పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు
Published Wed, Apr 12 2017 11:00 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
మెయిన్స్‌కు సెంటర్ల ఆప్షన్ మార్పునకు అవకాశం
అమరావతి: రాష్ట్రంలోని 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టు (ప్రిలిమ్స్) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్ధులకు హాల్‌టిక్కెట్ల జారీ ప్రక్రియను కమిషన్ చేపట్టింది. హాల్‌టిక్కెట్లు కమిషన్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు.
ఈరోజు ఉదయం 11 గంటల తరువాత నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ లేదా హెచ్‌టీటీపీ://ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్17.ఏపీపీఎస్‌సీ.జీఓవీ.ఐఎన్‌వెబ్ సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఇలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్ధులు తమ సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లా కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్టు రాసేలా ఆప్షన్లు ఇచ్చారు. తాము ఆ పరీక్ష రాసే జిల్లాల్లో స్థానికేతరులుగా మారిపోతామని, దీనివల్ల ఎంతో నష్టపోతామని ఆందోళన చెందారు.
తాము సొంతజిల్లాల్లో పరీక్ష రాసేందుకు వీలుగా ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీకి విన్నవించారు. వీరి అభ్యర్ధనలపై ఏపీపీఎస్సీ సానుకూలంగా స్పందించింది. స్క్రీనింగ్ టెస్టులో స్థానికత అన్నది పరీక్ష కేంద్రం ఆధారంగా నిర్ణయించేది కాదని ఏపీపీఎస్సీ మంగళవారం మరో ప్రకటనలో స్పష్టంచేసింది. మెయిన్స్‌లో మాత్రమే స్థానికత, ఇతర రిజర్వేషన్లు అమలు కానున్నందున ఆమేరకు మెయిన్స్‌కు పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీనుంచి 30వ తేదీ వరకు అభ్యర్ధులు తమ పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకోవచ్చని కమిషన్ వివరించింది. స్క్రీనింగ్ టెస్టు ఎక్కడ రాసినా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసుకున్న కేంద్రమున్న జిల్లా ప్రాతిపదికన మాత్రమే స్థానికత, స్థానికేతర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
Advertisement