బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ!
- అసలు విషయం తెలిసి పోలీసులకు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు
- బీమా సొమ్ము కోసం పథకం?
పాయకరావుపేట: తప్పుడు మరణ ధ్రువపత్రం జారీచేసిన పంచాయతీ కార్యదర్శి అసలు విషయం తెలియడంతో తిరిగి ఆ ధ్రువపత్రం ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం వెలుగుచూసింది. స్థానిక పాత హరిజనవాడకు చెందిన తన కుమారుడు బీజా జ్యోతిబాబు ఈ ఏడాది ఏప్రిల్14న చనిపోయాడని, డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ అదే నెల 17న అభిమన్యుడు అనే వ్యక్తి దరఖాస్తుచేశాడు. ఈ దరఖాస్తును పంచాయతీ ఎలక్ట్రీషియన్ శివలంక రాజు పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ పి.రత్నకుమార్‌స్వామికి అందజేశారు.
దీనిపై పంచాయతీ బిల్లు కలెక్టర్ బత్తిన గోవిందరావు విచారణ చేసి జూనియర్ అసిస్టెంట్‌కు రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏప్రిల్ 24న మరణ ధ్రువపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి ఉమ్మడి వెంకట్రావు మంజూరు చేశారు. అయితే బీజా జ్యోతిబాబు బతికే ఉన్న విషయం ఇటీవల బయటపడింది. దీంతో జూనియర్ అసిస్టెంట్ పి.రత్నకుమార్‌స్వామి నివేదిక మేరకు తాను ఈ మరణ ధ్రువపత్రం జారీచేశానని, తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుని మరణధ్రువపత్రం ఒరిజినల్‌ను తిరిగి ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పంచాయతీలో కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ఇన్యూరెన్స్ కంపెనీ నుంచి సొమ్ము కాజేసేందుకు అంతా కలిసి పథకం వేశారని తెలిసింది. దీనిపై ఎస్‌ఐ ఎస్.ప్రసాద్‌ను వివరణ కోరగా, ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయిలో విచారించిన తరువాత కేసు నమోదుచేస్తామన్నారు. ఇందుకు సంబంధించి బీజా జ్యోతిబాబు, అతని తండ్రి అభిమన్యుడును విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని, వారు ప్రస్తుతం అందుబాటులో లేరని తెలిపారు.