Kotananduru
-
కోటనందూరు పీహెచ్సీలో శిశుమరణం
సాక్షి, కోటనందూరు: కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశుమరణం సంభవించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం స్థానిక పీహెచ్సీ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యాధికారి, వైద్య, పారామెడికల్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇదీ పరిస్థితి ఈనెల 26వ తేదీ శనివారం కోటనందూరుకు చెందిన గర్భిణి లక్ష్మీ రాధను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. రెగ్యులర్ స్టాఫ్‌నర్సు సెలవులో ఉండడంతో ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న హెచ్వీ, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు కేసును చేర్చుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారి పర్యవేక్షణలోనే లక్ష్మీరాథ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు నైట్ డ్యూటీ స్టాఫ్‌నర్సు విధులకు హాజరయ్యారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ గర్భిణీ పరిస్థితి అంతా సవ్యంగానే ఉంది. డెలివరీ సమయం సమీపించడంతో హెచ్వీ, ఫార్మాసిస్టు సహకారంతో స్టాఫ్‌నర్సు రాత్రి 10.15 నిమిషాలకు ప్రసవం చేసారు. పసికందు పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడ డాక్టర్లు ధ్రువీకరించారు. ఎటువంటి సమాచారం లేదు: వైద్యాధికారి ఈ విషయంపై వైద్యాధికారి ఇందిరాప్రియదర్శిని వివరణ కోరగా శనివారం అంతా ఎన్సీడీసీడీ సర్వేలో ఉన్నామని, ఈ కేసు సమాచారం తనకు తెలియదని చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాక రాత్రి 12.30 గంటలకు సమాచారమిచ్చారన్నారు. ఆదివారం ఉదయం వచ్చి కేసును పరిశీలించానన్నారు. డీడీఓ వైద్యాధికారి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పనిభారం పెరిగిందని, ప్రసవాల విషయంలో అప్రమత్తంగా ఉంటామని వివరించారు. (చదవండి: అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..) సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం వైద్యాధికారి విధుల్లో లేరని, సిబ్బంది, మెడికల్ అధికారి మధ్య సమన్వయం కొరవడడంతోనే సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శిశువు బొడ్డు దగ్గర ప్రేగు మెడకు చుట్టుకోవడం, చేయి మడత పడి ఉండడం వల్ల శిశువు ఇబ్బందులకు గురైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం స్కానింగు రిపోర్ట్‌లో ఎక్కడా లేకపోవడం, డెలివరీ సమయం సమీపించడంతో ఇక్కడ ప్రసవం చేసామని వివరించారు. స్కానింగ్ రిపోర్ట్ అంతా సవ్యంగా ఉండడంతోనే ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు చెప్పారు. -
మాయగాడి వలలో చిక్కుకొని..
సాక్షి, కాకినాడ : హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆ మాయగాడి వలలో పడింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లు సహజీవనం చేశారు. ఓ బిడ్డను కన్నారు. చివరికి ఆ యువతిని అతగాడు వంచించాడు. ‘ఎవడి దగ్గర బిడ్డను కన్నావంటూ అత్యంత అవమానకరంగా, నీచంగా మాట్లాడి, ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి నెల రోజుల ఆడ శిశువుతో ఆ యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఆమె కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కేసిరెడ్డి పాండు, లక్ష్మి దంపతుల కుమార్తె నందిని. ఆమెకు 2013లో వరంగల్‌కు చెందిన మేనమామతో వివాహమైంది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో కొద్ది రోజులకే తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకుండా ఓ ఇంట్లో పనికి చేరింది. 2016లో ఓ మొబైల్ షాపులో చేరింది. అదే సమయంలో కోటనందూరు మండలం ఎస్సార్ పేట గ్రామానికి చెందిన అన్నంరెడ్డి నూకరాజు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. నందినితో అతడు పరిచయం ఏర్పరచుకున్నాడు. నందిని పరిస్థితులు తెలుసుకున్న నూకరాజు పెళ్లి చేసుకుంటానని, తన దగ్గరకు వచ్చేయమని కోరాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఆ మాటలు నమ్మి, అతడి వద్దకు చేరింది. నెల రోజుల పసికందుతో బాధితురాలు నందిని నందిని ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకున్న నూకరాజు మోసపూరితంగా వ్యవహరించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించేందుకు హైదరాబాద్‌లోని ఒక గుడిలో దండలు మార్చి, పెళ్లయ్యిందనిపించాడు. అలా సహజీవనం ప్రారంభించిన కొంత కాలానికి నందిని గర్భవతి అయ్యింది. దీంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడు. ఆ తరువాత మళ్లీ తన ఇంట్లో అందరి సమక్షంలోనూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మళ్లీ గర్భవతి కావడంతో రెండోసారి కూడా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నందిని తిరస్కరించింది. అప్పటి నుంచీ అల్లర్లు, గొడవలతో వారి జీవనం సాగేది. ఈ నేపథ్యంలో ప్లేటు ఫిరాయించిన నూకరాజు ‘‘ఎవడి దగ్గర బిడ్డని కన్నావు? నిన్ను పెళ్లి చేసుకోను’’ అని నీచంగా మాట్లాడుతూ ముఖం చాటేశాడు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకొనేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామం ఎస్సార్ పేట వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నందిని ఆదివారం సాయంత్రం నెల రోజుల తన పసిబిడ్డతో ఎస్సార్ పేట చేరుకుంది. అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. నూకరాజు కుటుంబ సభ్యులు గెంటేయడంతో తన బిడ్డతో పక్కవారింట్లో తల దాచుకొంది. అయిన వారందరినీ కోల్పోయిన తాను నూకరాజుతోనే జీవిస్తానని, తనకు పుట్టిన బిడ్డకు నూకరాజే తండ్రని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. స్థానికుల సహకారంతో కోటనందూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి : నపుంసకునితో వివాహం చేశారని.. -
స్త్రీనిధి రుణ లక్ష్యం రూ.85 కోట్లు
కోటనందూరు : ఈ ఏడాది జిల్లాలో రూ.85 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు డీజీఎం రాజశేఖరరావు తెలిపారు. స్థానిక మహిళా సమాఖ్యను సోమవారం సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే రూ.19 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు. స్త్రీనిధి రుణాల రికవరీ 75 శాతం మాత్రమే ఉందన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి 100 శాతం రికవరీకి ప్రయత్నిస్తున్నామన్నారు. రౌతులపూడి, ప్రత్తిపాడు, రంగంపేట, పెదపూడి, తాళ్ళరేవు మండలాల్లో రూ.3 కోట్ల వరకూ మొండి బకాయిలున్నాయన్నారు. వీటిలో రూ.1.6 కోట్ల వరకూ దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. రౌతులపూడి సమాఖ్యలో రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్నారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ములగపూడి, బలరాంపురం, గంగవరం, లచ్చిరెడ్డిపాలెం, రాజవరం, మల్లంపేట గ్రామాల సిబ్బందిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రాజశేఖరరావు వివరించారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
భార్యను కడతేర్చిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు కోటనందూరు (తుని) :కలకాలం కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధం చిచ్చురగిల్చింది. భార్యను భర్తే కడతేర్చిన సంఘటన కోటనందూరు మండలం అల్లిపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లిపూడికి చెందిన రుత్తల రాఘవ (45)ను భర్త రుత్తల సత్యనారాయణ అలియాస్ రాంబాబు హత్య చేశాడు. కాకినాడకు చెందిన రాఘవకు అల్లిపూడికి చెందిన సత్యనారాయణతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె హేమనిలక్ష్మి విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. కుమారుడు భాస్కర్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు. రాఘవకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, బుధవారం అర్ధరాత్రి సమయంలో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సమయంలో వీరిద్దరూ కలిసి ఉండడం చూశాడు. దీంతో ఆగ్రహం చెందిన సత్యనారాయణ గట్టిగా కేకలు వేయడంతో బయట వ్యక్తి పలాయనం చిత్తగించాడు. రాఘవ, సత్యనారాయణ ఇద్దరు ఘర్షణ పడ్డారని, పెనుగులాటలో రాఘవ ఇంట్లో ఉన్న రాతిరోలుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్రగాయమై అక్కడకక్కడే మృతి చెందిందని కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. మృతురాలి సోదరుడు నాళం దుర్గాప్రసాద్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ఎస్సై గోపాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక వీఆర్వో సమక్షంలో పంచనామా చేసి తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
‘పథకం’ నీటిపాలు!
కోటనందూరు, న్యూస్‌లైన్ : భారీ మంచినీటి పథకానికి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన తూరను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మూసివేశారు. తుని నియోజక వర్గంలోని 82 గ్రామాలకు తాగునీరు అందించేందుకు తలపెట్టిన మంచినీటి పథకానికి నీటిని తీసుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల మండలంలోని అల్లిపూడిలో నిర్మిస్తున్న మంచినీటి శుద్ధి ప్లాంట్‌కు సమీపంలోని విశాఖ జిల్లా నాతవరం మండలంలోని చినగొలుగొండపేట సమీపంలో విశాఖపట్నానికి నీటిని సరఫరా చేసే ఏలేరు ఏడమ కాలువకు తూరను ఏర్పాటు చేశారు. మంగళవారం జీవీఎంసీ, విస్కో బృందం కాలువ తనిఖీ చేస్తుండగా, మంచినీటి పథకానికి వేసిన తూర కంట పడింది. దీంతో ఆగ్రహించిన అధికారుల బృందం తక్షణమే తూర మూసివేయాలంటూ ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు నీటిని తీసుకునేందుకు తమకు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. జీవీఎంసీ అధికారులకు ఆ ఉత్తర్వులు అందకపోవడంతో శనివారం కాలువకు నీటి విడుదలను దృష్టిలో ఉంచుకుని తూరను మూసివేసినట్టు జీవీఎంసీ వర్క ఇన్స్పెక్టర్ వేణు తెలిపారు. ఉత్తర్వులు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరో ఐదు రోజుల గడువు కోరినట్టు చెప్పారు. ‘మూసుకుపోయిన’ ఆశలు భారీ మంచినీటి పథకానికి నీటిని సర ఫరా చేసేందుకు ఏలేరు కాలువకు ఏర్పాటు చేసిన తూరను జీవీఎంసీ అధికారులు మూసివేయడంతో నీటి సేకరణ ఆశలు మరోమారు మూసుకుపోయాయి. ఈ మంచినీటి పథకానికి మొదట తాండవ జలాశయం నుంచి నీటిని తీసుకోవాలని అనుమతులు పొందినా, ఆయక ట్టు రైతులు ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపి, ఏలేరు రిజర్వాయర్ నీటిని అందించేందుకు అధికారులు అనుమతులు పొందారు. అయినా ఈ కాలువపై పూర్తి అధికారం తమకే ఉందని, ఎవరికీ అనుమతి ఇవ్వలేదని విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లయి కంపెనీ తేల్చిచెప్పింది. ఇందులో భాగంగానే మంచినీటి పథకానికి వేసిన తూరను తొలగించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఏలేరుతో సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు నీటి సేకరణ సమస్య మొదటికి రావడంతో తలపట్టుకోవాల్సి వచ్చింది. -
జలతాండవం
=ప్రమాదస్థాయిలో జలాశయం నీటిమట్టం =విడుదలకు అధికారులు సన్నద్ధం =పొలాల్లో నీరున్నందున ససేమిరా అంటున్న రైతులు నాతవరం, న్యూస్‌లైన్: తాండవ రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం సాధారణ నీటిమట్టం 380అడుగులు. 378 అడుగులకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీచేస్తారు. నాతవరం, పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని మండలాల ప్రజలను అప్రమత్తం చేసి స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 376.6అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో రోజుకు 50 క్యూసెక్కులకు పైగా వచ్చిపడుతోంది. నాలుగు రోజుల క్రితం పంట కాలువలకు నీటి విడుదలను ఆపేశారు. ప్రస్తుతం నీటిమట్టం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి, రెండురోజుల్లో 378 అడుగులకు చేరుతుంది. తప్పని పరిస్థితుల్లో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా వరిపొలాల్లో పుష్కలంగా నీరు ఉంది. ఈ దశలో కాలువల ద్వారా నీరు విడుదలకు రైతులు ససేమిరా అంటున్నారు. పంటలు దెబ్బతింటాయని వాపోతున్నారు. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుతుండటంతో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే అధికారులు రిజర్వాయర్ నీటిమట్టంపై దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దీనిపై తాండవ వర్క్ఇన్స్పెక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఇన్‌ఫ్లో మేరకు నీటివిడుదలకు చర్యలు చేపడతామన్నారు.