నాతవరం, న్యూస్‌లైన్ : తాండవ రిజర్వాయర్ నీటిని ఆయకట్టు భూములకు ఆదివారం ఉదయం 11.15 గంటలకు విడుదల చేశారు. తొలుత జలాశయం దిగువన ఉన్న వినాయక ఆలయంలో,మెయిన్ గేట్లు వద్ద డీఈ ఎం.షన్ముఖరావు, ఏఈ చిన్నంనాయుడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని కాలువ ద్వారా విడుదల చేశారు. రోజూ కుడి,ఎడమ కాలువల ద్వారా 600 క్యూసెక్కులు పొలాలకు చేరుతుంది. తాండవనది ద్వారా పాయకరావుపేట మండలం శివారు భూములకు 35 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారు. ఇలా అయితే జలాశయంలోని 29,900 క్యూసెక్కుల నీరు సుమారు 50 రోజులకు సరిపోతుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 371.1అడుగుల నీరుంది.
గతేడాది ఇదే సమయానికి నీటిమట్టం 351అడుగులు ఉంది. వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్ పరిధిలో నారుమళ్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. నీటిని వెంటనే విడుదల చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ పెరి గింది. వాస్తవంగా ఏటా ఆగస్టు రెండు లేదా మూడో వారంలో నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా డీఈ షన్ముఖరావు మాట్లాడుతూ నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు,రౌతులపూడి మండలాల పరిధిలో సాగు భూములకు నీరు సరఫరా అవుతుందన్నారు. మధ్యలో వర్షాలు కురిస్తే ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో నీరందించడానికి అవకాశం ఉంటుందన్నారు.
శివారు భూములకు సజావుగా నీరందడానికి కాలువల మధ్యలో ఎలాంటి మట్టిదిబ్బలు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నామన్నారు. నీరు వృథా కాకుండా ర్రాతిపగలు తేడా లేకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండవ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు సిద్ధాబత్తుల వెంకటరమణ, మాజీ సర్పంచ్ కామిరెడ్డి కిత్తయ్యనాయుడు, కాంగ్రెస్ నాయకులు గంటా శ్రీనివాసరావు, మైనం సూర్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి షేక్జ్రాక్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ అప్పారావు పాల్గొన్నారు.
తాండవ నీరు విడుదల
Published Mon, Aug 5 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM