కరకట్టరా! | Yet Tandava river caved in areas visited in 2012. Land located at the reservoir at katrallakonda | Sakshi
Sakshi News home page

కరకట్టరా!

Published Tue, Jan 21 2014 1:29 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Yet Tandava river caved in areas visited in 2012. Land located at the reservoir at katrallakonda

 ‘నేతి బీరకాయలో నెయ్యి ఉండ’దన్నది ఎంత నిజమో.. నేతల వాగ్దానాలు వాస్తవరూపం దాల్చవన్నది అంతే అక్షర సత్యమని మరోసారి నిర్ధారణ అయింది. తుని పట్టణ ప్రజలను నీటిముప్పు నుంచి ఆదుకుంటామని సాక్షాత్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలింది. తాండవ నది వరద  ముంపు బెడదను విరగడ చేసేందుకు ప్రతిపాదించిన కరకట్ట నిర్మాణం మొదలు కాకుండానే కంచికి చేరిన కథలా అనిపిస్తోంది. దీంతో తుని, పాయకరావుపేట ప్రజలను తాండవ నది వానా కాలం ‘ప్రవహించే ప్రమాదం’లా భయపెడుతూనే ఉంది.
 
 తుని, న్యూస్‌లైన్ :తాండవ రిజర్వాయర్ నుంచి వరదల సమయంలో విడుదల చేసే నీటి వల్ల తుని, పాయకరావుపేట పట్టణాలు ముంపునకు గురవడం ఏటా జరుగుతున్నదే. 1990, 2012లలోనైతే వరద బీభత్సానికి ఈ జంట పట్టణాల్లోని ప్రజలు కకావికలం అయ్యారు. వేలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అల్లాడారు. తుని-విశాఖజిల్లాల పరిధిలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు విశాఖ జిల్లా నాతవరం వద్ద తాండవ ప్రాజెక్టును నిర్మించారు. కుడి, ఎడమకాలువల ద్వారా రెండు జిల్లాల్లో ఎనిమిది మండలాల పరిధిలోని భూములకు సాగునీరు లభిస్తుంది. 
 
 రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు. నీటిమట్టం 375 అడుగులు దాటితే వరదనీటిని తాండవనదిలోకి విడుదల చేస్తారు. తాండవ నదీపరివాహక ప్రాంతం నాతవరం నుంచి పెంటకోట వరకు 35 కిలోమీటర్ల మేర ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వరదకాలువ వంద అడుగుల వెడల్పు ఉండేది. క్రమేపీ ఇసుక మేటలు, నది గమనంలో మార్పు వల్ల ఇరుకుగా మారింది. దీనికి తోడు ఇసుక తవ్వకాలు, ఆక్రమణల వల్ల నదిలో ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. 1990లో వచ్చిన వరదల వల్ల తునిలో పదివార్డులకు చెందిన ప్రజలు సర్వస్వం కోల్పోయారు. అయినా వరద నివారణ చర్యలు చేపట్టలేదు. 2012 నవంబరు నాలుగున నీలం తుపాను కారణంగా తాండవనది ఉగ్రరూపం దాల్చింది. దీని ప్రభావానికి తుని-పాయకరావుపేట పట్టణాలకు చెందిన 19 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి.
 
 జనం పాట్లు పట్టని ప్రజాప్రతినిధులు
 వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదు. తుని నుంచి రికార్డుస్థాయిలో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, కాంగ్రెస్‌కు చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు రాజా అశోక్‌బాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎం.ఎం.పళ్లంరాజు, తోట నరసింహం తాండవ నది కరకట్ట పనులపై కనీస శ్రద్ధ చూపలేదు. తమను ఎన్నుకున్న ప్రజల కష్టాలు తొల గించాలన్న పూనికే వారిలో కానరాలేదు. 
 
 తొంగిచూడని ఇంజనీర్ ఇన్ చీఫ్..
 2012లో తాండవ నది ముంపు ప్రాంతాల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. కట్రాళ్లకొండ వద్ద ఉన్న భూమి రిజర్వాయర్‌ను పరిశీలించారు. కుమ్మరిలోవ తపోవనం నుంచి ఇసుకలపేట వరకు 2.5 కిలోమీటర్ల కరకట్ట నిర్మించాలని, దానికి సంబంధించి అంచనాలను రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కరకట్ట నిర్మాణానికి రూ.28 కోట్లు అవుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు. 2012 డిసెంబరులోనే కరకట్ట నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఆవగింజంత పని కూడా చేసిన దాఖలాలు లేవు. ముందుగా రూపొం దించిన డిజైన్లలో పదిమీటర్ల ఎత్తున సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.28 కోట్లు అవుతుందని  అంచనా వేశారు. అయితే గోడ ఎత్తు తగ్గించి కొత్త డిజైన్ రూపొందించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనికి సంబంధించి తమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్  క్షేత్ర స్థాయి పర్యటనకు వస్తారని అప్పట్లో ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే 2014 జనవరి వచ్చినా ఆ ఊసే లేదు.
 
 సామగ్రి అంతా వరద పాలు..
 భారీ వర్షాలు వచ్చినప్పుడు తాండవ నది వల్ల ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. 2012లో వచ్చిన వరద వల్ల ఇంట్లోని సామగ్రి అంతా కోల్పోయాము. శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమీ లేవు. 
 - కర్రి నాగేశ్వరరావు, తుని
 
 వరదొస్తే మళ్లీ దుర్గతే..
 నీలం తుపాను సమయంలో వరదనీటి వల్ల ఇబ్బందులు పడ్డాం. అప్పట్లో వరదనీరు రాకుండా రక్షణ గోడ నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. వరదలు వస్తే మళ్లీ ముంపులోనే గడపాల్సిన పరిస్థితి మాది.
 - తరిపే సుశీల, తుని
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement