=ప్రమాదస్థాయిలో జలాశయం నీటిమట్టం
=విడుదలకు అధికారులు సన్నద్ధం
=పొలాల్లో నీరున్నందున ససేమిరా అంటున్న రైతులు
నాతవరం, న్యూస్‌లైన్: తాండవ రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం సాధారణ నీటిమట్టం 380అడుగులు. 378 అడుగులకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీచేస్తారు. నాతవరం, పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని మండలాల ప్రజలను అప్రమత్తం చేసి స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 376.6అడుగులు ఉంది.
ఇన్‌ఫ్లో రోజుకు 50 క్యూసెక్కులకు పైగా వచ్చిపడుతోంది. నాలుగు రోజుల క్రితం పంట కాలువలకు నీటి విడుదలను ఆపేశారు. ప్రస్తుతం నీటిమట్టం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి, రెండురోజుల్లో 378 అడుగులకు చేరుతుంది. తప్పని పరిస్థితుల్లో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా వరిపొలాల్లో పుష్కలంగా నీరు ఉంది.
ఈ దశలో కాలువల ద్వారా నీరు విడుదలకు రైతులు ససేమిరా అంటున్నారు. పంటలు దెబ్బతింటాయని వాపోతున్నారు. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుతుండటంతో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే అధికారులు రిజర్వాయర్ నీటిమట్టంపై దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దీనిపై తాండవ వర్క్‌ఇన్‌స్పెక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఇన్‌ఫ్లో మేరకు నీటివిడుదలకు చర్యలు చేపడతామన్నారు.
జలతాండవం
Published Mon, Nov 25 2013 1:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement