Payakaravupeta
-
గృహిణి ఆత్మహత్య
పాయకరావుపేట: పట్టణంలో కంటోన్మెట్‌లో కాకర సుమలత అలియాస్ పార్వతి(35) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమలత అలియాస్ పార్వతి భర్త సురేష్‌తో కలిసి గాజువాకలో నివాసం ఉండేది. సురేష్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో పాయకరావుపేటలో ఉంటున్న సుమలత తల్లి ఇంటికి వచ్చేశారు. ఐదు రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుని వేరే ఉంటున్నారు. గురువారం భర్త సురేష్ బయటకు వెళ్లిన తరువాత సుమలత ఉరివేసుకుని మృతిచెందినట్టు ఎస్ఐ చెప్పారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. -
నిబంధనలు బేఖతర్!
గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్సీ భవన నిర్మాణం అడ్డుకున్న జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ నక్కపల్లి (పాయకరావుపేట): పాయకరావుపేట మండల పరిషత్‌కు చెందిన స్థలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఎంఆర్సీ భవన నిర్మాణాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ నిలుపు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున భవన శ్లాబ్ వేసే ప్రయత్నాలను జెడ్పీటీసీ చిక్కాల రామారావు, ఎంపీపీ శివ అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని సోమవారం జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ అల్లాడ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ ఏకపక్షంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. బుధవారం ఉగాది సందర్భంగా అధికారులు ఎవరూ లేని సమయాన్ని చూసి శ్లాబ్ వేసేందుకు చేసిన ప్రయత్నాలను జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, ఎంపీ పీ శివకుమార్ అడ్డుకున్నారు. ఎంఆర్సీ భవనం నిర్మిస్తున్న స్థలం మండల పరిషత్‌కు చెందినదని, ఇక్కడ ఏదైనా భవనం నిర్మించాలంటే పాలకవర్గం అనుమతి తీసుకోవాల ని, ఎంఈవో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సర్వశిక్ష అభియాన్ వారు కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలన్నది పాలకవర్గ సభ్యుల డిమాండ్. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. బిల్లులు నిలుపు చేయాలని కోర్టును కోరడంతోపాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడం, చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే అనితపై ఫిర్యాదు
కోటవురట్ల: పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించారంటూ ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ స్థానిక పోలీసు స్టేషన్లో ఇన్చార్జ్ ఎస్ఐ గణపతిరావుకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అనితకు జాతీయ పతాకాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలియకపోవడం శోచనీయమన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రొటోకాల్ ప్రకారం జాతీయ జెండాను ఎంపీపీ ఎగురవేయాల్సి ఉండగా, రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్యే ఆవిష్కరించారని చెప్పారు. వందేమాతరం గీతాన్ని ఆలపించకుండానే హడావుడిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జనగనమణ ఆలపించకుండానే వెళ్లిపోయారన్నారు. ఎంతో పవిత్రంగా చేయవలసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయం చేసి అపవిత్రం చేశారని ఆవేదన చెందారు. జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, ఇదే అంశంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదు అందజేసిన వారిలో జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు అవుగడ్డి రాజకుమారి, సర్పంచ్‌లు శెట్టి వరహాలమ్మ తదితరులు ఉన్నారు. -
ప్రమాదంతో బయటపడిన పన్నాగం!
పాయకరావుపేట :రోడ్డు ప్రమాద కేసును పరిశీలిస్తున్న పోలీసులకు.. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర బయటపడింది. దీనికి సంబంధించి కోరంగి పోలీసులు మంగళవారం పాయక రావుపేటలో విచారణ జరిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడలో మునసబుగారి వీధికి చెందిన పెమ్మాడ ధనలక్ష్మి అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఉంది. పెమ్మాడ ధనలక్ష్మికి పెమ్మాడ వెంకటరమణ(వెంకట్), రమేష్, శివవరప్రసాద్ (రాజు)అనే ముగ్గురు కొడుకులున్నారు. తమ తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సూర్యనారాయణను మట్టు పెట్టేందుకు తమమేనత్త కొడుకు బొమ్మిటి వీరమణికంఠతో కలసి పథకం వేశారు. సూర్యనారాయణను చంపేసి పాయకరావుపేట తాండవ సుగర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్న తన మేనత్త రామలక్ష్మి ఇంటిలో పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాకినాడకు చెందిన శివ అనే కారుడ్రైవర్‌తో కలసి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా వాసంశెట్టి సూర్యనారాయణను ఈనెల 8న డ్రైవర్ శివ, పెమ్మాడ వెంకటరమణ కారులో యానాం తీసుకువెళ్లి పూటుగా తాగించారు. అతడితో పాటు డ్రైవర్ శివ పూటుగా తాగాడు. కారులో రాత్రి తిరుగు ప్రయాణమైన వారి కోసం తాళ్లరేవు మండలం లచ్చిపాలెం జాతీయ రహదారిపై పెమ్మాడ శివప్రసాద్, బొమ్మిటి వీరమణికంఠ బైక్‌పై వేచి ఉన్నారు. డ్రైవర్ శివ పూటు తాగి ఉండడంతో కారు అదుపు తప్పి వీరిద్దరినీ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పెమ్మాడ శివప్రసాద్, బొమ్మిటి వీరమణికంఠ దుర్మరణం చెందారు. దీనిపై అప్పుడు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో హత్య చేసేందుకు వేసిన పథకం అమలు చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. కాకినాడ రూర ల్ సీఐ పవన్ కిషోర్, కోరింగి ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తాండవ సుగర్స్‌లో రామలక్ష్మి ఉంటున్న క్వార్టర్స్‌ను తనిఖీ నిర్వహించారు. ఇంటిలో పెద్ద గొయ్యి తవ్వి ఉంది. హత్యచేసి, పూడ్చిపెట్టేందుకు వేసిన పథకంలో భాగంగా ఈ గొయ్యి తవ్వారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రామలక్ష్మి పరారీలో ఉంది. -
బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ!
- అసలు విషయం తెలిసి పోలీసులకు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు - బీమా సొమ్ము కోసం పథకం? పాయకరావుపేట: తప్పుడు మరణ ధ్రువపత్రం జారీచేసిన పంచాయతీ కార్యదర్శి అసలు విషయం తెలియడంతో తిరిగి ఆ ధ్రువపత్రం ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం వెలుగుచూసింది. స్థానిక పాత హరిజనవాడకు చెందిన తన కుమారుడు బీజా జ్యోతిబాబు ఈ ఏడాది ఏప్రిల్14న చనిపోయాడని, డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ అదే నెల 17న అభిమన్యుడు అనే వ్యక్తి దరఖాస్తుచేశాడు. ఈ దరఖాస్తును పంచాయతీ ఎలక్ట్రీషియన్ శివలంక రాజు పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ పి.రత్నకుమార్స్వామికి అందజేశారు. దీనిపై పంచాయతీ బిల్లు కలెక్టర్ బత్తిన గోవిందరావు విచారణ చేసి జూనియర్ అసిస్టెంట్‌కు రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏప్రిల్ 24న మరణ ధ్రువపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి ఉమ్మడి వెంకట్రావు మంజూరు చేశారు. అయితే బీజా జ్యోతిబాబు బతికే ఉన్న విషయం ఇటీవల బయటపడింది. దీంతో జూనియర్ అసిస్టెంట్ పి.రత్నకుమార్స్వామి నివేదిక మేరకు తాను ఈ మరణ ధ్రువపత్రం జారీచేశానని, తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుని మరణధ్రువపత్రం ఒరిజినల్‌ను తిరిగి ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీలో కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ఇన్యూరెన్స్ కంపెనీ నుంచి సొమ్ము కాజేసేందుకు అంతా కలిసి పథకం వేశారని తెలిసింది. దీనిపై ఎస్ఐ ఎస్.ప్రసాద్‌ను వివరణ కోరగా, ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయిలో విచారించిన తరువాత కేసు నమోదుచేస్తామన్నారు. ఇందుకు సంబంధించి బీజా జ్యోతిబాబు, అతని తండ్రి అభిమన్యుడును విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని, వారు ప్రస్తుతం అందుబాటులో లేరని తెలిపారు. -
ఏలేరుపై వార్!
=అనుమతి లేకుండా పనులు =విస్కోకు తెలియకుండా పైపులైను ఏర్పాటు =తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన జీవీఎంసీ నర్సీపట్నం, న్యూస్‌లైన్: తుని, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని తీరప్రాంత గ్రామాలకు నీటి తరలింపు వ్యవహారం కొలిక్కి రాలేదు. మొదట్లో తాండవ రైతులు వ్యతిరేకించగా, ప్రస్తుతం ఏలేరు నిర్వహణ చేపడుతున్న జీవీఎంసీ అడ్డుకుంటోంది. ప్రాజెక్టు ప్రారంభంలో తాండవనీటిని రెండు నియోజకవర్గాలకు పైపులైను ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులకు అప్పట్లో సీఎం కిరణ్ తునిలో శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించేందుకు పైపులు తరలిస్తుండగా తాండవ రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం పనులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అధికారులు తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తరలించాలని భావించి, ఏర్పాట్లు మొదలెట్టారుఏలేరు నీటిని తుని, పాయకరావుపేట గ్రామాలకు తరలించే ప్రతిపాదనను విశాఖ పరిశ్రమలు, తాగునీటి అవసరాల కమిటీ (విస్కో) నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీన్ని కాదని రెండు జిల్లాల నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే దిగువ పైపులైను పనులు చేపట్టగా, తాజాగా నియోజకవర్గంలోని గొలుగొండ పేట వద్ద కాలువను ఆనుకుని స్టోరేజీ ట్యాంకునకు నీటిని తరలించే పైపులను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికార యంత్రాంగం ఇటీవల పరిశీలించి పైపులైనుకు అడ్డంగా గోడ నిర్మాణం చేసి పూడ్చివేశారు. వారం రోజుల్లో ఈ పైపులైనును పూర్తిగా తొలగించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు నియోజకవర్గాలకు తాగునీటి పంపిణీపై ఒక్కో అధికారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఈ పథకాలకు అవసరమైన తాగునీటి కోసం ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం ఆమోదించిందీ లేనిదీ తమకు ఇంకా తెలి యదని తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులుంటున్నా రు. నీటి తరలింపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అం దువల్లే పైపులైను పనులు ప్రారంభించామని తాగునీటి ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఏలేరు నీరివ్వని పక్షంలో తమ ప్రాంతం గుండా వెళ్లే కాలువను అడ్డుకుని ఆందోళన చేసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
లెవీ తంతు
=9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు =ఏఓ, ఏఏఓల నియామకానికి జేడీకి లేఖ =96,697 హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు =వరదలు కారణంగా 16 వేల హెక్టార్లలో నష్టం =దిగుబడిపై రైతుల ఆందోళన రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని లెవీ సేకరణ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతోంది.. ఖరీఫ్ వరి కొనుగోలుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ధాన్యం నాణ్యత విషయంలో కొనుగోలు అధికారులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఏటా లెవీ సేకరణ నిరాశాజనకంగా సాగుతోంది. తేమ శాతం ఎక్కువన్న కారణంపై అనేక సందర్భాల్లో అధికారులు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తూ ఉండడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని కర్షకులు నిరాశ పడుతున్నారు. అందుకే ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మళ్లీ లేవీ సేకరణకు పౌర సరఫరా అధికారులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ వరి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధాన్యం నాణ్యతను అంచనా వేయడానికి, కొనుగోలుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడానికి టెక్నికల్ సిబ్బందిని నియమించనున్నారు. పదేళ్లుగా జిల్లాలో లెవీ సేకరణ నామమాత్రంగానే సాగుతోంది. ప్రతీ సీజన్లోనూ వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు రైతులను తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. దాంతో ధాన్యం కొనుగోలుకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నా యి. తేమ సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తూ ఉండడంతో సమస్య వస్తోంది. నాణ్యత పేరుతో అసలు కొనుగోలుకే విముఖత చూపిస్తుండడంతో జిల్లాలో పెద్దగా లెవీ సేకరణ జరగడం లేదు. 9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవీ సేకరణకు సంబంధించి జిల్లాకు ఎటువంటి లక్ష్యం లేదు. అయినా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనువుగా జిల్లాలో 9 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట, చింతపల్లి, పాడేరు, అరకు మండలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ తొమ్మిది కేంద్రాల్లో 9 మంది వంతున వ్యవసాయాధికారులను, 9 మంది సహాయ వ్యవసాయాధికారులను నియమించాలని పౌర సరఫరా అధికారులు వ్యవసాయ శాఖకు లేఖ రాశారు. వీరికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు. నామమాత్రంగా కొనుగోలు: ప్రభుత్వ నిబంధనల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు రైతులు ముందుకు రావడం లేదు. తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధరకు అడుగుతున్నారు. నాణ్యత లేదని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. అందుకే వారు ధాన్యాన్ని మిల్లర్లకు నేరుగా విక్రయిస్తున్నారు. గత ఏడాది ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. గత పదేళ్లలో 2010 సంవత్సరంలో మాత్రమే అత్యధికంగా 200 టన్నులను ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా మరో నెల రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా రైతులు ఈ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పంట నష్టపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉన్న రైతులు మిల్లర్లను ఆశ్రయించే అవకాశమే అధికంగా కనిపిస్తోంది. -
10 నియోజక వర్గాల్లో షర్మిల బస్సు యాత్ర
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనుంది. తూర్పు గోదావరి జిల్లా తుని మీదుగా సాయంత్రం 4 గంటలకు పాయకరావుపేటకు చేరుకుని అక్కడే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. సమైక్యాంధ్రకు జై కొడుతూ షర్మిలకు జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ,పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు,నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావులతో పాటు పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాయకరావుపేట సభ ముగిశాక రాత్రికి నక్కపల్లి సమీపంలో బస చేసి షర్మిల ఆదివారం ఉదయం అక్కడి నుంచి బయల్దేరి విశాఖ నగరానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జగదాంబ సెంటర్లో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం జిల్లా యాత్రకు బయల్దేరతారు. పాయకరావుపేటలో జిల్లాలోకి ప్రవేశించే షర్మిల బస్సు యాత్ర యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక, విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణ, తూర్పు , భీమిలి నియోజక వర్గాల మీదుగా విజయనగరం జిల్లాలోకి వెళుతుంది. చురుగ్గా ఏర్పాట్లు పాయకరావుపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సమైక్యశంఖారావానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి బస్సు యాత్ర తాండవ బ్రిడ్జి ప్రాంతం నుంచి ఎల్టి కాలనీ, నాగరాజుపేట రైల్వేగేటు, గౌతమ్ సెంటరు మీదుగా చిత్ర మందిర్ సెంటరు వద్ద జరిగే బహిరంగసభ ప్రాంతానికి చేరుకుంటుంది. షర్మిలకు స్వాగతం పలుకుతూ అంతటా భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు, జగన్మోహన్రెడ్డి, షర్మిల ప్లెక్సీలు పెట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. దీనికి షర్మిల పూలమాల వేస్తారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చిత్ర మందిర్ సెంటరులో జరిగే బహిరంగసభలో బస్సు పైనుంచే షర్మిల ప్రసంగిస్తారు. అటు గౌతమ్ సెంటరు, ఇటు పంచాయతీ కార్యాలయం వైపు వేలాది మందికి షర్మిల కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు . యాత్ర విజయవంతం కావాలి: కొణతాల షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో బస్సు యాత్రకు సంబంధించి రూట్‌తోపాటు,బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. రోడ్డు కిరువైపులా బారికేడ్లు,స్వాగత ద్వారాలు ఏర్పాటు,బహిరంగ సభ నిర్వహణపై నాయుకులకు సూచనలిచ్చారు. అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్రకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. రాజకీయలకు అతీతంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, నియోజక వర్గ సమన్వయకర్తలు చెంగల వెంకట్రావు, గండి బాబ్జీ,బొడ్డేడప్రసాద్, పార్టీ నాయుకులు వీసం రామకృష్ణ, ధనిశెట్టి బాబూరావు,చిక్కాల రామారావు,జానకి శ్రీను, బొలిశెట్టి గోవిందు, ఆడారి ప్రసాద్, కోడా కోటేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, ఆడారి నూకరాజు, దేవవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
తాండవ నీరు విడుదల
నాతవరం, న్యూస్‌లైన్ : తాండవ రిజర్వాయర్ నీటిని ఆయకట్టు భూములకు ఆదివారం ఉదయం 11.15 గంటలకు విడుదల చేశారు. తొలుత జలాశయం దిగువన ఉన్న వినాయక ఆలయంలో,మెయిన్ గేట్లు వద్ద డీఈ ఎం.షన్ముఖరావు, ఏఈ చిన్నంనాయుడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని కాలువ ద్వారా విడుదల చేశారు. రోజూ కుడి,ఎడమ కాలువల ద్వారా 600 క్యూసెక్కులు పొలాలకు చేరుతుంది. తాండవనది ద్వారా పాయకరావుపేట మండలం శివారు భూములకు 35 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారు. ఇలా అయితే జలాశయంలోని 29,900 క్యూసెక్కుల నీరు సుమారు 50 రోజులకు సరిపోతుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 371.1అడుగుల నీరుంది. గతేడాది ఇదే సమయానికి నీటిమట్టం 351అడుగులు ఉంది. వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్ పరిధిలో నారుమళ్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. నీటిని వెంటనే విడుదల చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ పెరి గింది. వాస్తవంగా ఏటా ఆగస్టు రెండు లేదా మూడో వారంలో నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా డీఈ షన్ముఖరావు మాట్లాడుతూ నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు,రౌతులపూడి మండలాల పరిధిలో సాగు భూములకు నీరు సరఫరా అవుతుందన్నారు. మధ్యలో వర్షాలు కురిస్తే ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో నీరందించడానికి అవకాశం ఉంటుందన్నారు. శివారు భూములకు సజావుగా నీరందడానికి కాలువల మధ్యలో ఎలాంటి మట్టిదిబ్బలు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నామన్నారు. నీరు వృథా కాకుండా ర్రాతిపగలు తేడా లేకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండవ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు సిద్ధాబత్తుల వెంకటరమణ, మాజీ సర్పంచ్ కామిరెడ్డి కిత్తయ్యనాయుడు, కాంగ్రెస్ నాయకులు గంటా శ్రీనివాసరావు, మైనం సూర్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి షేక్జ్రాక్, వర్క్ఇన్స్పెక్టర్ అప్పారావు పాల్గొన్నారు.