Tandava Reservoir
-
మాట తప్పని ఆ మహానుభావుడికి సెల్యూట్: ఆర్ నారాయణ మూర్తి
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు సెల్యూట్' అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. చదవండి: (చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్) -
ఆనంద ‘తాండవం’
సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్ కాలువ, తాండవ జలాశయం కాలువలను అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుసంధానంతో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు తాండవ జలాశయం కింద 51,465 ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించింది. రూ.470.05 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో గొలుగొండ మండలం జీకే గూడెం వద్ద తాండవనదిపై 4.96 టీఎంసీల సామర్థ్యంతో 1965లో జలాశయం నిర్మాణం చేపట్టి 1975 నాటికి పూర్తిచేశారు. తాండవలో నీటి లభ్యత ఆధారంగా ఈ జలాశయం ఒక సీజన్లో ఒకటిన్నరసార్లు నిండుతుందని అంచనా వేసిన జలవనరులశాఖ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ(ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు) వ్యవస్థను ఏర్పాటు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదిలో నీటి లభ్యత తగ్గడంతో ఈ జలాశయం కింద ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. తాండవ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపి.. ఆయకట్టును స్థిరీకరించి తమను ఆదుకోవాలన్న ఆ ప్రాంత రైతుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. తాండవ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ఏలేరు కాలువ పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించాలని జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి జలాలతో సస్యశ్యామలం ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 24.1 టీఎంసీలు. ఏలేరు పరీవాహక ప్రాంతంలో 17.92 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఎడమ కాలువ కింద 1.14 లక్షల ఎకరాలు, కుడి కాలువ కింద పదివేల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టును రూపొందించారు. పోలవరం ఎడమ కాలువ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల నీటి లభ్యత సమస్య ఉండదు. ఏలేరు ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందిస్తూనే.. తాండవ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేయవచ్చన్న జలవనరులశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఏలేరు, తాండవ ఆయకట్టుకు భరోసా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశాఖ నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు ఏలేరు ఎడమ కాలువ ద్వారా రోజుకు 175 క్యూసెక్కుల చొప్పున నీరు సరఫరా చేయాలని ఏలేరు ప్రాజెక్టు నివేదికలోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఏలేరు ప్రాజెక్టు పూర్తయినా ఇప్పటికీ పూర్తి ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాల్లేవు. దీనికి ప్రధాన కారణం ఎడమ కాలువ పనుల్లో లోపాలే. ఏలేరు రిజర్వాయర్ వద్ద ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం వెయ్యి క్యూసెక్కులు, చివరకు వచ్చేసరికి 220 క్యూసెక్కులు ఉండేలా పనులు చేపట్టారు. కానీ.. కాలువను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల 450 క్యూసెక్కులకు మించి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎడమ కాలువను వెడల్పు చేయడం, లైనింగ్ చేయడం ద్వారా 1,250 క్యూసెక్కులకు పెంచవచ్చని, తద్వారా ఎడమ కాలువ కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లందిస్తూనే కొత్తగా 5,600 ఎకరాలకు నీళ్లందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏలేరు ఎడమ కాలువ నుంచి రోజుకు 250 క్యూసెక్కుల చొప్పున తాండవ కాలువలోకి ఎత్తిపోసి, ఆ ప్రాజెక్టు కింద 51,465 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి చర్యలు చేపట్టింది. బాబు నిర్లక్ష్యం.. జగన్‌తో సాకారం సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చంద్రబాబు హయాంలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో నిర్లక్ష్యానికి గురైన రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి రూ.470 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెప్పారు. ఆయన శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. ఏలేరు–తాండవ లింక్ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, విశాఖ జిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా, పీఏసీ చైర్మన్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడు 40 ఏళ్ల రాజకీయాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్లకు మించి సాధించలేకపోయారని విమర్శించారు. -
ఇసుక దందా.. కనిపించదా!
• తాండవ గర్భంలో జేసీబీలతో తవ్వకాలు • విలువ రూ.6 కోట్లకు పైమాటే • జలాశయానికి పొంచి ఉన్న ముప్పు • పట్టించుకోని అధికారులు గొలుగొండ(నర్సీపట్నం): తాండవ జలాశయం జిల్లాలో పెద్దది..ఈ జలాశయం ద్వారా రెండు జిల్లాలకు సుమారుగా 55 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. అలాంటి జలాశయానికి ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉంది. గతంలో నీలం తుపాను వల్ల బొడ్డేరు గెడ్డ ప్రవాహా నికి జలాశయానికి కిలోమీటరు దూరంలో సుమారు 50 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుక మేటలు తరలించేం దుకు గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది ఇసుక అక్రమ వ్యాపారులకు కలిసొచ్చింది. యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదా యానికి కోట్లాది రూపాయల గండి పడుతోం ది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. గత ఏడాది అంచనా నీలం తుపాను సందర్భంగా జలాశయాం గర్భంలోకి చేరిన ఇసుక మేటలు తొలగించేందుకు అధికారులు అంచనా వేశారు. కాంట్రాక్టర్లు గాదపాలెం నుంచి నర్సీపట్నం, విశాఖపట్నం తరలించేందుకు ప్రయత్నించారు. కానీ వేలం నిర్వహించే సమయంలో ఏకధాటిగా వర్షాలు కురిసాయి. ఫలితంగా వేలంపాట నిలిచిపోయింది. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఇసుక తరలింపుపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఇసుక తరలింపు నిలిచిపోయింది. యథేచ్ఛగా తరలింపు గతంలో నిలిచిన టెండర్ల ప్రక్రియ అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని అదునుగా చేసుకున్నారు. ప్రస్తుతం జలాశయం గర్భంలో నీరు లేకపోవడంతో ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది. చోద్యం, గాదంపాలెం, ఎ.ఎల్.పురం, కేడిపేట, జోగుంపేట, నర్సీపట్నం, కొత్తమల్లంపేట, చిన్నయ్యపాలెంకు చెందిన వందలాది ట్రాక్టర్లతో రోజూ ఇసుకను తరలిస్తున్నారు. కూలీల ద్వారా అయితే పనులు ఆలస్యంగా జరుగుతాయనే ఉద్దేశంతో జేసీబీతో నాలుగురోజులుగా పగలు, రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇంత జరగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ జలాశయం గర్భం నుంచి రోజూ వందలాది ట్రాక్టర్ల నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్క ఇసుక ట్రాక్టర్‌ను కూడా అధికారులు పట్టుకున్న దాఖలాలు లేవంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న వ్యాపారులతో అధికారులకు కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాండవ జలాశయానికి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపు అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందారని వైఎస్సార్సీసీకి చెందని చోద్యం ఎంపీటీసీ సభ్యుడు నాతిరెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక తరలింపు సమయంలో గాదంపాలెంకు చెందని ఓ వ్యక్తి ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నాడని, ఇలా రోజుకు రూ.50వేల వరకు ఆదాయం పొందుతు న్నాడని స్థానికులు చెబుతున్నారు. జలాశయానికి ముప్పే ఇసుక నిల్వలు లేకపోతే వరదలు వస్తే బొడ్డేరు గెడ్డ నీటి ఉధృతికి కిలోమీటరు దూరంలో ఉన్న తాండవ జలాశయానికి ప్రమాదం పొంచి ఉందని మేధావులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే జలాశయానికి ఊహించని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మేటలు ఉండడంతో నీటి ఉధృతిని అడ్డుకుంటాయని, ఫలితంగా రిజర్వాయర్‌కు నష్టం జరగదంటున్నారు. దీంతో పాటు ఇసుక తవ్వకాల వల్ల సమీప గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతాయని చెబుతున్నారు. -
అన్నదాత.. విజేత
ఆగిన నీటి తరలింపు నిర్ణయం రైతులు, వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితం ఇది తాండవ రైతుల విజయం.. వైఎస్సార్ సీపీ నేత ఉమాశంకర్ గణేశ్ రిలే దీక్షల నిర్ణయం విరమణ నాతవరం: తాండవ రిజర్వాయర్ నీటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ మేరకు తాండవ నీటిని ఏలేరు కాలువలోకి తరలించడానికి లక్ష్మీపురం వద్ద తీసిన కాలువలను అధికారులు తిరిగి కప్పేశారు. కాలువలు కప్పేసిన ప్రాంతాన్ని ైవైఎస్సార్సీపీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేశ్, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జెమీలు, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, నీటి తరలింపుకోసం తీసిన కాలువలు తిరిగి కప్పేశారంటే ప్రభుత్వం నీటి తరలింపును విరమించుకున్నట్టేనని.. ఇది తాండవ రైతుల విజయమని చెప్పారు. ఈ సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల రైతులు వైఎస్సార్సీపీ నాయకుల వద్దకు వచ్చి కృతజ‘తలు తెలిపారు. మొదట్లో అధికారుల హడావుడి చూసి ప్రభుత్వం తాండవ నీటిని విశాఖకు తరలించుకుపోతుందని ఆందోళన చెందామన్నారు. కేవలం వైఎస్సార్సీపీ రైతులు పక్షాన నిలిచిపోరాటం చేయడం వల్లే నీటి తరలింపును విరమించుకున్నారన్నారు. అనంతరం గణేశ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తాండవ నీటిని విశాఖకు తరలిస్తామని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు ఈనెల 12న విశాఖలో ప్రకటన చేసిన మరునాడే ఈ ప్రాంతాన్ని పరీశీలించి ఒక చుక్క తాండవ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించినా అడ్డుకుంటామని హెచ్చరించామని గుర్తుచేశారు. త ర్వాత రైతులతో కలిసి ఈనెల 13 నుంచి వివిధ రకాల ఆందోళనలు చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చామన్నారు. తాండవ నీరు రానున్న కాలంలో రైతుల సాగుకు తప్ప ఏ ఇతర అవసరాలకు తరలించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయరాదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే స్వప్రయోజనాలు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. జెమీలు మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసే తాండవ నీటి తరలింపు ఆలోచన జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరమే ఇక్కడి అధికారులు కాలువ పనులు చేపట్టారని, ఇలాంటి నీచ రాజకీయాలు మంచిదికాదని సూచించారు. రిలే నిరాహార దీక్షలు విర మణ తాండవ నీటి తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23 నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులతో కలిసి చేయ తలపెట్టిన రిలే నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్టు గణేశ్ తెలిపారు. ఇక్కడ తీసిన కాలువలు మూసేయడంతో తాండవ నీటి తరలింపును ప్రభుత్వం విరమించుకున్నట్టేనన్నారు. వైఎస్సార్సీపీ 10 రోజులుగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచిన రైతులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు పైల సునీల్, చిటికిల వెంకటరమణ, శెట్టి నూకరాజు, పైత పోతురాజు, నర్సీపట్నం మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్ లాలం లోవ తదితరులు పాల్గొన్నారు. తరలింపు ఆగినట్టే.. డీఈ ఈ విషయంపై తాండవ జలాశయం డీఈ చిన్నంనాయుడును ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా నీటి తరలింపు ఆగినట్టేనని స్పష్టంచేశారు. రైతుల ఆందోళన, నీరు ఇవ్వరాదని తాండవ జలాశయం కమిటీ సభ్యుల తీర్మానం నివేదికను జిల్లా కలెక్టర్, ఇరిగే షన్ ఎస్ఈకి నివేదించామన్నారు. తాండవ నీరు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలులేదంటా రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు కూడా స్వయంగా చెప్పారని తె లిపారు. కాగా, తాండవ నీటి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆందోళన తీవ్రతరం చేయడం, నిరశన దీక్షలకు పూనుకోవడంతో ప్రభుత్వం దిగివచ్చిందని తెలిసింది. -
ఇ(సు)క ‘ఫ్రీ’గా దోపిడీ
ఇసుకతో పచ్చనేతలకు కాసుల పంటే ఉచితం పేరిట‘దేశం’ నేతల దందా దళారులకు మేలు..పేదలకు మోత.. రవాణా, లోడింగ్, అన్లోడింగ్ పేరుతో లూటీ నిన్నటి వరకు డ్వాక్రా మాటున దోపిడీ... ఇక ఉచితం పేరుతో లూటీ.. నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ఇసుకను నిరుపేదలు..ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వ నున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అడుగడుగునా ఆంక్షలు ఉన్నప్పుడే అడ్డగోలుగా నదులు..వాగులు..వంకల్లోని ఇసుకను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఆయుధంలా మారిన ‘ఉచితం’ను అడ్డంపెట్టుకుని పేదల మాటున నదీ గర్భాలను సైతం అడ్డూ..అదుపు లేకుండా తూట్లు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం: జిల్లాలో ఇసుక విషయమై మైనింగ్‌శాఖ జనవరిలో ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. నారాయణరాజుపేట రీచ్‌లో 10 వేలు, కాశీపట్నం రీచ్‌లో 15వేలు, కైలాసపట్నం రీచ్‌లో 14వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు నిర్ధారించింది. తాండవ రిజర్వాయర్‌లో పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక 62,470 క్యూబిక్‌మీటర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇలా మొత్తంమ్మీద జిల్లాలో ప్రస్తుత సీజన్లో రూ.లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులోఉంది. గతంలో ఇలాగే నోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 3.5లక్షల క్యూ.మీ.ఇసుక ఉన్నట్టు లెక్క తేలిస్తే ఏకంగా ఐదున్నర లక్షల క్యూ.మీ.లకు పైగా ఇసుకను తవ్వేశారు. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. తాజాగా లక్ష క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉందంటే ఇక ఏ స్థాయిలో తవ్వకాలు జరుపుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా జిల్లాలో గోస్తని, వరహా, శారదా నదుల రూపురేఖలే మారిపోయాయి. ఇక వాగులు..వంకలైతే ఇసుకతవ్వకాల వల్ల దిశ మారిపోయి వంకరటింకరగా ప్రవిహ స్తున్నాయి. దళారీలను ఆశ్రయించాల్సిందే.. సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం పేదలు, ప్రభుత్వాసవసరాలకు కాంట్రాక్టర్లు, అధికారులు నేరుగా ఇసుక తవ్వే అవకాశం ఉండదు. వీరంతా ఎప్పటిలాగే వ్యాపారులపైనే ఆధారపడాలి. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ రూ.550 కాగా రవాణా, లోడింగ్ అన్లోడింగ్ కలిపి యూనిట్ (3 క్యూ.మీ.) ఇసుకను ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1700లు చెల్లించాల్సి ఉంది. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని యూనిట్ ఇసుకను రూ.2,500నుంచిరూ.3వేల వరకువిక్రయిస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నప్పటికీ లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీలను భరించాల్సిందే. ప్రస్తుతం జిల్లాలో నిర్మాణానికి అనువైన ఇసుక లేకపోవడంతో శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న ఇసుకపైనే ఆధారపడుతున్నారు. ఒక వేళ నిజంగా రీచ్‌ల వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయక పోయినప్పటికీ జిల్లాలోని ఇసుకనే ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తున్నట్టుగా చెబుతూ లోడింగ్, అన్లోడింగ్, దూరాభారాన్ని బట్టి రవాణా చార్జీలు కలిపి భారీగానే వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇసుక పంపిణీ బాధ్యత కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించనుండ డంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వీరిని అడ్డంపెట్టుకుని స్థానిక టీడీపీ ప్రజాప్రతి నిధులు అడ్డంగా దోచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక వైపు ఇసుక మాఫియా.. మరో వైపు టీడీపీ నేతలు పేదల పేరిట అడ్డగోలుగా తవ్వకాలు సాగించి దర్జాగా సొమ్ముచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాటి రూపురేఖలు మారిపోతాయి ఇప్పటికే చాలా వరకు వాగులు..వంకలు ఎండిపోతున్నాయి. మరోనెలరోజుల్లో జిల్లా లోని నదుల్లో కూడా నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటి పోతుంది. దీంతో బయట కొచ్చే ఇసుకను ఇష్టమొచ్చినట్టుగా తవ్వే అవకాశం ఉంది. జిల్లాలో నదులన్నీ థర్డ్ ఆర్డర్ పరిధిలోనివే. వాటిలో ఇసుకతవ్వకాల కోసం స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుంటే చాలు. పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక తవ్వకాలతో తాండవ రిజర్వాయర్‌కు ముప్పువాటిల్లే అవకాశాలు లేకపోలేదు. ఇక నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థలకు సీనరేజ్‌లో వాటాలు దక్కేవి. ప్రస్తుతం సీనరేజ్ వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తే ఆ మేరకు వాటి ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. ఉచితంపై నిఘా ఉంటుంది ఇసుకను నిత్యావసరాల చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పేదలు, ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు రాలేదు. ఎంత ఉచితంగా ఇచ్చినా..తవ్వకాలు..అమ్మకాలపై ఆయా శాఖల నిఘా ఉంటుంది. -సూర్యచంద్రరావు, ఏడీ, మైన్స్, -
డ్వాక్రాలకు ఇసుక ర్యాంపులు హుళక్కే?
అనకాపల్లి సర్కిల్ నదుల్లో అధికారుల పరిశీలన శారద, తాండవ పరిధిలో అధికారిక రీచ్‌లు లేనట్టే వరహా నదిలో మూడింటి అనుమతికి అవకాశం తుది నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే అనకాపల్లి : ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అనకాపల్లి సర్కిల్ పరిధిలో అధికారికంగా వాటిని నిర్వహించే వీలు లేకుండాపోతోంది. అనకాపల్లి సర్కిల్ భూగర్భ గనుల శాఖ పరిధిలో ఏ ఏ చోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించవచ్చో తెలుసుకొనేందుకు వివిధ శాఖల అధికారులు చేపట్టిన సంయుక్త సర్వేలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అనకాపల్లి సర్కిల్లోని జాజిగెడ్డ- 1, 2, కల్యాణపులోవ, తాండవ రిజర్వాయర్ పరిధిలో స్వయం సహా యక గ్రూపులు రీచ్‌లు నిర్వహించేం దుకు సరిపడా ఇసుక లేదని అధికారులు కొద్దిరోజుల క్రితం తేల్చారు. తాజాగా నదుల్లో ఇసుక రీచ్ లు ఏ ఏ చోట్ల నిర్వహించవచ్చో అంచనా వేసేం దుకు భూగర్భ గనుల శాఖ, నీటి పారుదల శాఖ, భూగర్భ జల వనరుల శాఖకు చెందిన బృందాలు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ శారదా, వరహా, తాండవ, సర్ప నదు ల్లో సర్వే చేపట్టాయి. 39 ప్రాంతాల్లో ఇసుక తవ్వకానికి గల అవకాశాలు, సాంకేతిక అవరోధాలను పరిశీలించాయి. వాల్టా చట్టం అవరోధంగా మారడంతో ఒక్క వరహా నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే మూడుచోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సర్వేలో గుర్తిం చాయి. అయితే సర్వే బృందం సమర్పించిన నివేదిక పరిశీలించి నిర్ణయం తీసుకునేది కలెక్టర్ కావడంతో ఎన్ని రీచ్‌లకు అనుమతి లభిస్తుందనేది ఉత్కంఠగా ఉంది. 21 మండలాలతో విశాలంగా ఉండే అన కాపల్లి సర్కిల్ పరిధిలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు అవకాశాలు లేకపోవడం డ్వాక్రా గ్రూపులకు నిరాశ కల్గించినట్టే. అక్రమార్కులపై చర్యలు శూన్యం అనధికారికంగా ఇసుక ర్యాంప్‌లు నిర్వహిస్తున్న వారిని అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోవాల్సింది మండల స్థాయి అధికారులని చెప్పి తప్పించుకుం టున్నారు. -
తాండవ, రైవాడ నీరు విడుదల
నాతవరం/దేవరాపల్లి : జిల్లాలోని తాండవ, రైవాడ జలాశయాల నీటిని ఆయకట్టు భూములకు బుధవారం విడుదల చేశారు. రైవాడ నుం చి 250 క్యూసెక్కుల నీటిని మాడుగుల ఎమ్మె ల్యే బూడిముత్యాలనాయుడు విడుదల చేయ గా, తాండవ నుంచి 230 క్యూసెక్కులు డీఈ షణ్ముఖరావు వదిలారు. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఎస్ఈ ఎన్.రాంబాబు రైవా డ జలాశయాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు డీఈఈ ఎ.సునీతను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం రెగ్యులేటింగ్ గేట్లు, జనరేటర్ రూమ్‌లను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. తాండవ రిజర్వాయరు దిగువన ఉన్న వినాయక, శ్రీనల్లగోండమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మూహర్తం ప్రకారం పూజలు చేసి ప్రధాన గే ట్లు ఎత్తి నీటిని విడుద ల చేశారు. డీఈ మాట్లాడుతూ విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు పరిధి ఆరు మండలాల్లోని 51,640 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు,ఎడమ కాలువు ద్వారా 180 క్యూసెక్కులు తాండవ కాలువులోకి విడుదల చేశామన్నారు. క్రమేపి రెండు కాలువుల ద్వారా 550 క్యూసెక్కులు నీటిని అయకట్టుకు విడుదలకు ఏర్పాట్లు చేశామన్నారు. గతేడాది తుఫాన్లప్పుడు కుడి, ఎడమ కాలువలకు 52 చోట్ల గండ్లు పడ్డాయని, వాటి మరమ్మతులకు రూ.3.5కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నీరు వృథా కాకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్యేల్యే వేచలపు శ్రీరామమూర్తి, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చెర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, నాతవరం ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు, మండల టీడీపీ అధ్యక్షుడులాలం అచ్చిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కాశపు నూకరాజు, జేఈ వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు. రైవాడ నుంచి.... మండలంలోని రైవాడ జలాశయం నుంచి ఆ యకట్టు భూములకు 250 క్యూసెక్కుల నీటిని బుధవారం సాయంత్రం మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు విడుదల చేశారు. ఖరీఫ్ వరినాట్లుకు నీరు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని సాగునీటి సంఘా ల ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎడమకాలువ ద్వారా 175 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 75 క్యూసెక్కుల నీరు విడుదలకు అధికారులు అంగీకరించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎస్ఈ ఎన్.రాంబాబు సమక్షంలో ఎమ్మెల్యే ముత్యాలునాయుడు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు భూ ములకు సైతం సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషిచేయాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. జీవీఎంసీ బకాయిలు విడుదల చేయాలి: ఎమ్మెల్యే బూడి తాగునీటి అవసరాల కోసం రైవాడ నుంచి నీటిని తీసుకుంటున్న జీవీఎంసీ సుమారు రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇందుకు ఇరిగేషన్ అధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు ఎస్ఈ ఎన్.రాంబాబును కోరారు. అలాగే జలాశయంలో పూడికతీత, విద్యుత్ పునరుద్ధరణ, పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఎస్ఈకి వివరించారు. కార్యక్రమంలో డీఈఈ ఎ.సునీత, ఏఈ అర్జున్, జలాశయం చైర్మన్ బొడ్డు వెంకటరమణ, నీటిసంఘాల అధ్యక్షులు రెడ్డి బలరాం, తాతంనాయుడు, దొగ్గ భూషణం, కర్రి సత్యం, వి.రామునాయుడు, చలుమూరి చంద్రమోమన్, వంటాకు సింహాద్రప్పడు, మతల రాజునాయుడు, వల్లునాయుడు పాల్గొన్నారు. -
కరకట్టరా!
‘నేతి బీరకాయలో నెయ్యి ఉండ’దన్నది ఎంత నిజమో.. నేతల వాగ్దానాలు వాస్తవరూపం దాల్చవన్నది అంతే అక్షర సత్యమని మరోసారి నిర్ధారణ అయింది. తుని పట్టణ ప్రజలను నీటిముప్పు నుంచి ఆదుకుంటామని సాక్షాత్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలింది. తాండవ నది వరద ముంపు బెడదను విరగడ చేసేందుకు ప్రతిపాదించిన కరకట్ట నిర్మాణం మొదలు కాకుండానే కంచికి చేరిన కథలా అనిపిస్తోంది. దీంతో తుని, పాయకరావుపేట ప్రజలను తాండవ నది వానా కాలం ‘ప్రవహించే ప్రమాదం’లా భయపెడుతూనే ఉంది. తుని, న్యూస్‌లైన్ :తాండవ రిజర్వాయర్ నుంచి వరదల సమయంలో విడుదల చేసే నీటి వల్ల తుని, పాయకరావుపేట పట్టణాలు ముంపునకు గురవడం ఏటా జరుగుతున్నదే. 1990, 2012లలోనైతే వరద బీభత్సానికి ఈ జంట పట్టణాల్లోని ప్రజలు కకావికలం అయ్యారు. వేలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అల్లాడారు. తుని-విశాఖజిల్లాల పరిధిలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు విశాఖ జిల్లా నాతవరం వద్ద తాండవ ప్రాజెక్టును నిర్మించారు. కుడి, ఎడమకాలువల ద్వారా రెండు జిల్లాల్లో ఎనిమిది మండలాల పరిధిలోని భూములకు సాగునీరు లభిస్తుంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు. నీటిమట్టం 375 అడుగులు దాటితే వరదనీటిని తాండవనదిలోకి విడుదల చేస్తారు. తాండవ నదీపరివాహక ప్రాంతం నాతవరం నుంచి పెంటకోట వరకు 35 కిలోమీటర్ల మేర ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వరదకాలువ వంద అడుగుల వెడల్పు ఉండేది. క్రమేపీ ఇసుక మేటలు, నది గమనంలో మార్పు వల్ల ఇరుకుగా మారింది. దీనికి తోడు ఇసుక తవ్వకాలు, ఆక్రమణల వల్ల నదిలో ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. 1990లో వచ్చిన వరదల వల్ల తునిలో పదివార్డులకు చెందిన ప్రజలు సర్వస్వం కోల్పోయారు. అయినా వరద నివారణ చర్యలు చేపట్టలేదు. 2012 నవంబరు నాలుగున నీలం తుపాను కారణంగా తాండవనది ఉగ్రరూపం దాల్చింది. దీని ప్రభావానికి తుని-పాయకరావుపేట పట్టణాలకు చెందిన 19 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. జనం పాట్లు పట్టని ప్రజాప్రతినిధులు వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదు. తుని నుంచి రికార్డుస్థాయిలో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, కాంగ్రెస్‌కు చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు రాజా అశోక్‌బాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎం.ఎం.పళ్లంరాజు, తోట నరసింహం తాండవ నది కరకట్ట పనులపై కనీస శ్రద్ధ చూపలేదు. తమను ఎన్నుకున్న ప్రజల కష్టాలు తొల గించాలన్న పూనికే వారిలో కానరాలేదు. తొంగిచూడని ఇంజనీర్ ఇన్ చీఫ్.. 2012లో తాండవ నది ముంపు ప్రాంతాల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. కట్రాళ్లకొండ వద్ద ఉన్న భూమి రిజర్వాయర్‌ను పరిశీలించారు. కుమ్మరిలోవ తపోవనం నుంచి ఇసుకలపేట వరకు 2.5 కిలోమీటర్ల కరకట్ట నిర్మించాలని, దానికి సంబంధించి అంచనాలను రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కరకట్ట నిర్మాణానికి రూ.28 కోట్లు అవుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు. 2012 డిసెంబరులోనే కరకట్ట నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఆవగింజంత పని కూడా చేసిన దాఖలాలు లేవు. ముందుగా రూపొం దించిన డిజైన్లలో పదిమీటర్ల ఎత్తున సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.28 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే గోడ ఎత్తు తగ్గించి కొత్త డిజైన్ రూపొందించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనికి సంబంధించి తమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్షేత్ర స్థాయి పర్యటనకు వస్తారని అప్పట్లో ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే 2014 జనవరి వచ్చినా ఆ ఊసే లేదు. సామగ్రి అంతా వరద పాలు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు తాండవ నది వల్ల ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. 2012లో వచ్చిన వరద వల్ల ఇంట్లోని సామగ్రి అంతా కోల్పోయాము. శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమీ లేవు. - కర్రి నాగేశ్వరరావు, తుని వరదొస్తే మళ్లీ దుర్గతే.. నీలం తుపాను సమయంలో వరదనీటి వల్ల ఇబ్బందులు పడ్డాం. అప్పట్లో వరదనీరు రాకుండా రక్షణ గోడ నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. వరదలు వస్తే మళ్లీ ముంపులోనే గడపాల్సిన పరిస్థితి మాది. - తరిపే సుశీల, తుని -
జలతాండవం
=ప్రమాదస్థాయిలో జలాశయం నీటిమట్టం =విడుదలకు అధికారులు సన్నద్ధం =పొలాల్లో నీరున్నందున ససేమిరా అంటున్న రైతులు నాతవరం, న్యూస్‌లైన్: తాండవ రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం సాధారణ నీటిమట్టం 380అడుగులు. 378 అడుగులకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీచేస్తారు. నాతవరం, పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని మండలాల ప్రజలను అప్రమత్తం చేసి స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 376.6అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో రోజుకు 50 క్యూసెక్కులకు పైగా వచ్చిపడుతోంది. నాలుగు రోజుల క్రితం పంట కాలువలకు నీటి విడుదలను ఆపేశారు. ప్రస్తుతం నీటిమట్టం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి, రెండురోజుల్లో 378 అడుగులకు చేరుతుంది. తప్పని పరిస్థితుల్లో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా వరిపొలాల్లో పుష్కలంగా నీరు ఉంది. ఈ దశలో కాలువల ద్వారా నీరు విడుదలకు రైతులు ససేమిరా అంటున్నారు. పంటలు దెబ్బతింటాయని వాపోతున్నారు. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుతుండటంతో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే అధికారులు రిజర్వాయర్ నీటిమట్టంపై దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దీనిపై తాండవ వర్క్ఇన్స్పెక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఇన్‌ఫ్లో మేరకు నీటివిడుదలకు చర్యలు చేపడతామన్నారు. -
తాండవ నీరు విడుదల
నాతవరం, న్యూస్‌లైన్ : తాండవ రిజర్వాయర్ నీటిని ఆయకట్టు భూములకు ఆదివారం ఉదయం 11.15 గంటలకు విడుదల చేశారు. తొలుత జలాశయం దిగువన ఉన్న వినాయక ఆలయంలో,మెయిన్ గేట్లు వద్ద డీఈ ఎం.షన్ముఖరావు, ఏఈ చిన్నంనాయుడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని కాలువ ద్వారా విడుదల చేశారు. రోజూ కుడి,ఎడమ కాలువల ద్వారా 600 క్యూసెక్కులు పొలాలకు చేరుతుంది. తాండవనది ద్వారా పాయకరావుపేట మండలం శివారు భూములకు 35 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారు. ఇలా అయితే జలాశయంలోని 29,900 క్యూసెక్కుల నీరు సుమారు 50 రోజులకు సరిపోతుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 371.1అడుగుల నీరుంది. గతేడాది ఇదే సమయానికి నీటిమట్టం 351అడుగులు ఉంది. వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్ పరిధిలో నారుమళ్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. నీటిని వెంటనే విడుదల చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ పెరి గింది. వాస్తవంగా ఏటా ఆగస్టు రెండు లేదా మూడో వారంలో నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా డీఈ షన్ముఖరావు మాట్లాడుతూ నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు,రౌతులపూడి మండలాల పరిధిలో సాగు భూములకు నీరు సరఫరా అవుతుందన్నారు. మధ్యలో వర్షాలు కురిస్తే ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో నీరందించడానికి అవకాశం ఉంటుందన్నారు. శివారు భూములకు సజావుగా నీరందడానికి కాలువల మధ్యలో ఎలాంటి మట్టిదిబ్బలు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నామన్నారు. నీరు వృథా కాకుండా ర్రాతిపగలు తేడా లేకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండవ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు సిద్ధాబత్తుల వెంకటరమణ, మాజీ సర్పంచ్ కామిరెడ్డి కిత్తయ్యనాయుడు, కాంగ్రెస్ నాయకులు గంటా శ్రీనివాసరావు, మైనం సూర్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి షేక్జ్రాక్, వర్క్ఇన్స్పెక్టర్ అప్పారావు పాల్గొన్నారు.