సీలు విడుదల అయ్యూయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.